Tasty Putnala Chikki Recipe : పుట్నాల చిక్కీ అనేది చాలామందికి ఓ ఎమోషన్. ఎందుకంటే ఇప్పుడు అవి ఎక్కడా దొరకడం లేదు. కాబట్టి పిల్లలకు హెల్తీ స్నాక్​గా దీనిని ఇవ్వలేకపోతున్నారు. అయితే ఈ పుట్నాల చక్కీని పిల్లలకోసం మరింత హెల్తీగా ఏవిధంగా చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే ఇక్కడే ఓ టేస్టీ రెసిపీ ఎదురు చూస్తుంది. దీనిని ఎలా తయారు చేయాలి? ఏయే కొలతలతో చేస్తే చిక్కీ టేస్టీగా, క్రంచీగా వస్తుంది.. కావాల్సిన పదార్థాలు ఏంటనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


కావాల్సిన పదార్థాలు


బెల్లం - 1 కప్పు తురిమినది


పుట్నాల పప్పు - 1 కప్పు


వంటసోడా - పావు టీస్పూన్


ఖర్జూరాలు - పావు కప్పు


నెయ్యి - 1 స్పూన్


యాలకుల పొడి - 1 టీస్పూన్


సిల్వర్ ఫాయిల్ పేపర్ - 1


తయారీ విధానం


ముందుగా ఓ స్కేర్ బాక్స్​లో సిల్వర్ ఫాయిల్ పేపర్ వేసి పక్కన పెట్టకోండి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి.. దానిపై మందపాటి కడాయి పెట్టండి. ఇప్పుడు తురిమిన బెల్లాన్ని కడాయిలో వేయండి. స్టౌవ్ మీడియం మంట మీద ఉంచండి. బెల్లం కరుగుతున్న సమయంలో ఓ స్పూన్ నీటిని వేయొచ్చు. అయితే పూర్తిగా బెల్లం కరిగిన తర్వాత అది చిక్కటి సిరప్​లా మారేవరకు దానిని కలుపుతూ ఉండండి. దానిలో ఓ స్పూన్ నెయ్యి కూడా వేసి బాగా కలపండి. అయితే సిరప్ రెడీ అయిందో లేదో తెలుసుకునేందు ఓ కప్పులో నీటిని తీసుకోండి. ఇప్పుడు దానిలో బెల్లం సిరప్ కొంచెం వేయండి. అది ముద్దగా కాకుండా.. దానిని విరిస్తే క్రంచీగా సౌండ్ రావాలి. అలా వస్తే బెల్లం సిరప్ రెడీ అయినట్లు అర్థం.


చిక్కగా.. నీటిలో వేస్తే పాపడ్​ లాగా సిరప్ విరిగిపోతుంది అనుకున్నప్పుడు దానిలో ఓ పావు టీస్పూన్ వంటసోడా వేసి బాగా కలపాలి. వంటసోడా వేసినప్పుడు బెల్లం సిరప్​ బాగా నురుగు వస్తుంది. మీడియం మంట మీదనే ఉంచి ఈ సిరప్​ను బాగా కలపాలి. అనంతరం దానిలో ఖర్జూరం ముక్కలు వేయాలి. వాటిని కలిపి.. దానిలో వెంటనే పుట్నాలు(వేయించిన శనగపప్పు) వేసి బాగా కలపాలి. సిరప్ పుట్నాలకు బాగా కలిసేవరకు దానిని కలుపుతూనే ఉండాలి. బెల్లం పుట్నాలతో బాగా కలిసిపోయినప్పుడు.. ముందుగా బాక్స్​లో సిద్ధం చేసుకున్న సిల్వర్ ఫాయిల్ పేపర్​పై ఈ మిశ్రమాన్ని వేయాలి.


సిల్వర్ ఫాయిల్ పేపర్ లేకుంటే స్టీల్ ప్లేటుకి నెయ్యి రాసి.. దానిపై ఈ మిశ్రమాన్ని వేయాలి. ఇలా వేసిన తర్వాత చివర్లను అడ్జెస్ట్ చేయాలి. అనంతరం దానిని నెయ్యి రాసిన అట్లకాడతో సమానంగా అడ్జెస్ట్ చేయాలి. సిరప్ వేడిగా ఉన్నప్పుడే దానిని అచ్చులకోసం గాటు పెట్టుకోవాలి. ఓ రెండు లేదా మూడు గంటలు వాటిని అలాగే ఉంచేయాలి. ముందుగా గాటు పెట్టుకున్నాము కాబట్టి దానిని విరిచితే మంచి షేప్​లలో చిక్కీ వచ్చేస్తుంది. ఇలా చల్లారిన చిక్కీలను హాయిగా లాగించేయవచ్చు. ఇవి ఆరోగ్యానికి చాలామంచిది. పిల్లలేకాకుండా పెద్దలు కూడా దీనిని హాయిగా ఎంజాయ్ చేస్తారు. 



పల్లీలతో లేక ఉండల రూపంలో..


పుట్నాల చక్కీని స్టోర్ చేయాలనుకుంటే.. వాటిని గాలి చొరబడని కంటైనర్​లో స్టోర్​ చేయాలి. అప్పుడు అవి జిగటగా మారకుండా క్రంచీగా ఉంటాయి. వీటి రుచి అద్భుతంగా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇతర అన్​హెల్తీ స్నాక్స్ జోలికి పోరు. వీటిలో మీరు పుట్నాలు కాకుండా వేయించిన పల్లీలు వేసుకోవచ్చు. లేదంటే ఇలా షేప్​గా కాకుండా చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవచ్చు. దానిలో కొన్ని నువ్వులు కూడా వేసుకోవచ్చు. ఉండలు చేసుకోవాలనుకుంటే చేతికి నెయ్యి రాసి.. సిరప్ వేడిగా ఉన్నప్పుడే చుట్టుకోవాలి. 


Also Read : మామిడికాయ పులిహోర.. ఈ రెసిపీలో ఆ టిప్స్​ ఫాలో అయితే టేస్ట్ అదిరిపోతుంది