Bear Sleep like Sleep: ఉత్తర దక్షిణ ధృవాల్లో అత్యంత శీతల వాతావరణంలో జీవించే ధృవపు ఎలుగుబంట్లు.. సంవత్సరంలో ఆరు నెలలు నిద్రలోనే ఉంటాయి. ఎందుకంటే ధృవాల్లో ఆరు నెలల పాటు చీకటి ఉంటుంది. గడ్డకట్టుకుపోయే వాతావరణంలో అవి హైబర్‌నేషన్(నిద్రాణస్థితి)కు గురవ్వుతాయి. వాటి శరీరంలో జీవక్రియలు అన్నీ కూడా మందగించి నిద్రలోకి జారుకుంటాయి. ఆరు నెలల పాటు నిద్రించే జీవిస్తాయి. మరో ఆరు నెలల పాటు అవి వేటాడి ఆహారం తింటాయి. కానీ, మనుషులకు అది సాధ్యమా? కానే కాదు కదూ. ఎలుగుబంటిలా మనం ఆరు నెలలు నిద్రపోవాల్సిన అవసరం లేదు. కానీ, రోజులో ఎలాంటి అంతరాయం లేకుండా ఎక్కువ సేపు హాయిగా నిద్రపోతే చాలు. ఎక్కువ కాలం జీవించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.


ఎక్కువ నిద్ర.. ఎక్కువ విశ్రాంతి


వాస్తవానికి ఎన్నో అధ్యయనాలు, వైద్య నిపుణులు ఒక మనిషి రోజులో ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్రిస్తే సరిపోతుందని సూచిస్తున్నారు. ఇటీవల కొన్ని అధ్యయనాు రోజులో ఎక్కువ సేపు నిద్రపోయేవారు ఎక్కువ కాలం జీవిస్తారని తెలుపుతున్నాయి. వాషింగ్టన్ పోస్టు రిపోర్ట్ చేసిన ఈ స్టడీలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి.  నిద్రాణస్థితిలో ఉన్నటువంటి జంతువులు సుదీర్ఘకాలం జీవిస్తాయి. నిజానికి ఎక్కువసేపు నిద్రించడం వల్ల గుండె కొట్టుకునే రేటు చాలావరకు తగ్గిపోతుంది. అలాగే శారీరక ప్రక్రియలు కూడా చాలా వరకు నెమ్మదిస్తాయి. ఈ నేపథ్యంలో మన శరీరం పూర్తి విశ్రాంతి తీసుకోవడం వల్ల, ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. 


ఎలుగు బంట్లలా మనుషులు నిద్రపోవడం సాధ్యమేనా?


స్వీడన్ కు చెందిన కార్డియాలజిస్టులు జరిపిన ఓ అధ్యయనంలో ధృవపు ఎలుగుబంట్లు నిద్రాణస్థితిలో ఉన్నప్పుడు వాటికి ఎలాంటి జబ్బులు రాలేదని పేర్కొన్నారు. ఇది కళ్ళ ముందు కనిపిస్తున్న సాక్ష్యం అని పరిశోధకులు చెబుతున్నారు. బ్రౌన్ ఎలుగుబంట్లు సంవత్సరంలో 8 నెలల పాటు నిద్రిస్తాయి. మనుషులు అంతకాలం నిద్రిస్తే జీవించడం అసాధ్యం అవుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. సుదీర్ఘకాలం నిద్రించడం వల్ల మానవ శరీరంలో ఎముకలు కండరాలు కుచించుకుపోతాయి. అలాగే మానవ శరీరం ఎక్కువగా కొవ్వును నిలువ చేసుకోలేదు. ఆరోగ్యకరమైన మనిషి మెదడు అచేతనంగా రోజుల తరబడి ఉండటం అసాధ్యం. 


ఆ ప్రోటీన్ వల్లే.. దీర్ఘ నిద్ర


పోలార్ ఎలుగుబంట్ల శరీరం నిద్రాణస్థితి ఆరు నెలల పాటు ఉండేందుకు అనుగుణంగా ఉంటుంది. వాటి రక్తం కూడా గడ్డ కట్టకుండా ఉంటుంది. అయితే మానవులు ఎక్కువ కాలం నిద్రిస్తే రక్తం గడ్డకట్టుకుపోయే ప్రమాదం ఉంది. ఎలుగుబంట్లు ఎక్కువ కాలం రక్తం గడ్డకట్టకుండా, నిద్రాణస్థితిలో ఉండేందుకు HSP47 ప్రోటీన్ సహకరిస్తుంది. ఈ ప్రోటీన్ రక్త కణాలు ఒక దగ్గర కలిసి ఉండేందుకు దోహదపడతాయి. శరీరానికి గాయమైనప్పుడు మాత్రమే ఈ ప్రోటీన్ రక్తం ఎక్కువ కారకుండా గడ్డకట్టేలా చేస్తుంది. రక్తనాళాల్లో ప్రవహించేటప్పుడు రక్తం గడ్డ కడితే, ఆ ప్రదేశాన్ని కరిగేలా చేసి రక్త ప్రవాహం అడ్డుకోకుండా చూస్తుంది.


HSP47తో ప్రత్యేక ఔషదం


నిజానికి మానవ శరీరంలో ఈ ప్రోటీన్ లేకపోవడం వల్లనే రక్త నాళాల్లో రక్తం గడ్డ కట్టి స్ట్రోక్ వంటి ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. గుండెపోటు, పక్షవాతానికి రక్తనాళాల్లో పేరుకుపోయిన అడ్డంకులే కారణమని పరిశోధకులు చెబుతున్నారు. ధృవపు ఎలుగుబంట్లలో HSP47  ప్రోటీన్ ఉండటం వల్ల రక్తం నిరంతరం ప్రవహిస్తోంది. ఫలితంగా ఇవి ఎక్కువ కాలం నిద్రాణస్థితిలో జీవించగలుగుతున్నాయి. ఈ ప్రోటీన్‌ను ఉపయోగించి భవిష్యత్తులో కొన్ని ఔషదాలను సైతం తయారు చేయాలని పరిశోధకులు భావిస్తున్నారు. రక్త నాళాల్లో అడ్డంకులను తొలగించేందుకు ఇది ఉపయోగపడవచ్చనేది శాస్త్రవేత్తల అభిప్రాయం.


Also Read : ఈజీగా, టేస్టీగా రెడీ చేసుకోగలిగే పాలకూర వడలు.. రెసిపీ ఇదే











గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఈ ఆహారాలు, పానీయాలు మీకు అలర్జీ లేదా ఇతరాత్ర అనారోగ్యాలకు దారితీయొచ్చు. కాబట్టి, ఆహారం, ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.