Tasty Recipe with Millets : మిల్లెట్స్‌ను వివిధ రకాలుగా ట్రై చేసి.. తినే విధంగా డైట్లో యాడ్ చేసుకోవచ్చు అనుకుంటున్నారు. పూజలు, పునస్కారాలు లేని సమయంలో మీరు మంచి టేస్టీ పాయసం తినాలనుకుంటే మీరు దానిని మిల్లెట్స్‌తో తయారు చేసుకోవచ్చు. అదేంటి పాయసం అంటే బియ్యం, అటుకులు, సేమ్యా వంటి వాటితో చేస్తారు కదా.. మిల్లెట్స్‌తో కూడా చేసుకోవచ్చా? అనే డౌట్ మీలో ఉందా? అయితే మీరు ఈ మిల్లెట్స్ పాయాసాన్ని కచ్చితంగా ట్రై చేయాల్సిందే. ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందించే మిల్లెట్స్‌తో మీరు కమ్మని పాయసం ఎలా తయారు చేసుకోవాలో? కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
పాలు - 1 లీటర్
నీరు - పావు కప్పు
నెయ్యి - 3 టేబుల్ స్పూన్లు
పంచదార - అరకప్పు
మిల్లెట్స్ - అర కప్పు
జీడిపప్పు - 2 టేబుల్ స్పూన్లు
ఎండు ద్రాక్ష - 2 టేబుల్ స్పూన్లు
పిస్తా - 2 టేబుల్ స్పూన్లు
కుంకుమ పువ్వు - అర టీ స్పూన్
తయారీ విధానం
పాయసం చేసుకునే 3 గంటల ముందు మిల్లెట్స్‌ను నానబెట్టాలి. అవి బాగా నానిపోయిన తర్వాత కడగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి.. ప్రెషర్ కుక్కర్లో పాలు, నీటి వేసి వేడి 20 నిమిషాలు మరగనివ్వాలి. అనంతరం దానిని చల్లారనిచ్చి.. ప్రెషర్ పోయేవరకు వెయిట్ చేయాలి. కుక్కర్లో పాలు మరిగించడం వల్ల పాలు కాస్త పింక్ కలర్లోకి మారుతాయి. ఇది పాయాసంకి సహజంగా మంచి రంగును ఇస్తుంది. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూతను తీసేసి.. పాలను కడాయిలోకి తీసుకోవాలి.
మరోసారి స్టవ్ వెలిగించి.. మంటను తక్కువ చేసి.. పాలను మరగనివ్వాలి. దీనిలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి, పంచదార వేసి.. అది కరిగేవరకు కలుపుతూనే ఉండాలి. ఈ కలిపిన మిశ్రమంలో నానబెట్టుకున్న మిల్లెట్స్ వేసి.. 20 నిముషాలు ఉడికించాలి. మిల్లెట్స్ ఉడికే సమయంలో చిన్న కడాయి తీసుకుని దానిలో నెయ్యి వేసి.. అది వేడి అయ్యాక జీడిపప్పు, పిస్తా, ఎండుద్రాక్షలు వేసి రోస్ట్ చేసుకోవాలి. మిల్లెట్స్ ఉడికిపోతున్న సమయంలో రోస్ట్ చేసిన డ్రై ఫ్రూట్స్ వేసి కలిపేయాలి. దానిలో కుంకుమపువ్వు వేసుకుని బాగా కలపాలి. మిల్లెట్స్ ఉడికిపోతే.. పాయసం రెడీ అయిపోయినట్లే. దీనిని వేడిగా సర్వ్ చేసుకుని లాగించేయవచ్చు. లేదంటే ప్రిజ్‌లో చల్లబర్చుకుని తిన్నా కూడా ఇది బాగుంటుంది.
మిల్లెట్స్ పాయసాన్ని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ తినొచ్చు. పిల్లలు మిల్లెట్స్ తినేందుకు అంతగా ఆసక్తి చూపించరు. కాబట్టి మీరు వారికి ఇలా కూడా మిల్లెట్స్ అలవాటు చేయవచ్చు. ఇవి రుచితో పాటు ఆరోగ్యకరమైన ప్రయోజనాలు అందిస్తాయి. మధుమేహమున్న వారు, డైట్స్ చేసే వారు కూడా దీనిని తీసుకోవచ్చు కానీ.. తక్కువ మోతాదులో తీసుకుంటే మంచిది. మరి ఇంకెందుకు ఆలస్యం మంచి ఈ మిల్లెట్స్ పాయాసాన్ని మీరు రెడీ చేసుకుని హాయిగా ఇంటిల్లిపాది లాగించేయండి.
Also Read : సండే స్పెషల్ హెల్తీ, టేస్టీ ప్రోటీన్ రిచ్ పకోడి.. రెసిపీ చాలా సింపుల్
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.