ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారంతో పాటూ కంటి నిండా నిద్ర కూడా అవసరం. అలాగే చిన్నపాటి వ్యాయామాలు కూడా చేయాలి. అయితే ఆహారం విషయం కన్నా నిద్ర విషయంలోనే ఎక్కువమంది అనారోగ్యం బారిన పడుతున్నారు. సరైన నిద్రాసమయాలు పాటించకపోవడం, సరిపడినంత నిద్రపోకపోవడం వల్ల అనేక మానసిక, శారీరక సమస్యలు వచ్చే అవకాశం పెరుగుతోంది. వైద్యులు చెప్పిన ప్రకారం ఒక మనిషి ఏడుగంటల నుంచి ఎనిమిది గంటల పాటూ నిద్రపోవాలి. ఏడుగంటల కన్నా నిద్ర తగ్గితే మాత్రం మరుసటి రోజు వారి బ్రెయిన్ పనితీరుపై ప్రభావం పడుతుంది. 


కారణాలెన్నో..
కొందరికి ఇలా పడుకోగానే నిద్రపట్టేస్తుంది. కానీ కొందరికి మాత్రం సరిగా నిద్రపట్టదు. నిద్రలేమి, స్లీప్ అప్నియా వంటి సమస్యల వల్ల వారికి నిద్రపట్టదు. మీకు ఇలాంటి పరిస్థితులు ఉంటే మాత్రం వెంటనే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. ఫోన్లు చూస్తూ, స్నేహితులతో ఛిల్ అవుతూ అర్థరాత్రి వరకు మెలకువగా ఉండి తరువాత తక్కువ సమయం నిద్రపోయే వారు ఎంతో మంది. ఇలాంటి వారు ఆ అలవాటను మానుకోవాలి. నిద్ర ఏడుగంటల కన్నా తగ్గితే వచ్చే సమస్యలు ఎన్నో. 
 
డిప్రెషన్: రాత్రి నిండుగా నిద్రపోయే వారు డిప్రెషన్ బారిన పడే అవకాశం తక్కువ. ఎవరికైతే నిద్ర ఏడుగంటల కన్నా తగ్గుతుందో వారిలో నిరాశ లక్షణాలు అధికంగా ఉంటాయి. మీరు నిద్రపోనప్పుడు, భావోద్వేగాలను నియంత్రించే సామర్థ్యంపై  ప్రభావం పడుతుంది. అది డిప్రెషన్ వచ్చే  ప్రమాదాన్ని పెంచుతుంది.


శ్వాసకోశ సమస్యలు: సరిగ్గా నిద్రపోనప్పుడు, జలుబు, ఫ్లూ వంటి శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశం పెరుగుతుంది. శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారిలో మరింతగా ఆ సమస్యలు పెరుగుతాయి. సరిగా నిద్రపోనివారికి ఈ జబ్బులు తగ్గే అవకాశం కూడా చాలా తక్కువ. 


గుండె జబ్బులు: ఏడుగంటల కన్నా తక్కువ నిద్రపోయేవారిలో గుండె సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం పెరుగుతుంది. నిద్రపోయినప్పుడు మీ శరీరం స్వయంగా రిపేర్ చేసుకుంటుంది. అదే సరిగా నిద్రపోకపోతే సమస్యలు పేరుకుపోతాయి. రక్తనాళాల్లో సమస్యలు వచ్చి గుండె జబ్బులకు దారి తీస్తుంది. 


ఎండోక్రైన్ వ్యవస్థ: తగినంత నిద్రలేనప్పుడు అది మీ హార్మోన్లను ప్రభావితం చేస్తాయి. మీ శరీరంపై ఇది చాలా ప్రభావం చూపిస్తుంది. ఎండోక్రైన్ వ్యవస్థ హార్మోన్లను విడుదల చేయనప్పుడు, కణాల మరమ్మత్తు, పిట్యూటరీ గ్రంధి పనితీరు వంటివి చాలా ప్రభావితం అవుతాయి. 


Also read: అధికంగా ఉడికించడం వల్ల కూరగాయల్లోని పోషకాలు తగ్గిపోతాయా? ఇందులో నిజమెంత?


Also read: క్రిస్పీ క్రిస్పీగా రొయ్యల పకోడీ, సింపుల్ రెసిపీ ఇదిగో







































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.