Amit Shah Munugode Tour: ఈనెల 21వ తేదీన రాష్ట్రంలోని మునుగోడు నియోజక వర్గంలో జరగబోయే బీజేపీ భారీ బహిరంగ సభకు కేంద్ర మంత్రి అమిత్ షా హాజరు కాబోతున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ తరుణ్ చుగ్ వెల్లడించారు. వచ్చే ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు జరగబోయే ఈ పార్టీ కార్యాలయంలో.. పార్టీ కార్యాచరణను అమిత్ షా ప్రకటిస్తారని బుధవారం దిల్లీలోని తన నివాసంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో తెలిపారు.


అవినీతి గురించి మాట్లాడితే సీఎం వణికిపోతారు..


సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని తరుణ్ చుగ్ ఆరోపించారు. రాష్ట్రానికి ప్రధాన శత్రువు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ యే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి, కుటుంబ పాలనతో తెలంగాణను నిలువెల్లా దోచుకుంటున్నారని ఆయన విమర్శించారు. అవినీతి గురించి మాట్లాడితే చాలు సీఎంకు చెమటలు పడతాయని, ఎందుకంత భయం అంటూ ప్రశ్నించారు. దేశంలో ఇందిరా గాంధీ నియంతృత్వం ముగిసినట్టుగానే తెలంగాణలో కేసీఆర్ కేసీర్ నియంతృత్వ పాలన ముగుస్తుందన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీని గెలిపించి సీఎం కేసీఆర్ ప్రజలు బుద్ధి చెబుతారని వెల్లడించారు. 


ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నాలు..


గత కొంత కాలంగా టీఆర్ఎస్ పార్టీ నేతలకు, సీఎం కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందని తరుణ్ చుగ్ తెలిపారు. ఆ భయంతోనే చాలా మంది ఎమ్మెల్యే ఆ పార్టీని వీడుతున్నారని వివరించారు. తెలంగాణలో జరగబోయే అమిత్ షా సభతో రాష్ట్రం కుటుంబ రాజకీయాల నుంచి విముక్తి పొందుతుందని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ శ్రేణులు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఆదివారం జరగబోయే బీజేపీ భారీ బహిరంగ సభలో ఇతర పార్టీలకు చెందిన పలువురు నాయకులు అమిత్ షా చేతుల మీదుగా పార్టీ కండువా కప్పుకోబోతున్నట్లు వివరించారు. 


ఈనెల 27న హన్మకొండలో.. 


కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు నియోజక వర్గంలో ఉప ఎన్నిక రాబోతుంది. ఈ క్రమంలోనే బీజేపీ పెద్ద సంఖ్యలో చేరికలకు రంగం సిద్ధం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన రాజగోపాల్ రెడ్డి 21వ తేదీన అమిత్ షా సమక్షంలో బేజీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. అలాగే ప్రభుత్వ మాజీ ప్రత్యేక ప్రతినిధి తేజావత్ రామచంద్రు నాయక్, మాజీ డీజీపీ కృష్ణ ప్రసాద్, నర్సాపూర్ మున్సిపాలిటీ మాజీ ఛైర్మన్ మురళీ యాదవ్, మునుగోడులోని పలువురు టీఆర్ఎస్ నేతలు కూడా బేజీపీలో చేరబోతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బండి సంజయ్ చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర-3 ముగింపు సందర్భంగా ఈనెల 27వ తేదీన హన్మకొండలో బహిరంగ సభ నిర్వహించబోతన్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాగానీ, యూపీ సీఎం యేగి ఆదిత్య నాథ్ గానీ ఈ సభలో పాల్గొనే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వివరిస్తున్నాయి. ఇదే సభలో మంత్రి ఎర్రబెల్లి సోదరుడు ప్రదీప్ రావు, మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకన్న కుమారుడు బొమ్మ శ్రీరాం తదితరులు బీజేపీ చేరుతారని అంటున్నాయి. 


మునుగోడు పర్యటన షెడ్యూల్ ఇలా


అమిత్ షా 21న మునుగోడు పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఖారారైందని బీజేపీ వర్గాలు తెలిపాయి. 21న సాయంత్రం 4.30 గంటలకు మునుగోడుకు అమిత్ షా చేరుకోనున్నారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు జరిగే బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారు. బహిరంగ సభ తర్వాత ఢిల్లీకి పయనం అవుతారు.