Traditional Food Recipe : పాయసంఅందరూ రెడీ చేసుకునేదే కదా ఈ రెసిపీలో కొత్తేమి ఉంది అనుకుంటున్నారా? అయితే ఈ రెసిపీ కాస్త స్పెషల్. మీరు దీనిని పది రోజులు స్టోర్ చేసుకున్నా ఏమి కాదు. మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పాలను వేడి చేసుకుని.. వేడి వేడిగా లాగించేయగలిగే టేస్టీ పాయసం రెసిపీ ఇది. మీరు దీనిని పండుగల సమయంలో చేసుకున్నా సరే.. పండుగల తర్వాత కూడా ఓ పదిరోజులు హాయిగా ఈ పాయసాన్ని లాగించేయవచ్చు. ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఊర్లకు వెళ్లే పిల్లలకు పంపించవచ్చు. వారు నచ్చినప్పుడు దీనిని తింటూ ఉంటారు. మరి టేస్టీ పాయసం ఎలా తయారు చేసుకోవాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటి? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
సగ్గుబియ్యం - ముప్పావు కప్పు
సేమ్యాలు - ఒకటిన్నర కప్పులు
జీడిపప్పు -20
పాలు - 1 లీటర్
నీళ్లు - తగినంత
యాలకులు - 4
ఎండు ద్రాక్ష - 10
నెయ్యి - 2 స్పూన్లు
పంచదార - 2 కప్పులు
తయారీ విధానం
ముందుగా సగ్గుబియ్యాన్ని కడిగి ఓ గంటసేపు నానబెట్టుకోవాలి. సగ్గుబియ్యం నానిపోతే చేతితో ఒత్తితే చిదిమిపోయేలా సగ్గుబియ్యం నానితే పాయసం బాగుంటుంది. ఇప్పుడు యాలకులను బాగా దంచి పెట్టుకోండి. కొందరు వాటిని జస్ట్ ఒకసారి దండి అలా పాయసంలోకి వేసేస్తారు. అలా చేస్తే మనం పాయసం తింటున్నప్పుడు అవి అడ్డు వచ్చి రుచిని డిస్టర్బ్ చేస్తాయి. కాబట్ట యాలకులను బాగా పొడి చేస్తే టేస్ట్ పెరుగుతుంది. పైగా రుచికి ఎలాంటి అడ్డు రాదు.
ఇప్పుడు స్టౌవ్ వెలిగించి పాలను ఓ పొంగు వచ్చేవరకు మరిగించుకుని పక్కన పెట్టేయండి. ఇప్పుడు మరో మందపాటి గిన్నె తీసుకోండి. స్టవ్ వెలిగించి దానిపై గిన్నె పెట్టి నెయ్యి వేయండి. దానిలో జీడిపప్పు వేసి వేయించండి. అవి కొంచెం వేగిన తర్వాత ఎండుద్రాక్షలు వేసి వేయించండి. ఇప్పుడు దానిలో సేమ్యాలు వేయండి. గుర్తించుకోండి సేమ్యాలు ఎరుపు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి. అలా అని పూర్తిగా మాడ్చేయకండి. మంట మీడియంగానే ఉండేలా చూసుకోండి. సేమ్యాలు వేగుతున్నప్పుడు స్టౌవ్ దగ్గరే ఉండండి. అటు ఇటు అయితే సేమ్యాలు పూర్తిగా మాడిపోతాయి.
బెల్లం వేస్తే ఇలా..
సేమ్యాలు ఎరుపురంగులోకి వచ్చిన తర్వాత దానిలో నానబెట్టిన సగ్గుబియ్యం వేసి బాగా కలపాలి. ఇప్పుడు సేమ్యాలు, సగ్గుబియ్యం మునిగేవరకు నీళ్లను పోయాలి. దీనిలో దంచుకున్న యాలకుల పొడిని వేయాలి. అనంతరం బాగా తిప్పాలి. పాయసానికి నీటి కొలత ప్రత్యేకంగా ఏమి ఉండదు. లెక్క ఏమిటంటే పోసిన నీళ్లతో సేమ్యాలు, సగ్గుబియ్యం ఉడికిపోవాలి. సగ్గుబియ్యం ఉడికిపోయిన తర్వాత రెండు కప్పుల పంచదార వేసి బాగా తిప్పాలి. పంచదారకు బదులు మీరు బెల్లం కూడా వేసుకోవచ్చు. ఒకవేళ బెల్లం వేసుకుంటే రెండు కప్పులే తీసుకోవాలి కానీ.. దీనిలో నేరుగా కలపకూడదు. బెల్లాన్ని కరిగించి దానిని వడపోసి.. ఆ మిశ్రమాన్ని ఈ మిశ్రమంలో వేయాలి. పంచదార కరిగిపోయేవరకు ఉడికించాలి. రుచి చూస్తే కాస్త తియ్యగానే ఉండాలి. ఎందుకంటే దీనిలో పాలు కలపాల్సి ఉంది కాబట్టి.
పంచదార పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. అనంతరం దానిలో పాలు పోసి బాగా తిప్పాలి. అప్పుడు పాయసంలో చక్కెర సమానం అవుతుంది. ఇంకేముంది వేడి వేడి టేస్టీ పాయసం రెడీ. దీనిని వేడిగా తినొచ్చు లేదా చల్లార్చుకుని అయినా తినొచ్చు. ఇక్కడ మీరు గుర్తించుకోవాల్సింది ఏమిటంటే. చక్కెర కరిగేవరకు ఉన్న మిశ్రమాన్ని మీరు ఫ్రిజ్లో స్టోర్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన సమయంలో దానిని బయటకు తీసి వేడి పాలు పోసుకుని హాయిగా లాగించేసుకోవచ్చు. ఇలా చేసిన మిశ్రమాన్ని పది రోజులు కూడా స్టోర్ చేసుకోవచ్చు. నచ్చినప్పుడు లాగించేయవచ్చు.
Also Read : కరకరలాడే పెసర పునుగులు.. తయారు చేయడం ఇంత తేలికా అనిపించే రెసిపీ ఇదే