Best Food for Heart Health and BP :రక్తపోటుతో ఇబ్బంది పడేవారికి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వస్తాయి. బీపీ పెరగడం వల్ల గుండెపోటు, స్ట్రోక్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యల ప్రమాదం పెరుగుతుంది. అందుకే రక్తపోటును కంట్రోల్ చేసే.. మందులు తీసుకోవడంతో పాటు.. ఆరోగ్యానికి మేలు చేసే ఫుడ్స్ తీసుకోవడం చాలా ముఖ్యం. కొన్నిరకాల ఫుడ్స్ రక్తపోటును నియంత్రించడమే కాకుండా.. గుండె సమస్యలను దూరం చేయడంలో హెల్ప్ చేస్తాయి. ముఖ్యంగా రక్తపోటును నియంత్రించడానికి, గుండె సమస్యలను దూరం చేయడానికి పాలకూరను డైట్లో చేర్చుకోవాలంటున్నారు డాక్టర్ బిమల్ ఛాజేడ్. ఇది ఎలా బీపీని కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తుందో.. హార్ట్ సమస్యలు రాకుండా చూస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
అధిక రక్తపోటును ఎలా తగ్గిస్తుందంటే..
పాలకూరలో పొటాషియం, మెగ్నీషియం, నైట్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ మూలకాలు శరీరంలో సోడియం స్థాయిని సమతుల్యం చేయడానికి హెల్ప్ చేస్తాయి. దీనివల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా పాలకూరలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ అధికంగా కలిగి ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది.
గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించే
అధిక రక్తపోటు గుండెపోటుకు ప్రధాన కారణం అవుతుంది. పాలకూరలో ఉండే నైట్రేట్లు రక్త నాళాలను సడలిస్తాయి. రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి. ఇది గుండెపై ఒత్తిడిని తగ్గిస్తుంది. గుండెపోటు లేదా స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
పాలకూరను ఆహారంలో ఎలా చేర్చుకోవాలంటే..
సలాడ్ రూపంలో పాలకూరను తీసుకోవచ్చు. కాబట్టి ఆకులను కడిగి నేరుగా సలాడ్లలో ఉపయోగించవచ్చు. సూప్ తయారు చేసుకోవచ్చు. పాలకూర సూప్ అధిక బీపీ ఉన్నవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పరగడుపున పాలకూరను జ్యూస్ చేసుకుని తాగవచ్చు. ఇది రక్తపోటును అదుపులో ఉంచుతుంది. బంగాళాదుంప-పాలకూర లేదా పప్పు-పాలకూర వంటి వంటకాలు రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచివి.
పాలకూర తినడం వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు
పాలకూర కేవలం రక్తపోటును, గుండె సమస్యలను దూరం చేయడమే కాదు.. రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా హెల్ప్ చేస్తుంది. బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఎముకలు, కళ్లకు మేలు చేస్తుంది.
అధిక రక్తపోటును నియంత్రించడానికి మందులతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం చాలా ముఖ్యం. కాబట్టి పాలకూర వంటి సులభంగా లభించే కూరగాయలను తీసుకోవాలి. ఇవి రక్తపోటును సమతుల్యం చేయడమే కాకుండా గుండెపోటు ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి.