మన శరీరానికి ఒమెగా-3 ఫ్యాటీ ఆసిడ్లు చాలా అవసరం. ఆరోగ్యవంతమైన, చురుకైన జీవితం గడిపేందుకు ఈ ఫ్యాటీ ఆసిడ్లు ఉపయోగపడతాయి. ఫ్యాటీ ఆసిడ్లు శారీరక మానసిక ఆరోగ్యాల మీద నేరుగా ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి కీలకమైన పోషకాలు లోపించినపుడు శరీరంలో రకరకాల ప్రత్యేక సంకేతాలు కనిపిస్తాయి. పోషకాల లోపం వల్ల శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి? ఏయే లక్షణాలు కనిపిస్తాయనేది తప్పకుండా తెలుసుకోవాలి. లేకపో్తే.. తెలియకుండానే అనారోగ్యానికి గురవ్వుతాం.


ఒమెగా 3 శరీరానికి అత్యావశ్యక పోషకం. ఇది యాంటీఆక్సిడెంట్ కూడా. శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడం, ప్రీరాడికల్స్ ను సంతులన పరచడం, ఆక్సిడేషన్ ఒత్తిడి లేకుండా చూడడం వంటి ముఖ్యమైన విధులు నిర్వహిస్తుంది. అంతేకాదు శరీరాన్ని వయసు ప్రభావం నుంచి కూడా రక్షిస్తుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత వంటి అనేక విషయాల మీద దీని ప్రభావం ఉంటుంది. కనుక ఈ పోషక లోపాన్ని నిర్లక్ష్యం చెయ్యడం తగదు.


చర్మం, జుట్టు పొడిబారడం


వాతావరణం చల్లగా లేనపుడు కూడా చర్మం, జుట్టు పొడిబారిపోతాయి. చర్మ ఆరోగ్యంలో ఆకస్మికంగా వచ్చే మార్పులు శరీరంలో ఒమెగా3 లోపాన్ని తెలియజేస్తుంది. ఒమెగా 3 చర్మపు లిపిడ్ కవర్‌ను కాపాడి తేమగా ఉంచుతుంది. ఈ పోషకం లోపించినపుడు ముందుగా చర్మం కాంతి కోల్పోతుంది.


కీళ్ల నొప్పి, బిగుసుకోవడం


కీళ్ల కదలికల్లో నొప్పిగా ఉంటుంది. ఒమెగా3 ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. కీళ్ల ఆకృతిని కాపాడడానికి కూడా ఒమెగా3 అవసరం. కీలకమైన ఈ కొవ్వు ఆమ్లాలు లోపించినపుడు ఇన్ఫ్లమేషన్ పెరిగి కీళ్ల పనితీరు మీద ప్రభావం పడుతుంది.


ఏకాగ్రత లోపించడం


మెదడులో ఎక్కువగా నిండి ఉండే కొవ్వు ఆమ్లం ఒమెగా 3. ముఖ్యంగా DHA అని చెప్పుకునే డోకోసాహెక్సేనోయిక్ ఆసిడ్ మెదడులో ఉండే ముఖ్య పోషకం. ఇది మెదడు ఏకాగ్రతతో పనిచేసేందుకు అవసరమవుతుంది. ఇది తగినంత లేనపుడు పనిలో ఏకాగ్రత కుదరకపోవడం, చూసిన సమాచారాన్ని ప్రాసెస్ చెయ్యడంలో మెదడు ఇబ్బంది పడుతుంది. మానసిక ఆరోగ్యానికి కొవ్వుఆమ్లాలు చాలా ఆవశ్యకం.


నీరసం, మూడ్ స్వింగ్స్


ఒమెగా 3 మానసక స్థితిని సంతులన పరచడానికి చాలా అవసరం. మూడ్ స్వింగ్స్ ను నియంత్రించేందుకు దోహదం చేస్తుంది. ముఖ్యమైన ఈ ఫ్యాటీ ఆసిడ్లు లోపిస్తే మానసి పరిస్థితులు క్షీణిస్తాయి. అకారణంగా మనసు బావుండకపోయినా, డిప్రెషన్ గా అనిపించినా పోషకాహార లోపం జరుగుతోందని గుర్తించాలి.


నిరోధక వ్యవస్థ బలహీన పడడం


రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చెయ్యడంలో ఒమెగా3 గేమ్ ఛేంజర్ వంటిదని చెప్పాలి. శరీరంలో కొవ్వుఆమ్లాల లోపం నిరోధక వ్యవస్థ మీద నేరుగా ఉంటుంది. ఇది శరీరంలో ఇన్ఫెక్సన్లను నిరోధించడంలో ముఖ్యమైన పాత్ర పోషించే ముఖ్యమైన వ్యవస్థ. ఇమ్యూనిటి బలహీనపడితే తరచుగా ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఉంటుంది. చాలా సులభంగా దగ్గు, జలుబు, ఫ్లూ వంటివి సంక్రమించి వేధిస్తాయి.


Also Read : Disease X: డిసీజ్ X - ఇది కోవిడ్ కంటే ప్రమాదకర మహమ్మారి, మరో ముప్పు తప్పదా?


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.