Kottu Satyanarayana On Pawan Kalyan: తూర్పు గోదావరి: ఏపీ మంత్రులు, వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తనకు పదే పదే టార్గెట్ చేయడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొన్ని రోజుల కిందట మూడు పెళ్లిళ్లపై చేసిన కామెంట్ల వివాదం ఇంకా కొనసాగుతోంది. సీఎం జగన్ సహా వైసీపీ నేతలు పవన్ వ్యాఖ్యల్ని తప్పుపడుతున్నారు. ఏపీ మహిళా కమిషన్ ఇదివరకే పవన్ కళ్యాణ్ కు నోటీసులు జారీ చేసింది. తాజాగా ఏపీ మంత్రి కొట్టు సత్యనారాయణ స్పందించారు. పవన్ మతి ఉండే మట్లాడుతున్నారా, అలాంటి కామెంట్లతో ఏ మొహం పెట్టుకుని మహిళల్ని జనసేన పార్టీ ఓట్లు అడుగుతుందని ప్రశ్నించారు.
చంద్రబాబు డైరెక్షన్ లో నటుడు పవన్ యాక్షన్ !
గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకుంటున్నట్లుగా పవన్ కళ్యాణ్ వ్యవహారం ఉందన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ. జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిజంగా ప్యాకేజీ స్టార్ అని వ్యాఖ్యానించారు. ఒకవేళ ప్యాకేజీలు తీసుకోకపోతే పవన్ ఎందుకు ఆవేశపడుతున్నాడని ప్రశ్నించారు. మాజీ సీఎం చంద్రబాబు చెప్పిన ప్లాన్ పవన్ అమలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు డైరెక్షన్ లో నటుడు పవన్ నడుచుకుంటున్నారని.. టీడీపీ అధినేత చెప్పడం వల్లే పవన్ బస్సు యాత్ర వాయిదా వేసుకున్నారని విమర్శించారు.
విశాఖ రాజధాని కోసం వైసీపీ నేతలు విశాఖ గర్జన చేపట్టిన రోజే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జనవాణి కార్యక్రమాన్ని ఎందుకు చేపట్టారో ప్రజలకు చెప్పాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక టీడీపీ, జనసేన కలిసి కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. చంద్రబాబు లాంటి ఔట్‌డేటెడ్ నేత కోసం పవన్ ఎందుకు ఆరాట పడుతున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. మీకు కావాలంటే విడాకులు తీసుకుని మూడేసి పెళ్లిళ్ళు చేసుకోవాలంటూ పవన్ చేసిన వ్యాఖ్యల్ని రీప్లే చేసి చూసుకుంటే తనకే అసహ్యం వేస్తుందన్నారు. అంత జుగుప్సాకరంగా మాట్లాడిన పవన్ మహిళల్ని ఓట్లు అడగగలరా ఆలోచించుకోవాలన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ.
జనసేన శ్రేణులకు రూల్స్ అంటే లెక్కలేదని డైలాగులు, ఫైట్లు ఎంత ఎక్కువ చేస్తే ఆ సినిమా హిట్టు అవుతుందనే ఫార్ములాతో పవన్ రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాజకీయ నేతలు అద్దాల మేడలో ఉంటారనే విషయాన్ని పవన్ కళ్యాణ్ మర్చిపోతున్నారని చెప్పారు. తనపై జనసేన కార్యకర్తలు దాడి చేస్తారని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీ చేసినట్లు వచ్చిన వార్తలపై మంత్రి కొట్టు సత్యనారాయణ స్పందించారు. తమ ప్రభుత్వం రౌడీయిజాన్ని రూపుమాపుతోందని, తనపై దాడులు జరిగే అవకాశమే లేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కేవలం పవన్‌కు మాత్రమే నోటీసులా !
ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మపై తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి భజనపై ఉన్న ఆసక్తి, ఆమె నిర్వహించాల్సిన బాధ్యతలపై లేదు అని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మహిళలు, బాలికలపై నిత్యం ఎన్నో దారుణాలు జరుగుతున్నా పట్టించుకోని మహిళా కమిషన్ కేవలం చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్ కు నోటీసులు ఇవ్వడంపై మాత్రం ఆసక్తి ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలపై తాము ఓ పుస్తకం కూడా ఇచ్చామని, వాటిలో పేర్కొన్న ఏ ఘటనలోనూ కేసులు నమోదు చేయలేదని విమర్శించారు.