జాజికాయ అంటే అందరికీ బిర్యానిలో వేస్తారు కదా అనే గుర్తుకు వస్తుంది. కేవలం రుచికి మాత్రమే దాన్ని ఉపయోగిస్తారు. డెజర్ట్, సూప్, కూరలు, పానీయాల రుచిని పెంచే ప్రసిద్ధ మసాలా ఇది. అయితే ఇది వంటకి రుచి ఇవ్వడమే కాదు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. దీన్ని ఔషధాల్లో ఎన్నో ఏళ్లుగా వినియోగిస్తున్నారు. శారీరక, మానసిక ప్రయోజనాలను అందిస్తుంది. మహిళలు జాజికాయని తప్పని సరిగా ఆహారాల్లో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.


ఇండోనేషియాకి చెందిన మిరిస్టికా ఫ్రాగాన్స్ చెట్టు విత్తనం నుంచి వచ్చే మసాలా ఇది. తీపి,వగరు రుచిని కలిగి ఉంటుంది. బేకింగ్, సూప్, కూరలు, సాస్ కోసం మసాలాగా ఉపయోగిస్తారు. దీని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.


పోషకాలు ఇస్తుంది


⦿ జాజికాయలో మాంగనీస్, కాపర్, మెగ్నీషియం, ఫైబర్ సహ వివిధ పోషకాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ ఏ, బి, సి తో పాటు  ఖనిజాలు అందిస్తుంది. జీర్ణశక్తికి ఉపయోగపడుతుంది. అయితే వంటలలో దీన్ని తక్కువ పరిమాణంలో మాత్రమే ఉపయోగించాలి. అప్పుడే అజీర్ణం, ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.


⦿ జాజికాయలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి శరీరంలో మంటని తగ్గించడంలో సహాయపడతాయి.


⦿ నిద్రలేమికి సహజ నివారణగా ఉపయోగపడుతుంది. జాజికాయని గోరువెచ్చని పాలతో లేదా నిద్రవేళకి ముందు ఆహారంలో తీసుకోవడం వల్ల నిద్రని ప్రోత్సహిస్తుంది. నిద్రలేమి, స్లిప్ అప్నియాతో బాధపడే వాళ్ళకి చక్కని ఔషధంగా పని చేస్తుంది.


⦿ జాజికాయ నుంచి తీసిన నూనె ఆర్థరైటిస్, కండరాల నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. సహజ నొప్పి నివారిణిగా పని చేస్తుంది. అయితే దీన్ని అధిక మొత్తంలో తీసుకుంటే మాత్రం విషపూరితం కావచ్చు. అందుకే జాగ్రత్తగా వినియోగించుకోవాలి.


⦿ జాజికాయలో మిరిస్టిసిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే ఆక్సీకరణ నష్టం నుంచి కణాలని రక్షిస్తుంది. మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. మిరిస్టిసిన్ మెదడుని చురుగ్గా ఉంచుతుంది. అల్జీమర్స్ రాకుండా అడ్డుకుంటుంది.


మహిళలు ఎందుకు తీసుకోవాలి?


జాజికాయ పురుషులు, మహిళలకు మంచి ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. వీర్యకణాల ఉత్పత్తిని పెంచుతుంది. ముఖ్యంగా మహిళలు ఈ మసాలా తీసుకోవడానికి నిర్ధిష్టమైన కారణాలు ఏమి లేవు. అయితే దీన్ని మితంగా మాత్రమే తీసుకోవాలి. అధిక వినియోగం అనేక దుష్ప్రభావాలకు దారి తీస్తుంది. గర్భిణీ స్త్రీలు పెద్ద మొత్తంలో జాజికాయ అసలు తీసుకోవద్దని సలహా ఇస్తున్నారు. ఎందుకంటే ఇది గర్భధారణపై ప్రతికూల ప్రభావాలని చూపిస్తుంది.


చర్మానికి మేలు


జాజికాయ పొడి, తేనె కలిపి పేస్ట్ లాగా చేసుకుని మొహానికి స్క్రబ్ మాదిరిగా రాసుకోవాలి. ఇలా తరచూ చేస్తే కాంతివంతమైన చర్మం మీ సొంతం అవుతుంది. మొటిమలు, చర్మ సమస్యల్ని నయం చేస్తుంది. ముడతలు నివారిస్తుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: వంట చేసుకోవడానికి బద్ధకిస్తున్నారా? ఈ సింపుల్ టేస్టీ రెసిపీలు మీకోసమే