Heart Health: వయసుతో సంబంధం లేకుండా గుండె జబ్బులు వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా 20 ఏళ్లకే గుండెపోటు బారినపడి మరణిస్తున్న వారి సంఖ్య అధికంగా ఉంది. అందుకే గుండెకు ప్రత్యేకంగా రక్షణ అవసరం. ఇప్పటికే గుండె వ్యాధుల బారిన పడిన వారు, గుండె వ్యాధి బారిన పడకుండా జాగ్రత్త పడాలి అనుకునేవారు కొన్ని రకాల పానీయాలను తాగడం ద్వారా గుండెకు కాపాడుకోవచ్చు. ఈ పానీయాలన్నీ ఇంట్లో సులభంగా తయారు చేసుకునేవే. మన దేశంలో హృద్రోగ రోగుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ముఖ్యంగా చెడు జీవనశైలి, అధిక ఒత్తిడి, ఆహారపు అలవాట్లలో మార్పుల కారణంగానే గుండెవ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. వ్యాయామానికి దూరంగా ఉండటం వల్ల కూడా గుండె జబ్బులు వస్తున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. గుండెను కాపాడుకోవడం కోసం ఎలాంటి పానీయాలు తాగాలో తెలుసుకుందాం.


బీట్రూట్ ఆరోగ్యకరమైనది. దీనిలో నైట్రేట్లు ఉంటాయి. ఇవి శరీరంలో చేరాక నైట్రిక్ ఆక్సైడ్ గా మారతాయి. అలాగే క్యారెట్లలో కూడా నైట్రేట్లు ఉంటాయి. బీట్రూట్, క్యారెట్ కలిపి జ్యూస్‌గా చేసి తాగితే ఎంతో మంచిది. ఇవి రక్తప్రసారాన్ని మెరుగుపరుస్తాయి. రక్తనాళాలను శుభ్రపరుస్తాయి. దీనివల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.


పాలకూరతో చేసే జ్యూస్ కూడా ఆరోగ్యానికి మంచిది. రుచి గురించి ఆలోచించకుండా పాలకూర జ్యూస్‌ను తాగేయాలి. దీనిలో విటమిన్ కె అధికంగా ఉంటుంది. నైట్రేట్లు కూడా ఉంటాయి. ఈ పోషకాలు ధమనులను రక్షిస్తాయి. అది గుండె పోటు రాకుండా తగ్గిస్తాయి. అధిక రక్తపోటు లేకుంటే గుండె జబ్బు వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. పాలకూరలో కాస్త నీళ్లు వేసి మిక్సీలో జ్యూస్ చేసుకోవడమే. వడకట్టి ఆ నీటిని తాగేయడమే.


బ్రోకోలి అన్ని సూపర్ మార్కెట్లలో లభిస్తుంది. దీనిలో గుండెలోని ధమనులను కాపాడే లక్షణం ఉంటుంది. కాబట్టి బ్రోకోలిని కాస్త నీరు కలిపి జ్యూస్‌గా చేసుకుని తాగితే మంచిది. లేదా సూప్‌గా వండుకొని తిన్న గుండెను కాపాడుకోవచ్చు. కేవలం గుండెపోటు రాకుండా మాత్రమే కాదు, ఎన్నో రకాల వ్యాధులను రాకుండా బ్రకోలి అడ్డుకుంటుంది.


కీరాదోసకాయ అన్ని కాలాల్లో దొరుకుతుంది. ఈ దోసకాయ ఆరోగ్యానికి ఎంతో మంచిది. శరీరాన్ని తేమవంతంగా ఉంచుతుంది. దీనిలో 95% నీరే ఉంటుంది. ఈ దోసకాయను నేరుగా తిన్నా లేక దోసకాయను జ్యూస్‌గా మార్చుకొని తాగిన మంచిదే. ఇది ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి గుండెను రక్షిస్తుంది.


పుదీనా వాసన పీలిస్తేనే ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. ఇక తింటే ఎంతో ఆరోగ్యం. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించే శక్తి పుదీనాలో ఉంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం రోజూ చిన్న గ్లాస్ తో పుదీనా రసాన్ని తాగడం అలవాటు చేసుకోండి.


Also read: ఈ లక్షణాలు కనిపిస్తే పక్షవాతం వచ్చే అవకాశం ఉందని అర్థం





గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.