అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ఓ యువకుడు వినాయకుడి మండపం వద్ద డ్యాన్స్ చేస్తూ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. అతడిని హాస్పిటల్‌కు తరలించగా చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. అత్యుత్సాహంతో ఆగకుండా డ్యాన్స్ చేయడం వల్లే అతడి గుండె ఆగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మీరు తప్పకుండా గుండెకు సంబంధించిన సమస్యలు గురించి తెలుసుకోవాలి. గుండె నొప్పి రెండు రకాలుగా ఏర్పడుతుంది. ఇది వచ్చేందుకు గుండె జబ్బు ఉండాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి మనం చేసే పనులు వల్ల కూడా గుండె పోటుకు దారి తీయొచ్చు. ఏదైనా కారణం చేత గుండెకు రక్త ప్రవాహం నిలిచిపోతే.. గుండె పనిచేయడం నిలిచిపోతుంది. 


కార్డియక్ అరెస్ట్ అంటే?: గుండెలో ఏర్పడే ఎలక్ట్రానిక్ సమస్య వల్ల కార్డియక్ అరెస్ట్ అవుతుంది. అయితే, కార్డియక్ అరెస్ట్‌ను ముందుగా గుర్తించలేం. గుండెలో ఏర్పడే ఎలక్ట్రికల్ అలజడి వల్ల గుండె లయ తప్పుతుంది. దీంతో రక్త ప్రసరణకు అంతరాయం కలుగుతుంది. ఫలితంగా గుండెతోపాటు శరీరంలోని ఇతర భాగాలకు రక్త ప్రసరణ నిలిచిపోతుంది. దీనివల్ల బాధితుడు క్షణాల్లో కుప్పకూలతాడు. ఆ సమయంలో వెంటనే సీపీఆర్ ఇవ్వడం ద్వారా మళ్లీ ప్రాణం పోయవచ్చు. అయితే, పైన జరిగిన ఘటనలో అది సాధ్యం కాలేదు. వెంటనే అతడికి సీపీఆర్ చేసి ఉంటే బతికే అవకాశాలుండేవి. 


హార్ట్ ఎటాక్ అంటే?: గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల్లో ఏదైనా అంతరాయం ఏర్పడి కలిగే సమస్యే హార్ట్ ఎటాక్. దీన్ని కొన్ని లక్షణాల ద్వారా గుర్తుపట్టవచ్చు. గుండెలోని ధమనుల్లో బ్లడ్ క్లాట్స్ ఏర్పడినప్పుడు లేదా కొవ్వు పేర్కొన్నప్పుడు ఈ సమస్య ఏర్పడుతుంది. దీనివల్ల గుండెకు రక్తం సరఫరా కాదు. ఫలితంగా వ్యక్తి చనిపోయే ప్రమాదం ఉంది. ఛాతి నొప్పి ఎక్కువ సేపు ఉన్నా.. శరీర భాగాలు అసౌకర్యంగా అనిపించినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ముఖ్యంగా గుండె వైపు భాగాలు లేదా ఎడమ చేయి లాగుతున్నా.. శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండటం, చల్లని చెమటలు పట్టినా అప్రమత్తం కావాలి. కొందరిలో తలనొప్పి, వికారం కూడా లక్షణాలు కూడా కనిపిస్తాయి. 


చిన్న వయస్సులోనే గుండె సమస్యలు: ఒకప్పుడు గుండె జబ్బులు, డయాబెటీస్ వంటి రోగాలు వయస్సు పైబడిన తర్వాతే కనిపించేవి. కానీ ఈ రోజుల్లో.. అరవైలో వచ్చే వ్యాధులు ఇరవైలోనే దాడి చేస్తున్నాయి. నిండు నూరేళ్లు జీవించాల్సిన మనిషి.. మధ్యలోనే ప్రాణాలు వదిలేస్తున్నాడు. ముఖ్యంగా మన దేశంలో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉంది. చిన్న వయస్సులోనే గుండెపోటుతో ఎంతోమంది మరణిస్తున్నారు. ఇటీవల జరిపిన పలు అధ్యయనాల్లో మరెన్నో భయానక వాస్తవాలు బయటపడ్డాయి. ఇండియాలో చాలామంది 30 నుంచి 50 ఏళ్ల లోపు వయస్సులోనే తీవ్రమైన గుండె నొప్పితో మరణిస్తున్నారని తెలిసింది. చిన్న వయస్సులోనే గుండె సమస్యలకు గల కారణాల గురించి తెలుసుకొనేందుకు ఈ వార్తను క్లిక్ చేయండి: చిన్న వయసులోనే గుండెపోటు.. ప్రమాదంలో భారత యువత, కారణాలు ఇవే..