నెయ్యి లేనిదే ముద్ద దిగదు కొంతమందికి. వేడి వేడి అన్నంలో ఆవకాయ పచ్చడి వేసుకుని కొద్దిగా నెయ్యి దట్టించి తిన్నారంటే అబ్బా.. ఆ రుచే వేరు. చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. నెయ్యిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. దేశీయ ఆవు నెయ్యి చాలా స్వచ్చమైనది, రుచికరం. చపాతీలు, పరోటాలు, బ్రెడ్ వంటివి ఫ్రై చేసుకునేందుకు అందరి ఇళ్ళల్లో ఈ నెయ్యినే ఉపయోగిస్తారు. దీని వల్ల ఆహార పదార్థాలకు అదనపు రుచి వస్తుంది. కేవలం వంటల్లోనే కాదు.. ఆచారవ్యవహారాల్లో కూడా ఎక్కువగా వాడతారు. దేవుడిని ఆరాధించడానికి ఉపయోగించే పంచామృతంలో నెయ్యి ఓ భాగం. ఆవు నేతితో దీపం వెలిగిస్తారు. హోమాల్లో నెయ్యి వాడతారు. నెయ్యి వల్ల ఎంత లాభమో.. అంతే నష్టం కూడా ఉంది. బరువు తగ్గాలని అనుకునే వాళ్ళు నెయ్యి జోలికి అసలు వెళ్లకూడదు.


ఎవరు తినకూడదు?


కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు అసలు నెయ్యి తినకూడదు. వాళ్ళే కాదు ఊబకాయం, పీసీఓడి సమస్యతో సతమతమవుతున్న వాళ్ళు, బరువు తగ్గాలని అనుకునే వాళ్ళు నెయ్యిని తినకుండా ఉండటమే వారి ఆరోగ్యానికి మంచిది. దేశీయ నెయ్యిలో అదిక మొత్తంలో సంతృప్త కొవ్వులు ఉన్నాయి. ఒక టేబుల్ స్పూన్ నెయ్యిలో దాదాలు 112 కేలరీలు ఉంటాయి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సిఫార్సు ప్రకారం ఒక వ్యక్తి రోజు మొత్తం మీద 2000 కేలరీల అహహరాన్ని మాత్రమే తీసుకోవాలి. అప్పుడే ఆరోగ్యకరంగా ఉంటారు. తీసుకునే ఆహార పదార్థాల్లో కొవ్వు 56-78 గ్రాముల మధ్య ఉండాలి. వాటిలో కూడా సంతృప్త కొవ్వులు 16 గ్రాములకి మించకూడదు. మోతాదుకు మించి తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోయి ఇతర అనారోగ్య సమస్యలకి దారి తీస్తుంది.


గుండె, కిడ్నీ జబ్బులతో బాధపడే వాళ్ళు ఆవు నెయ్యి ఎక్కువగా తీసుకోకూడదని వైద్యులు సూచిస్తున్నారు. పొట్టకి సంబంధించిన సమస్యలు ఏవైనా ఉన్నా కూడా ఆవు నెయ్యి లేదా ఇతర నెయ్యి కూడా తీసుకోకూడదు. ఎందుకంటే నెయ్యిలో కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తపోటును పెంచే సామర్థ్యం కలిగి ఉంటాయి. ఇటువంటి సమస్యలతో బాధపడే వాళ్ళకి భోజనంలో తరచూ నెయ్యి తినే అలవాటు ఉంటే ఖచ్చితంగా వైద్యులను సంప్రదించిన తర్వాతే తినాలి. కడుపు ఉబ్బరంగా ఉన్నపుడు, జీర్ణ సమస్యలతో బాధపడేవాళ్ళు నెయ్యికి దూరంగా ఉండాలి. నెయ్యిలో కొవ్వు పుష్కలంగా ఉన్నందున సీనియర్ సిటిజెన్లలో గుండె జబ్బు, క్యాన్సర్ ప్రమాదానికి దారి తీస్తుంది. వృద్ధులు తమ గుండెని ప్రమాదంలో పడకుండా ఉండేందుకు నెయ్యికి తప్పని సరిగా దూరంగా ఉండాలి.


ఆవు నెయ్యి ఎంతో రుచిగా ఉంటుంది. దాన్ని వదిలిపెట్టాలని ఎవరు అనుకోరు. రొటీలు, పరోటాలు చేసేప్పుడు కచ్చితంగా నెయ్యి వినియోగిస్తారు. అయితే ఈ కోవిడ్ సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. అందుకే రుచి కోసం చూసుకుంటే అనారోగ్య సమస్యల్ని కొని తెచ్చుకున్నట్టు అవుతుంది.


Also read: లో-బీపీతో కళ్లు తిరుగుతున్నాయా? కారణాలివే, ఈ జాగ్రత్తలు పాటించండి


Also Read: మీకు డయాబెటిస్ ఉందో లేదో మీ పాదాలు చెప్పేస్తాయ్