బయటకి వెళ్లాలన్నా, నలుగురితో కలివిడిగా మాట్లాడాలంటే చాలా మంది పిల్లలు భయపడతారు. దీని వల్ల పిల్లలు బాల్యం నుంచే ఎన్నో కోల్పోతారు. అలా కాకుండా వారికి ఎదుటి వారితో ఎలా మెలగాలి, తమ అభిప్రాయాలని నిర్భయంగా ఎలా చెప్పాలో తల్లిదండ్రులుగా నేర్పించాల్సిన బాధ్యత మన మీదే ఉంటుంది. తమను తాము రక్షించుకోవడానికి ఉండే పరిమితులు కూడా తెలియజేయాలి. ప్రస్తుతమున్న పరిస్తితులో వీటి గురించి తల్లిదండ్రులు పిల్లలకు తప్పనిసరిగా బోధించాలి. అప్పుడే వారి నైపుణ్య సామర్థ్యాలు పెరుగుతాయి. ఇతరులతో బంధాలు ఏర్పరుచుకోగలుగుతారు. పాఠశాల నుంచి విభిన్న వాతావరణంలో ఎలా ఉండాలో వారికి నేర్పించాలి. జీవితంలో ఎదురయ్యే అనేక సవాళ్ళు తెలివిగా ఆలోచించడం, అర్థం చేసుకోవడం, చక్కగా మాట్లాడటం నేర్పించాలి. అప్పుడే వారి భవిష్యత్ చక్కగా ఉంటుంది.
పరిమితులు చెప్పాలి
ఏది మంచి, ఏది చెడు అనేది చిన్నప్పటి నుంచి తెలియజేయాలి. ఆడపిల్లల విషయానికి వస్తే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ప్రతీ ఒక్కరికీ నేర్పించాలి. అప్పుడే వారిని వాళ్ళు సంరక్షించుకోగలగుతారు. మనం చెప్పే ప్రతీ మాట వారికి విలువైన జీవితాన్ని అందిస్తుంది. ఆడపిల్ల లేదా మగపిల్లవాడికి ఉన్న పరిమితులు గురించి బోధించాలి. ఇతరులతో ఎలా మెలగాలి, క్లిష్టమైన పరిస్థితులని ఎలా అధిగమించాలో తెలియజెప్పాలి.
కిచెన్ క్లాస్
మీతో పాటు మీ పిల్లల్ని వంటగదికి రానివ్వండి. వారితో చిన్న చిన్న పనులు చేయించడం మంచిది. కొన్ని ప్రాంతాలు, వస్తువులు, వ్యక్తిగత స్థలాల గురించి వివరంగా చెప్పాలి. కిచెన్ అంటే ఆడవారికి మాత్రమే అనే అపోహ తొలగించాలి. తల్లిదండ్రులకి పనుల్లో సాయం చేయడం వల్ల అవసరమైన సమయాల్లో వాళ్ళు వంట చేసుకునే విధంగా తీర్చిదిద్దాలి.
ఆరోగ్యకరమైన బంధం అందించాలి
గౌరవం, క్రమశిక్షణ, ఎదుటివారిని పలకరించే విధానం, మాట్లాడే తీరు అన్నింటినీ తల్లిదండ్రుల దగ్గర నుంచే పిల్లలు నేర్చుకుంటారు. ఆరోగ్యకరమైన సంబంధాలు ఏర్పరుచుకునేలా మంచి నడవడిక అందించాలి. పెద్దవాళ్ళ మాట వినడం, పాటించడం నేర్పించాలి. అర్థవంతమైన మాటలు, ఓపెన్ కమ్యూనికేషన్ వల్ల వారిలో ఆలోచనా విధానం మంచిగా వచ్చేలా ఉంటుంది. గౌరవంతో కూడిన బంధాలు ఎప్పుడూ నిలబడతాయి.
భావోద్వేగాలు ముఖ్యం
బాధ, సంతోషం, దుఖం, ఆనందం అన్నింటి గురించి పిల్లలకు తెలియజెప్పాలి. అవసరమైన వాళ్ళకి సాయం చేసే గుణం అలవాటు చేయాలి. భావోద్వేగాలు ఎలా ఉంటాయో తెలుసుకోవడం ముఖ్యం. అలాంటి పిల్లవాడు జీవితంలో ఎదురయ్యే సవాళ్ళని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. భావోద్వేగాలకు ఉండే హద్దులు వివరించాలి.
నిర్ణయం తీసుకునే నైపుణ్యం
తల్లిదండ్రులుగా ప్రతి ఒక్కరూ పాటించాల్సిన నియమం ఇది. సొంతంగా నిర్ణయం తీసుకునే నైపుణ్యం వారిలో పెంచాలి. తీసుకునే నిర్ణయాల వల్ల కలిగే లాభాలు, నష్టాలు అంచనా వేయడం చెప్పాలి. స్వీయ విశ్వాసం వారి జీవితాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్తుంది. వారి ఎదుగుదలకి దిక్సూచిగా ఉంటుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.