రోజూ కూల్ డ్రింకులు తాగేవారు, చక్కెర కలిపిన పండ్ల రసాలు తాగేవారు, స్వీట్లు, కేకులు, బిస్కెట్లు తినే వారి సంఖ్య అధికంగానే ఉంది. అయితే వీరందరికీ తెలియని విషయం ఏమిటంటే వారు తినే ఈ పదార్థాలలో చక్కెర శాతం చాలా ఎక్కువ. ఇలా చక్కెర కలిపిన పదార్థాలు అధికంగా తింటే దీర్ఘకాలంలో కిడ్నీలో రాళ్ల ఏర్పడే సమస్య ఎక్కువవుతుంది. చక్కెర పదార్థాలు కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశాలను పెంచుతాయని ఒక కొత్త అధ్యయనం చెబుతోంది. కాబట్టి చక్కెర నిండిన పదార్థాలు తినడం తగ్గించాలి. ముఖ్యంగా చిన్నపిల్లలు, యువత అధికంగా ఇలాంటి ఆహారాలను తినేందుకు ఇష్టపడతారు. వీరు దీర్ఘకాలంగా ఇలాంటి ఆహారాలను తింటే తక్కువ వయసులోనే కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడే అవకాశం ఉంది. కాబట్టి తీపి పదార్థాలు తినే శాతాన్ని తగ్గించుకుంటే ఎంతో మంచిది.


కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. వాటిలో ఇలా తీపి పదార్థాలు అధికంగా తినడం కూడా ఒకటి. అలాగే ఒంట్లో నీటి శాతం తగ్గినా కూడా కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. మధుమేహం సమస్యతో బాధపడేవారు, ఊబకాయంతో ఇబ్బంది పడుతున్న వారు కూడా కిడ్నీలో రాళ్ల సమస్య బారిన త్వరగా పడతారు. గౌట్ వంటి ఆరోగ్య సమస్యల తో ఇబ్బంది పడేవారు, పేగు పూత వల్ల కూడా కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం పెరుగుతుంది. వీరంతా కూడా చక్కెర కలిపిన ఆహారాలను తినడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే సమస్యను మరింతగా పెంచుకున్న వారు అవుతారు. కాబట్టి సాధారణ వ్యక్తులే కాదు ఇలాంటి ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడే వారు కూడా చక్కెరతో నిండిన ఆహారాలను తగ్గించడం చాలా మంచిది.


ఈ అధ్యయనాన్ని యూఎస్ నేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎగ్జామినేషన్ సర్వేలో భాగంగా చేశారు. ఈ సర్వేలో వ్యక్తుల జీవన శైలిని, వారికున్న ఆరోగ్య సమస్యల వివరాలను సేకరించారు. దాన్ని బట్టి విశ్లేషించారు. ఎవరైతే తమ రోజువారి ఆహార కేలరీలో ఐదు శాతం కన్నా తక్కువ చక్కెర కలిపిన పదార్థాలను తీసుకుంటారో... వారికి కిడ్నీలో రాళ్లు ఏర్పడే సమస్య చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాదు వారు ఎంతో ఆరోగ్యంగా కూడా ఉంటారు. ఇక ఎవరైతే తమ రోజువారి ఆహార కేలరీల్లో 25% కన్నా ఎక్కువ చక్కెర పదార్థాలనే తీసుకుంటారో... వారిలో కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం 88% అధికంగా ఉంది. కాబట్టి చక్కెర పదార్థాలను దూరంగా పెట్టడం ఎంతో మంచిది. పంచదార కారణంగానే మూత్రంలో క్యాల్షియం, ఆక్సలైట్ వంటి వాటి పరిమాణాలు పెరిగిపోయే అవకాశం ఉంది. ఇవన్నీ మూత్రంలో పోగు పడిపోయి చిన్న చిన్న రాళ్ళగా మారుతాయి. చివరికి కిడ్నీలో, మూత్ర నాళంలో స్థిరపడిపోయి అక్కడ తమ పరిమాణాన్ని పెంచుకుంటాయి. ఎక్కువ పంచదారను తినడం వల్ల మూత్రంలో ఆమ్లత్వం కూడా పెరుగుతుంది. ఇది కూడా రాళ్లు ఏర్పడటానికి కారణమవుతుంది. కాబట్టి కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ఉండాలంటే చక్కెర నిండిన పదార్థాలను తినడం చాలా వరకు తగ్గించాలి.


Also read: మొక్కజొన్న పీచును పడేస్తున్నారా? ఇలా టీ చేసుకోండి, ఎంతో ఆరోగ్యం





















































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.