నవంబర్ 26... మన రాజ్యాంగ దినోత్సవం. కానీ చాలా మందికి ఈ దినోత్సవం ప్రత్యేకత తెలియదు. ఆగస్టు 15, జనవరి 26 తేదీలకు వచ్చినంత ప్రాముఖ్యత నవంబర్ 26కు రాలేదు. దానికి కారణం ఈ ప్రత్యేక దినోత్సవాన్ని మనం నిర్వహించుకోవడం మొదలు పెట్టి ఇంకా ఆరేళ్లే అయింది. అందుకే  చాలా మందికి ఈరోజు ప్రత్యేకత తెలియదు. 


ఏంటి ప్రత్యేకత?
1947, ఆగస్టు 15 మనకి స్వాతంత్య్రం వచ్చినరోజు, జనవరి 26 మన గణతంత్ర దినోత్సవం. 1950, జనవరి 26 నుంచే మన రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అయితే 1949, నవంబర్ 26 తేదీకి ఒక ప్రత్యేకత ఉంది. అదే రోజు మన లిఖిత రాజ్యాంగాన్ని భారత అసెంబ్లీ ఆమోదించింది. ఆ రాజ్యంగానికే లోబడే దేశంలోని ప్రజలు, పాలకులు నడుచుకోవాల్సి ఉంటుందని తీర్మానించింది. అలా ఆరోజు అసెంబ్లీలో ఆమోదం లభించాకే మరుసటి ఏడాది అంటే 1950, జనవరి 26 నుంచి రాజ్యాంగం దేశంలో అమలులోకి వచ్చింది. అయితే నవంబర్ 26 తేదీ ప్రత్యేకతను అందరూ మరిచిపోయారు. 


2015 నుంచి...
కేంద్రప్రభుత్వం 2015 నవంబర్ 19న ఒక గెజిట్ నోటిపికేషన్ ను తీసుకొచ్చింది. దాని ప్రకారం ఇక ప్రతి ఏడాది నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా నిర్వహించుకోవాలి. ముంబైలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి పునాది రాయి వేసిన కార్యక్రమంలో ప్రధానిమోడీ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈరోజున కాలేజీలు, యూనివర్సిటీలలో రాజ్యాంగం పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. మాక్ పార్లమెంటు వంటివి కూడా జరుగుతాయి. విద్యార్థులకు, సామాన్యప్రజానీకానికి తమ హక్కుల పట్ల అవగాహన కల్పించేందుకే ఈ రాజ్యాంగ దినోత్సవం. 


కోటి రూపాయల ఖర్చుతో...
నూట యాభై ఏళ్ల పాటు పరాయి పాలనతో మగ్గిన భారతావనికి 1947లో స్వేచ్ఛ లభించింది. కానీ మనదేశానికి ఒక రాజ్యంగం లేదు. దీంతో కింగ్ జార్జిఫైవ్ నాయకత్వంలోనే మూడేళ్ల పాటూ ప్రభుత్వం నడిచింది. మనకంటూ ఓ రాజ్యాంగం ఉండాలని భావించి, 1947 ఆగస్టు 29న రాజ్యాంగ రూపకల్పనకు బీఆర్ అంబేద్కర్ నాయకత్వంలో డ్రాప్ట్ కమిటీ ఏర్పడింది. రాజ్యాంగాన్ని రూపొందించేందుకు కోటి రూపాయలను వెచ్చించారు. ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రూపొందించారు.  


రాజ్యాంగమే ఆధారం...
మనదేశంలో రాజ్యాంగమే సర్వ శక్తివంతమైనది. ప్రజల నుంచి పాలకుల దాకా అందరూ దాని ప్రకారమే నడుచుకోవాలి. అధికారం స్వీకరించడం అయినా, విధులు నిర్వహించడం అయినా... అన్నీ రాజ్యాంగానికి లోబడే జరగాలి. భారతదేశానికి రాజ్యాంగాన్ని ఇవ్వడానికి కృషి చేసిన మహాత్ములందరికీ ఈ దినోత్సవం ఒక నివాళి. 


Read Also: ఈ లక్షణాలు కనిపిస్తే... మీకు థైరాయిడ్ ఉన్నట్టే


Read Also: షాకింగ్... ఆస్పిరిన్ ట్యాబ్లెట్ల వల్ల గుండె ఆగిపోయే ప్రమాదం ఎక్కువ, కొత్త అధ్యయన ఫలితం


Read Also: వంటల్లో పసుపు వాడాల్సిందే... క్యాన్సర్‌ను అడ్డుకునే శక్తి దానికే ఉంది


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి