Tips to Storing Cut Watermelon : వేసవి వేడి నుంచి ఉపశమనం కోసం, శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడానికి పుచ్చకాయను ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. అలాగే చాలామంది సమయం ఆదా చేసుకోవడానికి మార్కెట్ నుంచి ముందుగా కోసిన పుచ్చకాయ ముక్కలు తెచ్చుకుంటారు. లేదా ఇంట్లోనే పెద్ద పుచ్చకాయను కోసి.. రోజంతా తినడానికి ఫ్రిజ్‌లో రెడీగా పెట్టుకుంటారు. కానీ ఈ విధంగా నిల్వ చేసిన పుచ్చకాయ ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో తెలుసా? కోసిన పుచ్చకాయను సరిగ్గా నిల్వ చేయకపోతే.. అది ఫుడ్ పాయిజనింగ్ వంటి తీవ్రమైన అనారోగ్యాలకు కారణమవుతుందని ఆరోగ్య నిపుణులు, డైటీషియన్లు హెచ్చరిస్తున్నారు.
పుచ్చకాయను కోసేస్తే..
పుచ్చకాయపై ఉండే తొక్క దానిని బయటి వాతావరణం, క్రిముల నుంచి కాపాడుతుంది. కానీ కత్తితో కోసిన వెంటనే.. దాని మెత్తటి, ఎర్రటి, తియ్యటి భాగం.. బయటి గాలికి, మన చేతులకు లేదా కత్తిపై ఉండే కంటికి కనిపించని బ్యాక్టీరియాకు ఎఫెక్ట్ చేస్తుంది. పుచ్చకాయలో నీరు, సహజ చక్కెర అధికంగా ఉంటాయి. ఈ తేమ, తీపి.. బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందడానికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తాయి. కోసిన పుచ్చకాయను వెంటనే సరైన ఉష్ణోగ్రత ఉన్న ఫ్రిజ్‌లో పెట్టకుండా.. బయట ఎండలో వదిలేస్తే.. అతి తక్కువ సమయంలో దానిపై హానికరమైన క్రిములు వృద్ధి చెందుతాయి.
ఫుడ్ పాయిజనింగ్
ఇలా నిల్వ ఉంచిన పుచ్చకాయ ముక్కలను తినడం వల్ల సాల్మొనెల్లా, లిస్టేరియా వంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ బ్యాక్టీరియా కడుపులోకి ప్రవేశించిన వెంటనే జీర్ణవ్యవస్థను దెబ్బతీసి.. భరించలేని కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, అధిక జ్వరం, డీహైడ్రేషన్ వంటి తీవ్రమైన శారీరక సమస్యలను కలిగిస్తాయి. తరచుగా మార్కెట్లలో రోడ్డు పక్కన అమ్మే మూతలేని పుచ్చకాయలపై దుమ్ము, ధూళి, ఈగలు చేరి.. ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదాన్ని రెట్టింపు అవుతాయి.
అతి పెద్ద పొరపాటు ఇదే..
పుచ్చకాయ తినేటప్పుడు చాలామంది చేసే పెద్ద పొరపాటు ఏమిటంటే.. దానిని కోయడానికి ముందు దానిపై తొక్కను కడగరు. పుచ్చకాయ నేల మీద పెరుగుతుంది కాబట్టి.. దాని తొక్కపై చాలా దుమ్ము, మట్టి, రసాయన ఎరువుల అవశేషాలు అలాగే బ్యాక్టీరియా ఉంటాయి. కడగకుండా నేరుగా కోసినప్పుడు.. తొక్కపై ఉన్న బ్యాక్టీరియా కత్తి ద్వారా పుచ్చకాయలోకి ప్రవేశిస్తుంది. అందువల్ల పుచ్చకాయను కోయడానికి ముందు శుభ్రమైన కుళాయి నీటితో పూర్తిగా కడగడం చాలా అవసరం.
పుచ్చకాయ స్టోరేజ్ టిప్స్
మీరు పుచ్చకాయను కోసి కొంతకాలం పాటు నిల్వ చేయాలనుకుంటే.. పోషకాహార నిపుణులు సూచించిన ప్రత్యేక నిల్వ నియమాలను పాటించాలి. కోసిన పుచ్చకాయ ముక్కలను ఎప్పుడూ ప్లేట్‌లో తెరిచి ఉంచకూడదు. వాటిని ఎప్పుడూ గాలి చేరని మంచి డబ్బాలో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచాలి. ఒకవేళ డబ్బా అందుబాటులో లేకపోతే.. ఫ్రిజ్‌లోని ఇతర ఆహార పదార్థాల నుంచి బ్యాక్టీరియా కలవకుండా ఉండేందుకు.. దానిని ర్యాప్‌తో గట్టిగా మూసివేయాలి. దీనితో పాటు.. ఫ్రిజ్ ఉష్ణోగ్రత ఎల్లప్పుడూ 4 డిగ్రీల ఉష్ణోగ్రత లేదా అంతకంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలి. కోసిన పుచ్చకాయను1 లేదా 2 రోజుల్లోపు తినేయాలి.
మండే ఎండలు, గాలిలోని తేమ కారణంగా ఈ రోజుల్లో ఏ ఆహారమైనా చాలా త్వరగా పాడైపోతుంది. ఇలాంటి వాతావరణంలో బ్యాక్టీరియా రెట్టింపు వేగంతో వృద్ధి చెందుతుంది. దీనివల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశాలు బాగా పెరుగుతాయి. ముఖ్యంగా చిన్నపిల్లలకు, వృద్ధులకు, గర్భిణీ స్త్రీలకు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి.. నిల్వ ఉన్న లేదా కలుషితమైన ఆహారం మరింత ప్రమాదకరంగా మారవచ్చు. అందుకే ఆహార శుభ్రత విషయంలో ఏమాత్రం రాజీ పడకూడదు. తెరిచి ఉంచిన లేదా ఎక్కువ కాలం నిల్వ ఉంచిన పండ్లను తినడం మానుకోవాలి.
గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.
