Dangerous Heat Stroke Symptoms : వేడి, ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ శరీరంపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. ఎక్కువసేపు ఎండలో తిరగడం, తక్కువ నీళ్లు తాగడం, అధిక వేడి ఉన్న ప్రాంతాల్లో పనిచేయడం వల్ల శరీరం ఓవర్ హీట్ కావచ్చు. దీన్ని చాలామంది సాధారణ అలసటగా తీసుకుంటారు. కానీ కొన్ని లక్షణాలు కనిపిస్తే అది హీట్ ఎగ్జాస్షన్ (Heat Exhaustion) లేదా హీట్ స్ట్రోక్‌కు సంకేతం కావొచ్చు. కాబట్టి వాటిని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం కలగవచ్చని అంటున్నారు నిపుణులు. మరి శరీరం ఓవర్ హీట్ అయ్యిందని చెప్పే సంకేతాలు ఏంటో.. వాటిని ఎందుకు విస్మరించకూడదో చూసేద్దాం.
అధిక చెమటలు
బాడీ ఓవర్ హీట్ అయినప్పుడు శరీరం వేడిని తగ్గించేందుకు ఎక్కువగా చెమటలు పడేలా చేస్తుంది. కానీ చెమటలు ఆగకుండా పడటం కూడా శరీరం ఒత్తిడిలో ఉందని సూచించే లక్షణమే.
తల తిరగడం
ఎండలో ఎక్కువసేపు ఉంటే బీపీ లెవెల్స్ పడిపోతాయి. అలాగే డీహైడ్రేషన్ వల్ల తల తిరగడం లేదా సరిగ్గా నిలబడలేకపోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చు.
తీవ్రమైన దాహం
ఎంత నీళ్లు తాగినా దాహం తగ్గకపోతే శరీరంలో నీటి లోపం పెరిగిందని అర్థం. ఇది కూడా బాడీ ఓవర్ హీట్ అయిందని చూపించే లక్షణమే.
చర్మం వేడిగా మారడం
శరీరం సాధారణం కంటే చాలా వేడిగా అనిపించడం, చర్మం ఎర్రబడటం కూడా సంకేతం కావచ్చు.
గుండె వేగంగా కొట్టుకోవడం
శరీర ఉష్ణోగ్రత పెరిగితే గుండె ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. దీంతో హార్ట్ రేట్ పెరుగుతుంది. ఇది గుండెపోటుకు కారణం కావచ్చు.
తలనొప్పి
హీట్ కారణంగా వచ్చే తలనొప్పి.. అలసట, బలహీనత, కళ్ల ముందు చీకట్లు కనిపించడం వంటి లక్షణాలతో కలిసి వస్తుంది.
కండరాలు పట్టేయడం
శరీరం ఎక్కువ చెమట విడుదల చేయడం వల్ల శరీరంలో ఉప్పులు, మినరల్స్ తగ్గిపోతాయి. దీంతో కాళ్లు, చేతుల్లో కండరాలు పట్టేయొచ్చు.
వాంతులు, వికారం
వేడిని శరీరం తట్టుకోలేకపోతే వికారం, వాంతులు రావచ్చు. ఇది హీట్ ఎగ్జాస్షన్ సంకేతం కావచ్చు.
మత్తుగా అనిపించడం
హీట్ స్ట్రోక్ తీవ్రంగా మారితే కన్ఫ్యూజన్, మాట తడబడటం, మత్తుగా ఉండటం వంటి లక్షణాలు కనిపించొచ్చు.
తీవ్రమైన ప్రమాద హెచ్చరిక..
శరీరం చాలా వేడిగా ఉన్నా చెమటలు రావడం ఆగిపోతే అది హీట్ స్ట్రోక్‌కు కీలక హెచ్చరిక కావచ్చు. ఈ సంకేతాన్ని అస్సలు విస్మరించకూడదు. వెంటనే వైద్య సహాయం తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. పైన లక్షణాలు కనిపిస్తే వెంటనే చల్లని ప్రదేశానికి వెళ్లాలి. నీళ్లు, కొబ్బరి నీళ్లు, ORS వంటివి తాగాలి.
హీట్ స్ట్రోక్ వచ్చిన వ్యక్తిని గుర్తిస్తే వెంటనే వాళ్లని నీడలోకి తీసుకెళ్లాలి. అలాగే బిగుతుగా ఉన్న దుస్తులను తొలగించాలి. నీటిని తాగించాలి. ముఖం, మెడపై చల్లని నీరు చల్లాలి. పరిస్థితి తీవ్రమైతే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. లేదంటే హీట్ స్ట్రోక్ వల్ల వ్యక్తి చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వేసవిలో శరీరం ఇచ్చే ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.
గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.
