Soya Recipe: నాన్ వెజ్ తినని వారికి ప్రొటీన్ అందించడంలో ముందుంటుంది సోయా. సోయా ఉత్పత్తుల్లో ఒకటి సోయా చంక్స్. కొందరు వీటిని మీల్ మేకర్ అని పిలుస్తారు. మంచి నాణ్యత కలిగిన సోయా చంక్స్ ను తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. వారానికి కనీసం రెండు సార్లు వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే మంచిది. బిర్యానీలో, లేదా కూరలో కలుపుగా వేసుకుని తినచ్చు. ముఖ్యంగా బంగాళాదుంప, క్యాబేజీ, కాలీఫ్లవర్, బీన్స్ వంటి కూరలకు ఇది మంచి జోడీ. పిల్లలకు కూడా నచ్చుతుంది. అలాగే దీంతో  కీమా కర్రీ కూడా వండుకోవచ్చు. వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే రుచి అదిరిపోతుంది. అయితే ఇక్కడ మేము గోబీ మంచూరియాలాగే సోయా మంచూరియా ఎలా చేసుకోవాలో చెప్పాము. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ మీరే చేసుకుని తింటారు. 


కావాల్సిన పదార్థాలు
సోయా చంక్స్ - వందగ్రాములు
మైదా - నాలుగు స్పూన్లు
ఉల్లిపాయ  - ఒకటి
కొత్తిమీర - ఒక కట్ట
అల్లం తరుగు - అరస్పూను
వెల్లుల్లి తరుగు - అర స్పూను
అల్లం వెల్లుల్లి పేస్టు - అర టీ స్పూను
కారం - అర టీస్పూను
కార్న్ ఫ్లోర్ - రెండు టేబుల్ స్పూన్లు
వెనిగర్ - ఒక టీస్పూను
డార్క్ సోయాసాస్ - ఒక టీస్పూను
గ్రీన్ చిల్లీసాస్ - ఒక టీస్పూను
టోమాటో సాస్ - ఒక టీస్పూను
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - తగినంత 
నీళ్లు - తగినన్ని
పచ్చిమిర్చి - మూడు 
స్ట్రింగ్ ఆనియన్స్ - రెండు కాడలు


తయారీ ఇలా
1. స్టవ్ మీద కళాయి పెట్టి నీళ్లు పోసి మరగబెట్టాలి. అందులో సోయా చంక్స్ లేదా బాల్స్ వేస్తే మెత్తగా అయిపోతాయ. వెంటనే స్టవ్ కట్టేయాలి. 
2. వాటిని తీసి చల్లనినీళ్లలో వేసి, చల్లారగానే చేతుల్లోకి తీసుకుని వాటిలోని నీళ్లు పిండేయాలి. 
3. నీళ్లను పిండేసి సోయా చంక్స్‌ను ఒక గిన్నెలో వేయాలి. 
4. ఆ గిన్నెలో మైదా, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలపాలి. 
5. కాస్త నీళ్లు కలిపి సోయా ముక్కలకు అవన్నీ బాగా పట్టేలా చేయాలి. 
6. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ప్రై చేసేందుకు సరిపడా నూనె వేయాలి. 
7. ఆ నూనెలో సోయా ముక్కలను విడివిడిగా వేయాలి. అవి రంగు మారే వరకు వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి. 
8. ఇప్పుడు స్టవ్ పై మరొక కళాయి పెట్టుకుని అందులో ఒక స్పూను నూనె వేయాలి. 
9. ఆ నూనెలో వెల్లుల్లి తరుగు, అల్లం తరుగు, పచ్చిమిర్చి, తరిగిన ఉల్లికాడలు, ఉల్లిపాయల తరుగు వేసి వేయించాలి. 
10. అందులో ఉప్పు కూడా వేసి కలపాలి. 
11. తరువాత చిల్లీసాస్, డార్క్ సోయా సాస్, టొమాటో సాస్, వెనిగర్ అన్నీ కలపాలి.
12.  ఇప్పుడు వేయించి పెట్టుకున్న సోయా బాల్స్ ను అందులో వేసి బాగా కలపాలి. 
13. పైన కొత్తిమీర చల్లుకుని దించుకుంటే సరి. 
సాయంత్రం వేళ వేడివేడిగా సోయా మంచూరియా తింటే ఆ కిక్కే వేరు. 


Also read: ఇండియా - పాక్ క్రికెట్ మ్యాచ్ చూస్తున్న వ్యక్తికి గుండెపోటు, అత్యుత్సాహం వల్ల గుండె ఆగుతుందా?