కరోన మహమ్మారి ప్రపంచాన్ని కమ్మిన నాటి నుంచి రెండు విటమిన్ల ప్రాధాన్యత మనందరికీ తెలిసింది. అవే  విటమిన్ సి, డి. ఈ రెండూ రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో ముందుంటాయి. అంతేకాదు కొన్ని రకాల క్యాన్సర్లను రాకుండా అడ్డుకుంటాయి. ముఖ్యంగా కరోనా వైరస్ తో పోరాడేందుకు విటమిన్ డి అత్యవసరమని ఇప్పటికే అనేక అధ్యయనాలు తేల్చాయి. ఈ విటమిన్ శరీరానికి సమంగా అందకపోతే శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, నిమోనియో, వాపు వంటివి పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా విటమిన్ డి లోపం మధుమేహం, ఊబకాయం ఉన్న వారిలో అధికంగా కనిపిస్తోంది. అయితే ఒక వ్యక్తికి రక్త పరీక్ష నిర్వహించకుండానే విటమిన్ డి లోపంతో బాధపడుతున్నాడని ఎలా చెప్పవచ్చు?  దానికి ఓ అధ్యయనం సమాధానం చెబుతోంది. 


అమెరికాలోని మాయో క్లినిక్లోని డెర్మటాలజీ విభాగం ఒక అధ్యయనం నిర్వహించింది. అందులో బర్నింగ్ మౌత్ సిండ్రోమ్ తో బాధపడేవారికి విటమిన్ డి లోపం ఉండొచ్చని తేలింది. కేవలం ఆ విటమిన్ తో పాటూ రక్తంలో గ్లూకోజ్ చేరడం, విటమిన్ బి6, విటమిన్ బి1 లోపాలు ఉండొచ్చని అంచనా వేశారు. బర్నింగ్ మౌత్ సిండ్రోమ్ లక్షణాలు ఎలా ఉంటాయంటే... నాలుక మీద మంటరావడం, లేదా పెదవులు మండడం, తిమ్మిరిగా, పొడిపొడిగా అనిపించడం, ఏది తిన్నా రుచి బాగోకపోవడం లాంటివి ఉంటాయి. తినేప్పుడు నోట్లో చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అయితే ఈ బర్నింగ్ మౌత్ సిండ్రోమ్ కేవలం విటమిన్ డి లోపం వల్లే కాదు జింక్, ఐరన్, విటమిన్ బి లోపాల వల్ల కలుగవచ్చు. మీ ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని కలిసి సలహా పొందడం ఉత్తమం. ఆయన పరీక్షల ద్వారా ఏ విటమిన్ లోపమో తెలుసుకుంటారు. 


డిప్రెషన్ కి కారణం కావచ్చు
విటమిన్ డి స్థాయిలు తగ్గినప్పుడు మానసిక ఆందోళనలు పెరుగుతాయి. దీర్ఘకాలంగా శరీరానికి తగినంత విటమిన్ డి అందకపోతే డిప్రెషన్ బారిన పడొచ్చని కొన్ని అధ్యయనాలు తేల్చాయి. డిప్రెషన్ బారిన పడిన వాళ్లకి అందుకే  న్యూట్రిషన్ సప్లిమెంట్స్ ఇస్తారు వైద్యులు. 


ఇతర సమస్యలు...
జుట్టు అధికంగా రాలుతున్నా దానికి విటమిన్ డి లోపంగా భావించవచ్చు. అలాగే అనేక చర్మ సమస్యలు కూడా కలగవచ్చు. ముఖంపై మొటిమలు రావడవ, దద్దుర్లు, చర్మం ముడతలు పడడం వంటివి కలగవచ్చు. ఈ లక్షణాలు ఏవి కలిగినా విటమిన్ డి లోపం ఉందేమో అనుమానించాలి. దీనికి చికిత్స అందరికి తెలిసిందే... రోజూ అరగంట పాటూ సూర్య రశ్మిని చర్మం శోషించుకునేలా చేయాలి. సమస్య మరీ తీవ్రంగా అనిపిస్తే వైద్యుడిని సంప్రదించడం మేలు. 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి.


Also read: గుడ్డులోని పచ్చసొన తింటే బరువు పెరుగుతారని తినకుండా పడేస్తున్నారా? ఆరోగ్యనిపుణులు ఏమంటున్నారు?


Also read: ‘మా’ ఎన్నికలు: ప్రకాష్ రాజ్‌‌‌తో మంచు విష్ణు ‘ఢీ’.. ప్యానెల్ ప్రకటన