పచ్చని తీగ మొక్క తమలపాకు. పైపెరిసి కుటుంబానికి చెందిన మొక్కను ఆసియాలోనే అధికంగా పెంచుతారు. పురాతన కాలం నుండి తమలపాకుతో కిళ్లీ వేసుకోవడం అందరికీ అలవాటు. దీన్ని తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ఇంట్లో తమలపాకు మొక్కను పెంచుకుంటే ఎన్నో లాభాలు ఉన్నాయి. కొన్ని ఆరోగ్యసమస్యలకు ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఈ సమస్యలు కనిపించగానే వెంటనే తమలపాకును  తెంపి నమిలేసినా, లేక రసాన్ని వాడినా వెంటనే ఉపశమనం కలుగుతుంది. 


తలనొప్పి
చాలా మంది మైగ్రేన్‌తో బాధపడతారు. అలాంటివారికి తమలపాకు బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ ఆకులు శీతలీకరణ లక్షణాలను కలిగి ఉంటాయి. తలనొప్పి వచ్చినప్పుడు ఆకులను తలపై పెట్టుకుంటే ఉపశమనం కలుగుతుంది. 


చెవి నొప్పి 
చెవి ఇన్ఫెక్షన్లకు తమలపాకు బాగా పనిచేస్తుంది. తమలపాకు రసాన్ని చెవిలో వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. కొబ్బరి నూనెలో రెండు చుక్కల తమలపాకుల రసం కలుపుకుని చెవిలో వేసినా నొప్పి తగ్గుతుంది. 


దగ్గు
ఈ ఆకుల్లో యాంటీ ఇన్ఫెక్షన్ గుణాలు ఎక్కువ. దగ్గుకు బాగా పనిచేస్తుంది. తమలపాకులు, దాల్చిన చెక్క, యాలకులు వేసి మరగబెట్టాలి. ఆ నీటిని వడకట్టి తాగితే దగ్గు తగ్గుతుంది. జలుబుకు కూడా బాగా పనిచేస్తుంది. 


ఉబ్బసం
ఆస్తమా వ్యాధితో బాధపడేవారికి శ్వాసకోశ సమస్యలు వస్తాయి. తమలపాకుల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ. రోజుకో రెండు ఆకులు తింటే మంచిది. ఉబ్బసం ఉన్నవారిలో శ్వాస నాళం సంకోచిస్తుంది. ఆ సమయంలో ఇవి ఆస్తమాను నిరోధిస్తాయి. 


నోటి ఆరోగ్యం
తమలపాకు మౌత్ ఫ్రెషనర్‌గా పనిచేస్తుంది. నోటిలో ఉండే బ్యాక్టిరియాను తగ్గించడంలో సహాయపడుతుంది. అనారోగ్యాలను అరికడుతుంది. దంత క్షయం నుంచి మీ నోట్లోని దంతాలను కాపాడుతుంది.


బరువు తగ్గడం
బరువు తగ్గడానికి ప్రయత్నించే వారు తమలపాకులను ఉపయోగించుకోవచ్చు. వీటిని తినడం వల్ల శరీరకొవ్వు తగ్గుతుంది. జీవక్రియ వేగాన్ని పెంచుతుంది. 


మధుమేహం 
తమలపాకులలో ఉండే సమ్మేళనాలు రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తాయి. అందుకే రోజుకు రెండు ఆకులు తినేందుకు ప్రయత్నించండి. మధుమేహం అదుపులో ఉంటుంది. 


యాంటిసెప్టిక్‌ 
తమలపాకు రసంలో చవికోల్ అనే ఫినాల్ ఉంటుంది. ఇది ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న రోగులకు చికిత్స చేయడానికి ఉపయోగపడుతుంది. యాంటీసెప్టిక్ గుణాలు అధికంగా ఉంటాయి. 


డిప్రెషన్‌ 
నిరాశ, యాంగ్జయిటీ వంటి మానసిక సమస్యల నుంచి తమలపాకులు బయటపడేస్తాయి. ఇందులో కాటెకోలమైన్లు నిరాశను తగ్గిస్తాయి. అందుకే మానసికంగా కల్లోలంగా ఉన్నప్పుడు రోజూ తమలపాకును తినాలి. 


హీలింగ్ ప్రాపర్టీ
తమలపాకు రసంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. శరీరంపై తగిలిన గాయాలను తగ్గించడంలో కూడా ఇది ముందుంటుంది. ఆయుర్వేదంలో తమలపాకును చాలా సమస్యలకు ఔషధంగా వాడతారు. 


Also read: మీకు ఎవరి కాళ్లు కనిపిస్తున్నాయి? ఆడవారివా లేక మగవారివా? రెండూ ఒకేసారి కనిపిస్తే?



గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.