Amla Pickle Recipe : ఈ సీజన్​లో ఉసిరికాయలు బాగా దొరుకుతాయి. ఇవి ఎంత మంచి రుచిని అందిస్తాయో.. అంతే ఆరోగ్యప్రయోజనాలు అందిస్తాయి. ముఖ్యంగా స్కిన్​ హెల్త్​కి, హెయిర్​గ్రోత్​కి చాలా మంచిది. ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది. అందుకే దీనిని డైట్​లో కచ్చితంగా చేర్చుకోవాలంటున్నారు. అయితే ఉసిరికాయ ఆవకాయ కాకుండా రోటీ పచ్చడి (Amla Pachadi) తయారు చేసుకోవచ్చు. పైగా ఇది మంచి రుచిని అందించడంతో పాటు.. ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. మరి ఈ టేస్టీ పచ్చడిని ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏంటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


కావాల్సిన పదార్థాలు 


ఉసిరి కాయలు - 20


కొబ్బరి  - అర కప్పు


ఉప్పు - రుచికి తగినంత 


చింతపండు - కొంచెం 


బెల్లం పొడి - 1 టీస్పూన్


మినపప్పు - 3 టేబుల్ స్పూన్లు


ఎండుమిర్చి - 7


జీలకర్ర - 1 టీస్పూన్ 


కరివేపాకు - కొంచెం


అల్లం - అంగుళం


తాళింపు కోసం


నువ్వుల నూనె - 3 టేబుల్ స్పూన్లు


ఆవాలు - అర టీస్పూన్


ఎండు మిర్చి - 2


ఇంగువ - అర టీస్పూన్


కరివేపాకు - కొంచెం 


తయారీ విధానం


ముందుగా కొబ్బరిని కోరి పక్కన పెట్టుకోవాలి. చింతపండు నానబెట్టాలి. కావాల్సిన పదార్థాలు సిద్ధం చేసుకోవాలి. ఉసిరికాయలను కడిగాలి. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ తీసుకుని దానిలో నీళ్లు పోసి.. ఇడ్లీ ప్లేట్ పెట్టాలి. దానిలో ఉసిరికాయలను ప్లేస్ చేసి మూతపెట్టాలి. వీటిని 10 నుంచి 15 నిమిషాలు ఉడికించాలి. ఉసిరికాయ మెత్తగా ఉడికితే సరిపోతుంది. ఇలా ఉడికిన ఉసిరికాయల నుంచి గింజలను వేరు చేయాలి. ఉసిరి ఉడకడం వల్ల ఈజీగానే సీడ్స్ తీసేయొచ్చు. 


ఇప్పుడు స్టౌవ్ వెలిగించి పాన్ పెట్టాలి. దానిలో రెండు టీస్పూన్ల నువ్వుల నూనె వేసి.. మూడు టేబుల్ స్పూన్ల మినపప్పు వేయాలి. కొద్దిగా రంగు మారేవరకు రోస్ట్ చేయాలి. మినపప్పు కాస్త రంగు మారిన వెంటనే దానిలో ఎండుమిర్చి, కట్ చేసిన అల్లం, కరివేపాకు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. వీటిని రెండు నిమిషాలు వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత స్టౌవ్ ఆపేసి మిక్సీజార్​లోకి తీసుకోవాలి. దానిలో రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. చింత పండును కూడా వేసేయాలి.



ఉసిరి పులుపునిస్తుంది కదా.. మళ్లీ చింతపండు వేయడం ఎందుకు అనుకుంటారేమో.. చింతపండు రుచిని పెంచుతుంది. పైగా మనం చాలా తక్కువ మోతాదులో దానిని తీసుకోవడం వల్ల పులుపు బ్యాలెన్స్ అవుతుంది. చింతపండు వేసిన తర్వాత వీటిని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దానిలో అరకప్పు కొబ్బరి, ఉడికించి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. 



తాళింపు కోసం స్టౌవ్ వెలిగించి దానిలో మూడు టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె వేయాలి. అది వేడి అయ్యాక ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. అవి వేగిన తర్వాత ముందుగా తయారుచేసుకున్న ఉసిరి మిశ్రమాన్ని వేసి రెండు నిమిషాలు మగ్గనివ్వాలి. చివర్లో అరటీస్పూన్ బెల్లం పొడి వేసి మరో రెండు నిమిషాలు ఉడికించి స్టౌవ్ ఆపేయాలి. అంతే టేస్టీ టేస్టీ ఉసిరి పచ్చడి రెడీ. దీనిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే మరే కర్రీ కూడా వద్దని అంటారు. ఉల్లిపాయముక్కలు నంజుకుని తిన్నాకూడా రుచి పెరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ టేస్టీ రెసిపీని తయారు చేసి లాగించేయండి.  


Also Read : ఉల్లిపాయ నిల్వ పచ్చడి.. ఇలా చేస్తే నెలరోజులు నిల్వ ఉంటుంది.. టేస్టీ, సింపుల్ రెసిపీ ఇదే