Sunday Special Recipe : ఎక్కువ మసాలాలు లేని చేపల పులుసులో.. ఆరోగ్యానికి ఎన్నో మంచి ప్రయోజనాలు అందించే రాగి ముద్దను వేసుకుని ఎప్పుడైనా తిన్నారా? కొన్ని ప్రాంతాల్లో ఈ కాంబినేషన్ బాగా తింటారు. చేపల పులుసు అన్నంలో కంటే.. రాగి ముద్దలోనే దాని రుచి వీర లెవల్ ఉంటుంది. అంటున్నారు. అయితే రాగిముద్దలో వేసుకునే ఈ చేపల పులుసును పెద్దగా మసాలా లేకుండా టేస్టీగా ఏవిధంగా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 


చేపల పులుసు చేయడానికి కావాల్సిన పదార్థాలు


చేపలు - 1 కేజీ


ఉల్లిపాయలు - 3


పచ్చిమిర్చి - 7


మెంతులు - 1 స్పూన్


అల్లం - అంగుళం


వెల్లుల్లి- 7 రెబ్బలు


జీలకర్ర - 1 జీలకర్ర


నూనె - 4 స్పూన్ 


కస్తూరి మేతి - 1 స్పూన్


ఉప్పు - రుచికి తగినంత


కారం - 2 స్పూన్స్


పసుపు - చిటికెడు


చింతపండు - 50 గ్రాములు


కొత్తిమీర - 1 కట్ట చిన్నది


తయారీ విధానం


ముందుగా చింతపండును నీళ్లలో నానబెట్టుకోవాలి. ఉల్లిపాయలను తొక్కతీసి మీడియం ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్​ తీసుకుని దానిలో ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం, జీలకర్ర వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిపై కడాయి పెట్టుకోవాలి. దానిలో నూనె వేసి.. మెంతులు వేసి వేయించుకోవాలి. అవి వేగాక ముందుగా తయారు చేసుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని దానిలో వేయాలి. ఉల్లిపాయ పేస్ట్ ఉడికి నూనె పైకి తేలుతుంది. ఇలా ఉడికిన తర్వాత దానిలో కస్తూరి మేతి వేసుకుని బాగా కలుపుకోవాలి. 


అనంతరం దానిలో పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. రుచికి సరిపడేంత ఉప్పు వేసి బాగా కలపాలి. కారం, పసుపు కూడా వేసి బాగా కలిపి మళ్లీ ఉడికించాలి. ఇవి ఉడికి మళ్లీ నూనె పైకి వస్తుంది. అప్పుడు ముందుగా తయారు చేసుకున్న చింతపండు గుజ్జు వేసుకోవాలి. రెండు నిమిషాలు ఉడికిన తర్వాత దానిలో మీకు కావాల్సినంత నీళ్లు పోసుకోవాలి. కొత్తిమీరను కూడా వేసి నీటిని మరగనివ్వాలి. ఉప్పు సరిపోయిందో లేదో చెక్​ చేసుకోవాలి. 


పులుసు మరిగిన తర్వాత దానిలో చేపల ముక్కలు వేసుకోవాలి. ముందు కాస్త గరిటతో తిప్పి మూత వేసి ఉడకనివ్వాలి. తర్వాత కూరను తిప్పాల్సి వస్తే కడాయిని డైరక్ట్​గా పైకి లేపి తిప్పాలి. లేకుంటే ముక్కలు విడిపోయే అవకాశముంది. కాబట్టి జాగ్రత్తగా చేపలను తిప్పుతూ.. పొయ్యిమీద పెడుతూ.. మీడియం మంట మీద పది నిమిషాలు ఉడికించాలి. అంతే టేస్టీ టేస్టీ చేపల పులుసు రెడీ. దీనిని మీరు చేపలకూర కాంబినేషన్​లో తింటే అదిరిపోతుంది.


రాగిముద్ద చేయడం కోసం..


రాగిముద్ద చేయడం పెద్ద కష్టమేమి కాదు.. మీరు అన్నం వండుకునేప్పుడు రాగిపిండిని కలిపి దీనిని తయారు చేసుకోవచ్చు. అన్నం వండుకునేందుకు మీరు రేషన్ బియ్యం తీసుకోవాలి. రెండు కప్పుల రైస్ తీసుకుంటే.. ఒక కప్పు రాగిపిండి దీనికి సరిపోతుంది. ముందుగా రైస్​ను బాగా కడిగి బాగా ఉడకబెట్టుకోవాలి. గంజి దానిలో ఇగిరిపోయేలా చేసి అప్పుడు దానిలో రాగిపిండిని వేసుకుని మూతపెట్టుకోవాలి. కాసేపు ఉడికించి స్టౌవ్ ఆపేయాలి. వేడి కాస్త తగ్గాక.. నెయ్యిని ఉపయోగించి.. ముద్దలుగా చేసి పెట్టుకోవాలి. ఇంకెందుకు ఆలస్యం హాయిగా చేపల పులుసు, రాగిముద్దను తయారు చేసుకుని వేడిగా లాగించేయండి.  


Also Read : రాయలసీమ స్పెషల్ ఎగ్ దోశ.. ఆ ఒక్కటి యాడ్ చేస్తే రుచి నెక్స్ట్​ లెవల్​ అంతే