ప్రస్తుతం వయసుతో నిమిత్తం లేకుండా చాలా మంది బాధపడుతున్న సమస్య అధిక బరువు. దీనికి లైఫ్ స్టయిల్ నుంచి జెనెటిక్స్ వరకు రకరకాల కారణాలు ఉండొచ్చు. కారణం ఏదైనా ఇది అంత తేలిగ్గా తీసుకోవాల్సిన విషయం కాదని అందరికీ తెలుసు. అందుకే మార్కెట్ లో స్లిమ్మింగ్ గాడ్జెట్స్ చాలానే అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఒకటి వెయిస్ట్ బెల్ట్ లేదా కంప్రెషన్ బెల్ట్ లు కూడా ఒక రకమైనవి. ఇవి చాలా ఏళ్లుగా ప్రాచూర్యంలో ఉన్నాయి. బరువు తగ్గిస్తాయని, ముఖ్యంగా నడుము చుట్టు, పొత్తికడుపు దగ్గర పేరుకున్న కొవ్వు కరిగిస్తాయని ప్రచారం చేస్తుంటారు. 


టెలీ మార్కెట్ నిండా రకరకాల స్లిమ్మింగ్ బెల్ట్ లు కనిపిస్తూనే ఉంటాయి. ఇవి వాడి చాలా భారీ కాయాలు కూడా తగ్గించుకున్నట్టుగా చూపిస్తుంటారు. వీటిని చూస్తేనే అంత నమ్మబుద్ది కాదు. ఈ బెల్ట్ లు నడుముకు ధరిస్తే అది కేవలం శరీర ఉపరితలం మీద మాత్రమే తన ప్రభావాన్ని చూపిస్తాయి. నడుముకు ఏ వస్తువునైనా సరే బిగించి కట్టుకుంటే  సహజంగానే పొత్తికడుపు మీద చెమట వస్తుంది. ఇది కేవలం శరీరంలో అధికంగా ఉన్న నీటిని కాస్త మేర తగ్గిస్తుంది అంతే. బెల్ట్ ధరించినపుడు కరిగేది కొవ్వు కాదు కేవలం శరీరంలోని అదనపు నీరు కాస్త బయటికి వస్తుంది. అందువల్ల అప్పటికప్పుడు కాస్త సన్నబడినట్టు కనిపించవచ్చు. కానీ మీరు మళ్లీ నీళ్లు తాగి శరీరాన్ని రీహైడ్రేట్ చేసినపుడు తిరిగి పొట్ట యథాస్థితికి వస్తుంది. ఒక్క అంగుళం కూడా తగ్గదనేది వాస్తవం.


స్లిమ్మింగ్ బెల్ట్ ధరిస్తే నడుము దగ్గర కొవ్వు తగ్గిపోతుందని అందరూ అనుకుంటారు. కానీ అలా కొవ్వు తగ్గడం సాధ్యం కాదు. స్పాట్ రిడక్షన్ అనే మాటకు కానీ, ప్రక్రియకు కానీ శాస్త్రీయ ఆధారాలు లేవు. శరీరంలో నిల్వ ఉన్న కొవ్వు నెమ్మదిగా వర్కవుట్ ద్వారా మాత్రమే కరిగేందుకు ఆస్కారం ఉంటుంది. చివరగా చెప్పేదేమిటంటే ఫిట్నెస్ బెల్ట్ ల ద్వారా బిలియన్ డాలర్ల బిజినెస్ జరుగుతోంది.. తప్ప దాని వల్ల పెద్ద ఫలితాలేమీ ఉండవనేది వాస్తవం. కూర్చున్న చోట కొవ్వు కరగడం సాధ్యం కాదని మనం గుర్తుపెట్టుకోవాలి. అలాంటిది ఎవరైనా ప్రచారం చేస్తున్నారంటే అది మార్కెటింగ్ మాయాజాలం అని గుర్తించాలి.


ఆరోగ్యవంతమైన, అందమైన శరీరాకృతికి షార్ట్ కట్స్ ఉండవని గమనించాలి. కేవలం పోషకాహారం, వేళకి తినడం, సరైన సమయంలో తగినంత విశ్రాంతి తీసుకోవడం, ఒత్తిడికి దూరంగా ఉండడం, తగినంత వ్యాయామంతో మాత్రమే బరువు తగ్గడం లేదా శరీర బరువును ఆరోగ్యవంతంగా మెయింటైన్ చెయ్యడం సాధ్యమవుతుంది. ఏ బెల్ట్ ధరించినా, ఎలాంటి మందులు వేసుకున్నా కూర్చున్న చోట బరువు తగ్గడం సాధ్యపడదు. పైగా ఇతర అనారోగ్యాలకు కూడా ఈ షార్ట్ కట్స్ కారణం కావచ్చు. కనుక టెలివిజన్ లో ప్రకటనలు చూసి మోసపోవద్దు. నమ్ముకోవాల్సింది బరువు తగ్గాలన్న మన అంకిత భావం, కృషిని మాత్రమే.



Also Read: కాలేయ వాపు వల్ల మెదడు దెబ్బతింటుందా? ఈ వ్యాధి లక్షణాలు ఏంటి?