Tasty Evening Snack Onion Pakodi : ఎండవేడి నుంచి ఉపశమనం ఇస్తూ పలుచోట్ల వర్షం పడుతుంది. ఈ సమయంలో టేస్టీగా ఏమైనా తినాలనుకుంటే.. వేడి వేడి  ఆనియన్ పకోడిని చేసుకుని తినొచ్చు. వీటిని చేయడం చాలా ఈజీ. బ్యాచిలర్స్​ కూడా చాలా సింపుల్​గా చేసుకోవచ్చు. సాయంత్రం స్నాక్స్​గా, టీకి జోడిగా ఏ కాలంలో అయినా మీరు పకోడిలను తయారు చేసుకోవచ్చు. సింపుల్ టెక్నిక్స్ వాడితే బండి మీద అమ్మే పకోడి కంటే రుచిగా వీటిని ప్రిపేర్ చేయవచ్చు. మరి ఈ ఉల్లి పకోడిని చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో.. తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 

కావాల్సిన పదార్థాలు

ఉల్లిపాయలు - 2 పెద్దవి

కొత్తిమీర - 2 టేబుల్ స్పూన్లు

పచ్చిమిర్చి - 2 

కరివేపాకు - పదిఆకులు

వామ్ము - అరటీస్పూన్

ఉప్పు - రుచికి తగినంత

కారం - అర టీస్పూన్

ధనియాల పొడి - అర టీస్పూన్

గరం మసాల పొడి - అర టీస్పూన్

శనగ పిండి - 1 కప్పు

బియ్యం పిండి - పావు కప్పు

వంటసోడా - చిటికెడు

నూనె - డీప్ ఫ్రైకి సరిపడా

తయారీ విధానం

ముందుగా ఉల్లిపాయలను కడిగి మరీ సన్నగా కాకుండా.. మరీ మందంగా కాకుండా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీరను కూడా తురుముకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తురుము, వామ్ము, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసి కలపాలి. గరం మసాలా అనేది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. 

ఉల్లిపాయలను బాగా పిసుకుతూ కలపాలి. ఇలా చేయడం వల్ల వాటిలోని నీరు బయటకు వస్తుంది. ఇప్పుడు దానిలో శనగపిండి వేసుకోవాలి. పకోడి కరకరలాడుతూ మంచి రంగులో వచ్చేందుకు బియ్యం పిండి వేసుకోవాలి. దానిలోనే వంటసోడా కూడా వేసుకోవాలి. వీటిని బాగా కలపాలి. మీరు ఈ పిండిలో నీళ్లు వేయకుండా ఉల్లిపాయల్లోని నీటితోనే కలిపితే పకోడి మంచి రుచి వస్తుంది. కాబట్టి ఉల్లిపాయలను గట్టిగా కలుపుతూ పిండిని పకోడిలు వేసేందుకు సరిపడేలా మిక్స్ చేసుకోవాలి. 

ఒకవేళ పిండికి నీరు సరిపోకపోతే ఓ 5 నిమిషాలు పిండిని పక్కన పెట్టాలి. అప్పుడు ఉల్లిలోని నీరు వస్తుంది. పిండి కలిపేందుకు సరిపోతుంది. లేదు అనుకుంటే 1 లేదా రెండు స్పూన్లు నీరు చల్లి పిండిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి పకోడీలు వేయించుకునేందుకు కడాయి పెట్టాలి. దానిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి.. కాగానివ్వాలి. ముందుగా ఓ చిన్న ఉల్లిపాయ ముక్కను దానిలో వేసి నూనె వేయించేందుకు సిద్ధమైందో లేదో తెలుసుకోవాలి. 

నూనె కాగిపోయిన తర్వాత.. పిండిని తీసుకుని చిన్న చిన్న ముద్దలుగా పకోడిలా వేసుకోవాలి. పకోడి బాగా ఫ్రై అయి గోల్డెన్ కలర్​లో వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలి. నూనె నుంచి పకోడిలను తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ ఉల్లిపాయ పకోడి రెడీ. సాయంత్రం సమయంలో స్నాక్స్​గా వీటిని తీసుకోవచ్చు. ముఖ్యం వర్షం పడుతున్నప్పుడు వేడి వేడి ఛాయ్ కాంబినేషన్​లో వీటిని తింటే బెస్ట్ ఈవెనింగ్ అవుతుంది. పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తినగలిగే డిష్ ఇది.