Double Cancer Risk in Women : సిగరెట్లు, మందు తాగడం వంటి అలవాట్లు ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమైనవి. ఈ రెండూ క్యాన్సర్ ప్రమాదానికి ప్రధాన కారణాలుగా చెప్తారు. ఈ అలవాట్ల కారణంగా పురుషులలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. అయితే ఈ అలవాట్లు మగవారు, ఆడవారితో పోలిస్తే.. షాకింగ్ విషయాలు తెలిశాయి. పురుషులతో పోలిస్తే.. మందు, సిగరెట్లు మహిళల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయని గుర్తించారు నార్వే, ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు. 

Continues below advertisement

సిగరెట్లు, మద్యం సేవించే మహిళల్లో పురుషులపై పెద్ద ఎత్తున అధ్యయనం చేశారు. అలా పోల్చినప్పుడు క్యాన్సర్, గుండె జబ్బుల ప్రమాదం ఆడవాళ్లల్లో ఎక్కువగా ఉంటుందని కనుగొన్నారు. ఇద్దరూ ఒకే మోతాదులో తీసుకున్నా.. ఆడవారికి క్యాన్సర్ ప్రమాదం ఎందుకు ఎక్కువగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

మందు, సిగరెట్లు తాగే మహిళలకు క్యాన్సర్ ప్రమాదం ఎక్కువ

ఈ సెన్సిటివ్ అంశంపై నార్వే పరిశోధకులు.. దాదాపు 6 లక్షల మంది వైద్య రికార్డులను అధ్యయనం చేశారు. మద్యం, సిగరెట్లు తాగే మహిళల్లో.. పురుషులతో పోలిస్తే ఊపిరితిత్తులు, పెద్దపేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం రెట్టింపు అవుతుందని కనుగొన్నారు. ఈ పరిశోధనల్లో దాదాపు 4,000 మందికి పెద్దపేగు క్యాన్సర్ వచ్చింది. ముఖ్యంగా 16 సంవత్సరాల వయస్సు లేదా అంతకంటే తక్కువ వయస్సులో సిగరెట్లు తాగడం ప్రారంభించి.. ఎక్కువ కాలం కొనసాగించే మహిళల్లో ఈ క్యాన్సర్ ప్రమాదం మరింత పెరుగుతుందని చెప్తున్నారు. మహిళల శరీరం పొగాకు వంటి హానికరమైన పదార్థాలకు సెన్సిటివ్​గా రియాక్ట్ అవుతుందని గుర్తించారు. 

Continues below advertisement

ఆడవారికి క్యాన్సర్ ప్రమాదం ఎందుకు ఎక్కువ..

మద్యం, సిగరెట్లు తాగే మహిళల్లో క్యాన్సర్ ప్రమాదం ఎక్కువగా ఉండటానికి జీవసంబంధమైన కారణాలు కూడా ఓ కారణమంటున్నారు. ఉదాహరణకు మహిళల్లో ఈస్ట్రోజెన్ వంటి కొన్ని ఎంజైమ్‌లు, హార్మోన్లు పొగాకు పొగ నుంచి విడుదలయ్యే హానికరమైన మూలకాలు జీవక్రియను ప్రభావితం చేస్తాయి. అందుకే మహిళల్లో తక్కువ సిగరెట్లు తాగినా పురుషులతో పోలిస్తే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ అధ్యయనం ప్రకారం.. ఇతరుల పొగకు గురికావడం వల్ల కూడా మహిళలపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. 

తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, నివారణ చర్యలు

మద్యం, సిగరెట్లు తాగే బాలికల్లో ఊపిరితిత్తులు, పెద్దపేగు క్యాన్సర్ ప్రమాదం ఎక్కువగా ఉండడమే కాకుండా.. గుండె జబ్బులు, ఎంఫిసెమా, ఇతర తీవ్రమైన వ్యాధుల ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటాయట. అంతేకాకుండా మహిళల్లో పురుషులతో పోలిస్తే ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం రెట్టింపు ఉంటుందని చెప్తున్నారు. సిగరెట్లను వదిలేయడం ఆరోగ్యానికి అత్యంత ప్రభావవంతమైన మార్గమని ఈ పరిశోధన స్పష్టం చేసింది. 30 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి మద్యం, సిగరెట్లు తాగడం మానేసిన మహిళల్లో పొగాకు సంబంధిత వ్యాధుల ప్రమాదం దాదాపుగా ఉండదని చెప్తున్నారు నిపుణులు.

మందు, సిగరెట్లు తాగే అలవాటు ఉంటే క్రమం తప్పకుండా స్క్రీనింగ్ టెస్ట్​లు చేయించుకోవడం ముఖ్యం. పొగతాగేవారికి దగ్గరగా ఉండేవాళ్లు కూడా రెగ్యులర్​గా మెడికల్ టెస్ట్​లు చేయించుకోవాలి. అంతేకాకుండా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం, హానికరమైన రసాయనాలకు దూరంగా ఉండడం వల్ల క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుందని చెప్తున్నారు. జీవితంలో ఈ మార్పులు ఫాలో అయితే ఆరోగ్యం, భవిష్యత్తు కూడా మెరుగ్గా ఉంటుంది.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.