ప్రజల జీవనశైలి మారిపోయింది. అర్ధరాత్రి వరకు మేల్కోవడం అనేది అలవాటుగా మారింది. ఆధునిక జీవితంలో లేట్ నైట్ స్లీపింగ్ అనేది భాగం అయిపోయింది. ఎంతోమంది రాత్రి 12 వరకు లేచి ఉంటున్నారు. 12 దాటాకే నిద్రపోవడానికి ఇష్టపడుతున్నారు. అలాగే ఉదయం 9 వరకు మేల్కొని వారు ఎంతోమంది. నిజానికి రాత్రి 9 గంటలకే నిద్రపోయి ఉదయం 6 గంటల్లోపు నిద్రలేచేవారు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. ఈ విషయం తెలిసినా కూడా ఎంతోమంది రాత్రి 12 గంటల తర్వాతే నిద్రపోయి, ఉదయం 9 గంటల తరవాతే లేవడానికి ఇష్టపడుతున్నారు. ఇలా లేట్ నైట్ నిద్రపోయే అలవాటు ఉన్నవారు ఎన్నో రోగాలను ఆహ్వానిస్తున్నట్టే లెక్క. ఇక ఉదయం రెండు గంటల వరకు నిద్రపోని వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. వారికి త్వరగా డయాబెటిస్ అధిక రక్తపోటు వంటివన్నీ దాడి చేసే అవకాశం ఉంది.
లేట్ నైట్ నిద్రపోయే అలవాటు ఉన్న వారిలో టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం 19 శాతం అధికంగా ఉన్నట్టు కొత్త అధ్యయనం చెబుతుంది. అలాగే ఎవరైతే రాత్రి ఆలస్యంగా పడుకుంటారో వారు ఉదయం ఆలస్యంగా నిద్రలేస్తారు. దీనివల్ల బ్రేక్ ఫాస్ట్ తీసుకునే సమయం కూడా దాటిపోతుంది. బ్రేక్ ఫాస్ట్ ఆలస్యంగా తీసుకోవడం వల్ల లంచ్ కూడా ఆలస్యంగా తింటారు. ఇలా అన్ని అలవాట్లలో మార్పులు వస్తాయి. ఇది శరీర జీవక్రియలకు ఆటంకం కలిగిస్తుంది. అలాగే రక్తంలోని చక్కెర స్థాయిలపై ప్రభావం చూపిస్తుంది. దీనివల్ల డయాబెటిస్ వచ్చే అవకాశం పెరిగిపోతుంది. అలాగే లేట్ నైట్ నిద్రపోయేవారు నాణ్యమైన నిద్రను పొందరు. వారి నిద్ర చాలా మగతగా ఉంటుంది. దీని వల్ల శరీరం మొత్తం నీరసపడిపోతుంది. రోగనిరోధక శక్తి కూడా కుంటుపడుతుంది.
ఉదయం త్వరగా నిద్రలేచే వారితో పోలిస్తే, రాత్రుళ్లు ఎక్కువసేపు మేల్కొని ఉండేవారు, ఆలస్యంగా నిద్రలేచే వారికి త్వరగా అనారోగ్యాలు వస్తాయని పరిశోధన కర్తలు చెబుతున్నారు. చాలామంది నిద్రను త్యాగం చేసి మరీ వెబ్ సిరీస్‌లు, సినిమాలు చూస్తూ ఉంటారు. మనిషికి నిద్ర చాలా అవసరం అని తెలుసుకోవాలి. ఆహారం లేకుండా జీవించడం ఎంత కష్టమో నిద్ర లేకుండా జీవించడం అంతకన్నా కష్టం. ప్రతి మనిషికి నిద్ర అత్యవసరం. రోజు ఎనిమిది గంటల పాటు రాత్రి నిద్ర ఉండాలి. అది కూడా రాత్రి పదిలోపే నిద్రపోవడానికి ప్రయత్నించాలి. ఉదయం 6 గంటలకు లేవాలి. ఇలా చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధులు దాడి చేయకుండా ఉంటాయి. మెదడుకు విశ్రాంతిని ఇచ్చేది నిద్ర మాత్రమే మీ మెదడు చక్కగా పనిచేస్తేనే మీ శరీరం మొత్తం చక్కగా పనిచేస్తుంది. మీరు ఏ పనైనా సరిగ్గా చేయగలుగుతారు. మతిమరుపు, డిప్రెషన్, చిరాకు వంటివి రాకుండా ఉండాలంటే చక్కగా నిద్రపోవాలి. అలాగే అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం, గుండె జబ్బులు వంటివి కూడా తగినంత నిద్ర లేకపోవడం వల్ల వచ్చే అవకాశం చాలా ఎక్కువ.
Also read: కరివేపాకే కదా అని తీసిపారేయకండి, బరువుని ఇట్టే తగ్గించేస్తుంది
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.