Fish oil supplements: చేపల్లో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఓమేగా3, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా లభిస్తాయి. వీటితోపాటు అనేక విటమిన్లు, ఖనిజాలు కూడా మన శరీరానికి అందుతాయి. అయితే చాలా మంది చేపలను తినేందుకు ఇష్టపడకపోవచ్చు. అలాంటి వారి అందులోని కొవ్వులను శరీరానికి అందించేందుకు ఫిష్ ఆయిల్ సప్లిమెంట్లను వాడుతుంటారు. చేపనూనె ద్వారా మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఇదే కారణంతో ఫిట్‌నెస్ ఔత్సాహికులు, బాడీ బిల్డర్లు, వారి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ ఎక్కువగా వినియోగిస్తుంటారు. సాల్మోన్, కాడ్ వంటి చేప జాతులు కణజాలల నుంచి ఈ నూనెను తీస్తారు. ఇందులో ఇకోసాపెంటెనోయిన్ ఆసిడ్, డోకోసాహెక్సేనోయిక్ ఆమ్లం, ఓమేగా 3 వంటి కొవ్వులు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. 


అయితే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉన్న ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలు అందిస్తాయని అందరికీ తెలుసు. అయితే ఈ సప్లిమెంట్స్ ను ప్రతిరోజూ తీసుకున్నట్లయితే స్ట్రోక్ తోపాటు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని తాజాగా ఓ కొత్త అధ్యయనంలో తేలింది. చైనా, యూకే, అమెరికా నుంచి అంతర్జాతీయ పరిశోధకుల బృందం నిర్వహించిన ఈ అధ్యయనంలో 40 నుంచి 69 ఏళ్ల వయస్సుకన్న 415,737 మంది పాల్గొన్నారు. ఇందులో 55 శాతం మహిళలు ఉన్నారు. వారి ఆరోగ్యాన్ని ఈ బృందం విశ్లేషించింది. వారు క్రమం తప్పకుండా ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ ను తీసుకున్నారు. ఈ అధ్యయనం 2006 నుంచి 2010 మధ్య జరిగింది. వైద్య రికార్డుల డేటా ఆధారంగా మార్చి 2021 చివరి వరకు ఎంత మంది మరణించారో ట్రాక్ చేశారు. 


వాటి ఫలితాలు ఓపెన్ యాక్సెస్ జర్నల్ BMJ మెడిసిన్‌లో ప్రచురితం అయ్యాయి. ఫిష్ ఆయిల్ సప్లిమెంట్లను క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల గుండె ఆరోగ్యం, వ్యాధి పురోగతి, మరణంలో విభిన్న పాత్రలు ఉన్నాయని తేలింది. ఫిష్ ఆయిల్ సప్లిమెంట్లను క్రమం తప్పకుండా ఉపయోగించే గుండె సమస్యలు లేని వ్యక్తులు కర్ణిక దడ అభివృద్ధి చెందే ప్రమాదం 13 శాతం ఎక్కువ, స్ట్రోక్ వచ్చే ప్రమాదం 5 శాతం ఉందని తేలింది. ఆరోగ్యంగా ఉన్న వారి నుంచి గుండెపోటు, స్ట్రోక్ లేదా గుండె వైఫల్యానికి మారే ప్రమాదం మహిళల్లో 6 శాతం ఎక్కువ, ధూమపానం చేయనివారిలో 6 శాతం ఎక్కువగా ఉందని గుర్తించారు.


దీనికి విరుద్ధంగా.. కార్డియోవాస్కులర్ వ్యాధి ఉన్నవారిలో, రెగ్యులర్ ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ కర్ణిక దడ నుంచి గుండెపోటు వరకు 15 శాతం,  గుండె వైఫల్యం నుంచి మరణం వరకు 9 శాతం వరకు పురోగతిని తగ్గించాయని అధ్యయనం పేర్కొంది.వయస్సు, లింగం, ధూమపానం, కొవ్వు లేని చేపల వినియోగం, అధిక రక్తపోటు, స్టాటిన్స్, రక్తపోటు-తగ్గించే మందుల వాడకం వంటి వాటిని గుర్తించాయి. కాగా ఇది కేవలం పరిశీలనాత్మక అధ్యయనం మాత్రమే అని కారణ కారకాల గురించి కచ్చితంగా చెప్పలేమని నిజమైన కారణాలను  గుర్తించడానికి తదుపరి అధ్యయనాలు అవసరమని శాస్త్రవేత్తలు తెలిపారు. 


Also Read : పీరియడ్స్ సమయంలో ప్రెగ్నెంట్ అవ్వొచ్చా? ఆ రోజుల్లో ట్రై చేస్తే గర్భం దాల్చే అవకాశాలు పెరుగుతాయా?







గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.