అతి ఎప్పుడూ మంచిది కాదు. చివరికి వ్యాయమం కూడా. ఫిట్‌నెస్ కోసం చాలామంది అతిగా వ్యాయమం చేస్తారు. అవసరానికి మించి కసరత్తులు చేస్తుంటారు. అయితే, అది ఎంత ప్రమాదకరమైనదో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఓ వ్యక్తి మెట్ల మీద కూర్చొని అకస్మాత్తుగా కుప్పకూలిన చనిపోయిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. 


సూరత్‌లోని గోల్డ్ జిమ్‌లో చోటుచేసుకున్న ఘటన ఇది. 33 ఏళ్ల యువకుడు జిమ్‌కు వెళ్లాడు. ఎప్పటిలాగానే ఆ రోజు బాగా వ్యాయమం చేశాడు. ఆ తర్వాత అస్వస్థతకు గురయ్యాడు. గాబరాగా ఉండటంతో మెట్ల కాసేపు కూర్చున్నాడు. గుండెలో నొప్పిగా ఉండటంతో నీరు తాగితే చాలనుకున్నాడు. కాసేపు చాతి మీద చేతితో రుద్దుకున్నాడు. అయినా సరే నొప్పి తగ్గలేదు. కాసేపు వెనక్కి నడిచి మళ్లీ.. మెట్ల మీదకు వెళ్లి కూర్చున్నాడు. అంతే.. కాసేపటికి అకస్మాత్తుగా కుప్పకూలాడు. అతడి గుండె ఆగిపోవడంతో అతడు చనిపోయాడు. ఇదంతా జిమ్‌లో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. 


అతడు గుండె నొప్పి ఏర్పడినప్పుడు కనీసం ఎవరినైనా సంప్రదించి ఉంటే.. వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లేవారు. అలా కుప్పకూలిన అతడిని వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. అయితే, అతడు అప్పటికే చనిపోయాడని, కార్డియక్ అరెస్ట్ కావడం వల్లే అతడు చనిపోయాడని వైద్యులు చెప్పారు. అతిగా వ్యాయమం చేయడం వల్ల శరీరం అదుపు తప్పిందని, గుండె లయ తప్పడంతో చనిపోయాడని తేల్చారు. కాబట్టి.. మీరు వ్యాయమం చేసేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అతిగా కసరత్తులు చేస్తే చనిపోయే ప్రమాదం ఉందని గుర్తుంచుకోండి. 


వీడియో:


కార్డియక్ అరెస్ట్.. హార్ట్ ఎటాక్ తేడా తెలుసుకోండి: గుండె నొప్పి రెండు రకాలుగా ఏర్పడుతుంది. ఇది వచ్చేందుకు గుండె జబ్బు ఉండాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి మనం చేసే పనులు వల్ల కూడా గుండె నొప్పికి గురికావచ్చు. ఏదైనా కారణం చేత గుండెకు రక్త ప్రవాహం నిలిచిపోతే.. గుండె పనిచేయడం నిలిచిపోతుంది. 


కార్డియక్ అరెస్ట్ అంటే?: గుండెలో ఏర్పడే ఎలక్ట్రానిక్ సమస్య వల్ల కార్డియక్ అరెస్ట్ అవుతుంది. అయితే, కార్డియక్ అరెస్ట్‌ను ముందుగా గుర్తించలేం. గుండెలో ఏర్పడే ఎలక్ట్రికల్ అలజడి వల్ల గుండె లయ తప్పుతుంది. దీంతో రక్త ప్రసరణకు అంతరాయం కలుగుతుంది. ఫలితంగా గుండెతోపాటు శరీరంలోని ఇతర భాగాలకు రక్త ప్రసరణ నిలిచిపోతుంది. దీనివల్ల బాధితుడు క్షణాల్లో కుప్పకూలతాడు. ఆ సమయంలో వెంటనే సీపీఆర్ ఇవ్వడం ద్వారా మళ్లీ ప్రాణం పోయవచ్చు. అయితే, పైన జరిగిన ఘటనలో అది సాధ్యం కాలేదు. వెంటనే అతడికి సీపీఆర్ చేసి ఉంటే బతికే అవకాశాలుండేవి. 


Also Read: చిన్న వయసులోనే గుండెపోటు.. ప్రమాదంలో భారత యువత, కారణాలు ఇవే..


హార్ట్ ఎటాక్ అంటే?: గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల్లో ఏదైనా అంతరాయం ఏర్పడి కలిగే సమస్యే హార్ట్ ఎటాక్. దీన్ని కొన్ని లక్షణాల ద్వారా గుర్తుపట్టవచ్చు. గుండెలోని ధమనుల్లో బ్లడ్ క్లాట్స్ ఏర్పడినప్పుడు లేదా కొవ్వు పేర్కొన్నప్పుడు ఈ సమస్య ఏర్పడుతుంది. దీనివల్ల గుండెకు రక్తం సరఫరా కాదు. ఫలితంగా వ్యక్తి చనిపోయే ప్రమాదం ఉంది. ఛాతి నొప్పి ఎక్కువ సేపు ఉన్నా.. శరీర భాగాలు అసౌకర్యంగా అనిపించినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ముఖ్యంగా గుండె వైపు భాగాలు లేదా ఎడమ చేయి లాగుతున్నా.. శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండటం, చల్లని చెమటలు పట్టినా అప్రమత్తం కావాలి. కొందరిలో తలనొప్పి, వికారం కూడా లక్షణాలు కూడా కనిపిస్తాయి.