Instant Semiya Oothappam : ఉదయాన్నే ఎక్కువ సమయం లేదు అనుకున్నప్పుడు.. టేస్టీగా ఏదైనా తినాలనిపిస్తే ఇన్​స్టాంట్ ఉతప్పాన్ని తయారు చేసుకోవచ్చు. ఇంట్లో మినప పిండి లేకపోయినా ఈ టేస్టీ రెసిపీని సేమ్యాలు, రవ్వతో చేసుకోవచ్చు. అదేంటి ఉతప్పం అంటే మినప పిండి ఉండాలిగా అనుకుంటున్నారా? లేకపోయినా పర్లేదు.. మీరు మంచిగా, టేస్టీగా, స్పాంజీలాగా ఉండే ఉతప్పాన్ని తినాలనుకుంటే ఈ సేమ్యా ఉతప్పం రెసిపీని ఫాలో అయిపోండి. దీనిని చేయడం చాలా తేలిక. పైగా ఎక్కువ సమయం తీసుకోదు. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం వంటి విషయాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 


కావాల్సిన పదార్థాలు 


పెరుగు - 1 కప్పు 


బేకింగ్ సోడా - 1 టీస్పూన్


సేమ్యాలు - 1 కప్పు


రవ్వ - 1 కప్పు


నీరు - 1కప్పు


ఉప్పు - రుచికి తగినంత 


నూనె - రెండు టేబుల్ స్పూన్లు 


జీలకర్ర - అర టీస్పూన్


కరివేపాకు - రెండు రెబ్బలు 


ఉల్లిపాయ - 1 


అల్లం - అంగుళం


పచ్చిమిర్చి - 2


తయారీ విధానం


ముందుగా మిక్సింగ్ బౌల్​ తీసుకుని దానిలో పెరుగు వేయండి. కాస్త బేకింగ్ సోడా వేసి బాగా కలిపి కాసేపు దానిని అలా పక్కన పెట్టండి. పెరుగు కాస్త పొంగాలి. పైగా ఈ ఉతప్పంలో ఉపయోగించే పెరుగు పుల్లనిది అయితే ఉతప్పం మరింత రుచిగా ఉంటుంది. పెరుగు ఇలా పొంగుతున్న సమయంలో ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకును సన్నగా తురుముకోవడం చేయాలి. అల్లం, పచ్చిమిర్చిని దంచుకుని సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్​లో ఉన్న పెరుగులో అల్లం, పచ్చిమిర్చి పేస్ట్​ని వేసి కలిపేయాలి. దానిలో సేమ్యాలు, రవ్వ, నీళ్లు వేసి పిండిని బాగా కలపాలి. 


సేమ్యాలు ఎంత క్వాంటింటీ తీసుకుంటే రవ్వ కూడా అదే రేంజ్​లో తీసుకోవాలి. అప్పుడే ఉతప్పం బాగా వస్తుంది. దానిలో ఉప్పు కూడా వేసి పిండిని బాగా కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా ఉంది అనుకుంటే మరికొంత నీటిని వేసి కలపాలి. అలా అని మరీ జారుడుగా అయిపోకూడదు. ఈ పిండిని 15 నిమిషాలు పక్కన పెట్టండి. తర్వాత స్టౌవ్ వెలిగించి చిన్న కడాయిని తీసుకోండి. దానిలో నూనె వేసి వేడి అయ్యాక.. ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, జీలకర్ర వేసి వేయించండి. అవి వేగిన తర్వాత తీసి పిండిలో వేయాలి. ఇలా మగ్గిన ఉల్లిపాయలు వేసుకోవడం వల్ల ఉతప్పం రుచి మరింత పెరుగుతుంది. 



ఇప్పుడు పిండిని బాగా కలిపితే ఉతప్పం వేసుకునేందుకు పిండి సిద్ధమైపోయినట్టే. స్టౌవ్ వెలిగించి దానిపై దోశ పెనం పెట్టండి. అది వేడి అయ్యాక దానిపై పిండిని వేసుకోవాలి. అంచుల వెంబడి.. నూనెను వేసుకోవాలి. మీడియం మంట మీద లో ఫ్లేమ్​లో ఉతప్పాన్ని రోస్ట్ కానివ్వాలి. డార్క్ బ్రౌన్ కలర్​కి మారిపోతే.. మరోవైపు తిప్పి.. నూనె వేసి వేయించుకోవాలి. రెండు వైపులా మంచిగా రోస్ట్​ అయితే టేస్టీ, స్పాంజీలాంటి ఉతప్పం రెడీ. దీనిని మీకు నచ్చిన చట్నీతో ఆస్వాదించవచ్చు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ టేస్టీ బ్రేక్​ఫాస్ట్​ను రెడీ చేసుకుని హాయిగా ఉతప్పం లాగించేయండి. 


Also Read : వామ్మో.. ఫేషియల్​తో HIV వచ్చిందా? జాగ్రత్తగా లేకుంటే మీ పరిస్థితి కూడా అంతే