స్వీటు నచ్చని వారు ఎవరుంటారు? డయాబెటిక్ పేషెంట్లు తప్ప అందరూ తీపి అంటే ఇష్టపడేవారే. మధుమేహులు కూడా అప్పుడప్పుడు చీట్ మీల్‌లా స్వీట్ లాగిస్తుంటారు. స్వీట్ తినాలనిపించినప్పుడు కొనుక్కుని తినేవారే ఎక్కువ. ఎందుకంటే చాలా తీపి పదార్థాలు చేసేందుకు కాస్త ఎక్కువ సమయాన్ని తీసుకుంటాయి. అందుకే షాపులో ఓ అరకిలో కొని ఇంటికి తెచ్చుకుని లాగించేస్తారు. ముఖ్యంగా లడ్డూలంటే తెలుగువారికి చాలా ఇష్టం. బేసన్ లడ్డూ, కాజూ లడ్డూ, డ్రై ఫ్రూట్ లడ్డూ, బందరు లడ్డూ ఇలా ఎన్ని రకాల లడ్డూలో. కానీ వీటన్నింటినీ తయారుచేయాలంటే కాస్త సమయం పడుతుంది. కానీ కేవలం పదినిమిషాల్లో సిద్ధమైపోయే లడ్డూ కూడా ఉంది. వాటిలో ఒకటి ‘కొబ్బరి పాల లడ్డూ’. ఇది తయారుచేయడానికి మూడు రకాల పదార్థాలు ఇంట్లో ఉంటే చాలు. పదినిమిషాల్లో తయారుచేసుకుని తినేయచ్చు. 


కావాల్సిన పదార్థాలు
కొబ్బరికోరు - రెండు కప్పులు 
కండెన్సడ్ మిల్క్ - 200 గ్రాములు
యాలకుల పొడి - అరటీస్పూను


తయారీ ఇలా..
1. కొబ్బరి కాయ రెడీగా ఉంటే పచ్చి కొబ్బరిని ఉపయోగించవచ్చు. ముక్కలను మిక్సీలో వేస్తే కొబ్బరి తురుము సిద్ధమైపోతుంది. లేదా సూపర్ మార్కెట్లో దొరికే ఎండు కొబ్బరితురుమును కూడా వాడుకోవచ్చు. 


2. స్టవ్ మీద కళాయి పెట్టి కొబ్బరితురుముని వేసి వేయించాలి. తురుము రంగు కాస్త బంగారు వర్ణంలోకి మారే వరకు వేయించాలి. తరువాత స్టవ్ కట్టేయాలి. 


3.   కొబ్బరితురుములో కండెన్స్‌డ్ మిల్క్, యాలకుల పొడి వేసి కలపాలి. 


4. థిక్‌గా ఉండే కండెన్స్‌డ్ మిల్క్ మరీ అధికంగా కాకుండా, లడ్డూ చుట్టడానికి వీలయ్యేంత మందం వచ్చేలా చూసుకోవాలి. 


5. చేతికి నెయ్యి రాసుకుని ఆ మిశ్రమాన్ని లడ్డూల్లా చుట్టుకోవాలి. అంతే ‘కొబ్బరి పాల లడ్డూ ’ రెడీ. 


6. చాలా మందికి చక్కెర వేయలేదు కదా లడ్డూ తీపిగా ఉంటుందా అనే అనుమానం వచ్చి ఉంటుంది. కండెన్స్ డ్ మిల్క్ లో చక్కెర ఉంటుంది. అది చాలా తీయగా ఉంటుంది కనుక ప్రత్యేకంగా చక్కెర కలపాల్సిన అవసరం లేదు. 


7. మీకు కావాలంటే ఈ లడ్డూకి జీడిపప్పులు, పిస్తాలు, బాదం పప్పులు జోడించుకోవచ్చు. పిల్లలకు కూడా ఈ లడ్డూ నచ్చుతుంది.


Also read: కోడిగుడ్లను నీళ్లతో శుభ్రం చేస్తున్నారా? అలా చేస్తే ఎంత హానికరమో తెలుసా?


Also read: వంటగదిలో దొరికే ఈ అయిదు పదార్థాలు ముఖానికి పూయద్దు, అవేంటంటే