Stroke Symptoms: పక్షవాతాన్ని స్ట్రోక్ అని కూడా పిలుస్తారు. పక్షవాతం బారిన పడితే జీవితమే మారిపోతుంది. ఎవరో ఒకరి మీద ఆధారపడి మాత్రమే జీవించాల్సి వస్తుంది. మెదడులో రక్త సరఫరాకి అంతరాయం కలిగినప్పుడే ఈ స్ట్రోక్ వస్తుంది. లేదా మెదడులో రక్తస్రావం జరిగిన కూడా ఇలా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. ఇలా స్ట్రోక్ వచ్చినప్పుడు సరైన చికిత్స త్వరితగతిన తీసుకుంటేనే నయమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి స్ట్రోక్ వచ్చే ముందు కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. వాటిని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.


బలహీనంగా అనిపించడం, అకస్మాత్తుగా తిమ్మిరి పట్టడం వంటివి జరుగుతాయి. ముఖ్యంగా  కాలు, చేయి వంటివి ఒకవైపు లాగుతూ ఉంటాయి. నవ్వినప్పుడు ఒకవైపుకు ముఖం లాగినట్టు అవుతుంది. ఇది స్ట్రోక్ వస్తుంది అని చెప్పడానికి ఒక సూచన. మాటలు కూడా అస్పష్టంగా వస్తాయి. మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నారంటే వారు జాగ్రత్తగా ఉండాలి. అది స్ట్రోక్ వల్ల కూడా కావచ్చు. ఏదైనా విషయాన్ని చెప్పినప్పుడు వారు అర్థం చేసుకోవడానికి ఇబ్బంది పడతారు. చాలా సమయం తీసుకుంటారు. గందరగోళంగా కనిపిస్తారు. అలాంటివారు కూడా స్ట్రోక్ బారిన పడే అవకాశం ఉంది. 


తలనొప్పి ఆకస్మికంగా వచ్చి పోతూ ఉంటుంది. రక్తస్రావం కారణంగా ఇలా జరిగే అవకాశం ఉంది. తలలో హఠాత్తుగా తీవ్రమైన నొప్పి వచ్చి పోతుందంటే అది మెదడులో రక్తస్రావం జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. అలాగే చూపు కూడా అస్పష్టంగా మారిపోతుంది. ఎదురుగా ఉన్న వస్తువులు ఒకటి రెండుగా కనిపించడం మొదలవుతుంది. మైకం కమ్మినట్టు అవుతుంది. తల తిరగడం వంటివి కనిపిస్తాయి. నడిచే సమయంలో కూడా బ్యాలెన్స్ ఉండదు. అడుగులు సరిగా వేయలేక ఇబ్బంది పడతారు. ఇవన్నీ కూడా స్ట్రోక్ ప్రారంభ లక్షణాలు. ఈ ప్రారంభ దశలో కనిపించే లక్షణాలను వెంటనే కనిపెట్టి వైద్య సహాయం తీసుకోవాలి. కొన్ని గంటల్లోనే పరిస్థితి చేయి దాటిపోవచ్చు.


ఏటా ప్రతి లక్షమందిలో 150 మంది పక్షవాతం బారిన పడుతున్నట్టు అంచనా. కోవిడ్ వచ్చిన తగ్గివన వారిలో స్ట్రోక్ వచ్చే అవకాశం పెరిగినట్టు తెలుస్తోంది. స్ట్రోక్ వచ్చాక అతి తక్కువ సమయంలోనే చికిత్స అందించాలి. లేకుంటే మెదడులోని న్యూరాన్లు నశించడం మొదలవుతాయి. కొన్ని నిమిషాల్లోనే లక్షల న్యూరాన్లను నష్టపోవచ్చు. ఇలా జరిగితే రోగి కోలుకోలేడు. మెదడు కణాలు నశించకుండా ముందే చికిత్స మొదలుపెడితే మంచిది. సిగరెట్ తాగేవారిలో, మధుమేహం, అధిక రక్త పోటు, అధిక ఒత్తిడి, అధిక కొలెస్ట్రాల్, గుండె వ్యాధులు ఉన్న వారికి పక్షవాతం వచ్చే అవకాశం ఎక్కువ. 


Also read: ఈ లడ్డూ పిల్లలకు రోజుకొకటి తినిపించండి చాలు, ప్రొటీన్ లోపమే రాదు




గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.