Best Time To Drink A Tea : టీ తాగకుండా కొందరు రోజును ప్రారంభించలేరు. చాలామందికి టీతోనే తమ డే స్టార్ట్ అవుతుంది. అలాంటివారిలో మీరు కూడా ఉన్నారా? అయితే మీరు టీ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. అసలు రోజులో టీని ఎన్నిసార్లు.. ఎంత మోతాదులో తీసుకోవచ్చు. ఎక్కువ తాగితే కలిగే నష్టాలు ఏంటి? టీని మళ్లీ మళ్లీ  వేడి చేసి తాగొచ్చా? లేదా వంటి విషయాలు ఇప్పుడు చూసేద్దాం. 


టీ లేకుండా రోజును ప్రారంభించడం కొందరికి కష్టమే కావొచ్చు. దీనివల్ల తలనొప్పి దూరమవ్వొచ్చు. అలాగే ఉదయాన్నే టీని తీసుకోవడం వల్ల మీరు యాక్టివ్​ కూడా అవ్వొచ్చు. అయితే టీని ఎక్కువగా తాగడం అనేది అస్సలు మంచిది కాదు. ఎక్కువ టీ తాగితే ఆరోగ్యానికి హానికరమని చెప్తున్నారు. అందుకే లిమిటెడ్​గా దీనిని తీసుకోవచ్చని చెప్తున్నారు. మరి రోజుకు ఎంత టీ తాగితే ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవో చూసేద్దాం. 


రోజుకు ఎన్ని కప్పుల టీ తాగొచ్చంటే.. 


టీని రోజుకు 2 లేదా మూడు కప్పులు తాగవచ్చు. అయితే దీనిలో కాస్త షుగర్ తగ్గించుకుంటే మంచిది. అలాగే పాల ఉత్పత్తులతో అలెర్జీ ఉంటే.. పాలు లేకుండా బ్లాక్ టీ తాగొచ్చు. అయితే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాల కోసం ఈ సంఖ్యను తగ్గించొచ్చు. రోజుకోసారి తాగినా పర్లేదు. ఒకవేళ మీరు రోజుకు రెండు లేదా మూడు కప్పుల కెఫిన్​ను టీ రూపంలో తీసుకోవాలనుకుంటే.. శరీరానికి కావాల్సిన ఇతర పోషకాలను బ్యాలెన్స్డ్​ డైట్​ ద్వారా అందించి బ్యాలెన్స్ చేసుకోవచ్చు. అప్పుడే టీ తాగినా హెల్తీగా ఉండగలుగుతారు. 


బెస్ట్ సమయం ఎప్పుడంటే.. 


టీ తాగడానికి కూడా బెస్ట్ సమయం ఉంటుంది. ఉదయాన్నే పరగడుపును టీ తాగడం అయితే అస్సలు మంచిది కాదు. కాబట్టి బ్రేక్​ఫాస్ట్ తర్వాత లంచ్​కి మధ్యలో తాగొచ్చు. లేదంటే లంచ్​కి డిన్నర్​కి మధ్యలో తీసుకోవచ్చు. అంతేకానీ బెడ్​ దిగిన వెంటనే టీ జోలికి వెళ్లకపోవడమే మంచిది. 


ఎక్కువ తాగడం వల్ల కలిగే నష్టాలివే.. 


టీ ఎక్కువ తాగితే ఒత్తిడి తగ్గుతుంది. ప్రశాంతంగా ఉంటారని అనుకుంటారు కానీ.. కెఫిన్​ని శరీరానికి ఇవ్వడం వల్ల విశ్రాంతి పోతుంది. నిద్రలేమి సమస్యలు, జీర్ణ సమస్యలు పెరుగుతాయి. ముఖ్యంగా కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు వస్తాయి. టీ తాగితే కాసేపు రిలీఫ్ అనిపించినా.. ఆ తర్వాత దాని ఎఫెక్ట్స్ ప్రతికూలంగా ఉంటాయి. 


టీ తాగే అలవాటు ఉండడం తప్పు కాదు. కానీ టీ బానిసగా మారితే ఆరోగ్యానికే ముప్పు. కాబట్టి మీకు ఆనందాన్ని ఇచ్చే టీని లిమిటెడ్​గా తీసుకుంటే మంచిది. అలాగే టీని ఎక్కువగా పెట్టుకుని.. ఊరికే మరిగించి తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్యంపై నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కాబట్టి మీరు ఎప్పుడు టీ తాగాలనుకున్నా అప్పటికప్పుడు ఫ్రెష్​గా పెట్టుకుని తాగేందుకు ట్రై చేయండి. హెర్బల్స్​ని టీలో మిక్స్ చేసుకుంటే మరీ మంచిది. 






గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.