ఆహారం రుచిగా ఉండాలంటే ఉప్పు ఉండాల్సిందే. అంతేకాదు శరీరానికి కూడా ఉప్పు అవసరమే. కానీ, అది తగిన మోతాదులో మాత్రమే ఉండాలి. లేకపోతే.. అది కొత్త సమస్యలను తెచ్చి పెడుతుంది. కొంతమంది రుచి కోసం ఉప్పు ఎక్కువగా ఉండే వంటకాలనే తింటారు. దాని వల్ల అప్పటికప్పుడు రుచి లభిస్తుందేమో.. కానీ, భవిష్యత్తు మాత్రం అది అస్సలు మంచి కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తాజాగా జార్జియా పరిశోధకులు జరిపిన అధ్యయనంలో కీలక విషయాలు తెలిశాయి. న్యూరాన్, మెదడులోని లోతైన రక్త ప్రవాహానికి మధ్య ఉన్న సంబంధం గురించి ఈ అధ్యయనం జరిగింది. ఈ సందర్భంగా ఉప్పు వల్ల మెదడు ఎలా ప్రభావితమవుతుందనే అంశంపై షాకింగ్ విషయాలను తెలిపారు.
న్యూరాన్లు యాక్టీవ్‌గా ఉన్నప్పుడు.. మెదడులో రక్త ప్రవాహ వేగం పెరుగుతుంది. ఈ సంబంధాన్ని న్యూరోవాస్కులర్ కప్లింగ్ లేదా ఫంక్షనల్ హైపెరెమియా అని అంటారు. ఇది ఆర్టెరియోల్స్ అని పిలువబడే మెదడులోని రక్త నాళాల విస్తరణ వల్ల ఏర్పడుతుంది. ఫంక్షనల్ మాగ్నెటిక్ రిసోర్స్ ఇమేజింగ్ (fMRI) అనేది న్యూరోవాస్కులర్ కప్లింగ్ మీద ఆధారపడి ఉంటుంది. దీని ద్వారా వైద్యులు మెదడు సంబంధిత వ్యాధులను నిర్ధారించడానికి బలహీనమైన రక్త ప్రవాహం గల ప్రాంతాలను గమనిస్తారు. ఇప్పటివరకు జరిగిన అధ్యయనాలు ఈ విధానం ద్వారా మెదడులోని ఉపరితల ప్రాంతాలకు(సెరిబ్రల్ కార్టెక్స్) మాత్రమే పరిమితమయ్యాయి. అయితే, మెదడులోని లోతైన ప్రాంతాలను పరిశీలించలేదు.
జార్జియాలోని న్యూరోసైన్స్ ప్రొఫెసర్, యూనివర్సిటీ సెంటర్ ఫర్ న్యూరోఇన్‌ఫ్లమేషన్ అండ్ కార్డియోమెటబాలిక్ డిసీజెస్ డైరెక్టర్ డాక్టర్ జేవియర్ స్టెర్న్ నేతృత్వంలోని శాస్త్రవేత్తలు సంయుక్తంగా సర్జికల్ టెక్నిక్స్ విధానాన్ని అభివృద్ధి చేసింది. దీని ద్వారా ఆహారం తిసుకొనేప్పుడు, మద్యపానం, శరీర ఉష్ణోగ్రతల్లో మార్పులు, పునరుత్పత్తి సమయంలో మెదడులోని లోతైన ప్రాంతమైన హైపోథాలమస్‌పై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసుకొనే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా ఉప్పు తీసుకోవడం వల్ల హైపోథాలమస్‌లో రక్త ప్రవాహం ఎలా మారుతుందనేది పరిశీలించింది.
ఈ అధ్యయనం గురించి డాక్టర్ జేవియర్ స్టెర్న్ వివరిస్తూ.. ‘‘శరీరంలో సోడియం(ఉప్పు) స్థాయిలను చాలా ఖచ్చితంగా నియంత్రించాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ స్టడీలో ఉప్పును ఎంచుకున్నాం. మీ రక్తంలో ఎంత ఉప్పు ఉందో గుర్తించే నిర్దిష్ట వ్యవస్థ కూడా మా వద్ద ఉంది. ఉప్పగా ఉండే ఆహారాన్ని తీసుకున్నప్పుడు, మెదడు దానిని గ్రహించి, సోడియం స్థాయిలను తగ్గించే ప్రయత్నం చేస్తుంది. ఉప్పు వాసోప్రెసిస్ అనే యాంటీడియురేటిక్ హార్మో్న్ విడుదలను ప్రేరేపించే న్యూరాన్‌లను యాక్టీవ్ చేస్తుంది. హైపోథాలమస్‌లో న్యూరాన్లు యాక్టీవ్ కావడం వల్ల రక్త ప్రవాహం తగ్గినట్లు గమనించారు. గత అధ్యయనాల్లో ఈ విషయాన్ని గుర్తించలేదు’’ అని ఆయన తెలిపారు.
Also Read: ఈ గ్రామంలో మహిళలు 5 రోజులు నగ్నంగా ఉంటారు.. వారిని చూసి నవ్వితే..
సాధారణంగా అల్జీమర్స్, స్ట్రోక్ లేదా ఇస్కీమియా వంటి వ్యాధుల విషయంలో వైద్యులు రక్త ప్రవాహంలోనే హెచ్చు తగ్గులను గమనిస్తారు. తాజా పరిశోధనలో 50 నుంచి 60 శాతం అధిక రక్తపోటు ఉప్పు వల్లే ఏర్పడుతుందని తెలుసుకున్నారు. అతిగా ఉప్పు తీసుకోవడం లేదా జీవితకాలంలో అధిక ఉప్పును వాడటం వల్ల వాసోప్రెసిన్ న్యూరాన్‌ల హైపర్యాక్టివేషన్ ఏర్పడుతుంది. ఇది హైపోక్సియాను ప్రేరేపిస్తుంది. దీని వల్ల మెదడులో కణజాలం దెబ్బతింటుందని పరిశోధకులు తెలిపారు. ఇది అనేక మెదడు సంబంధిత వ్యాధులకు కారణమవుతుంది. కాబట్టి.. ఉప్పును వీలైనంత తక్కువగా వినియోగించడం మంచిదని సూచిస్తున్నారు.
Also Read: పెళ్లికి ముందే శృంగారం.. ఇక్కడి ప్రజలకు ఇదే ఆచారం, ఎక్కడో కాదు ఇండియాలోనే!
Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..
Also Read: ఇదో వింత గ్రామం.. ఇక్కడి మగాళ్లు పెళ్లి చేసుకోరు.. తమ పిల్లలను పెంచరు.. కానీ, రాత్రయితే..