Lifestyle Changes for Weight Loss : బరువు తగ్గడం అంటే కఠినమైన డైట్లు పాటించడం లేదా గంటల తరబడి జిమ్‌లో చెమటోడ్చడం మాత్రమే కాదు. నిజానికి ఇది మన రోజువారీ జీవనశైలిలో చేసే చిన్న కానీ ముఖ్యమైన మార్పులతో ప్రారంభమవుతుంది. బరువు తగ్గాలనుకునేవారు ముందుగా తమ అలవాట్లు మార్చితే.. బరువు తగ్గే ప్రక్రియ సులభం అవుతుంది. మరి దీనిని బరువు తగ్గేందుకు లైఫ్స్టైల్లో ఎలాంటి మార్పులు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉదయాన్నే నీళ్లు తాగండి..
ఉదయం లేవగానే ఒకటి లేదా రెండు గ్లాసుల గోరువెచ్చని నీళ్లు తాగితే జీర్ణక్రియ ప్రారంభమవుతుంది. మెటాబాలిజం పెరుగుతుంది. నిమ్మరసం, జీలకర్ర లేదా మెంతుల నీళ్లు కలిపి తాగితే ఇంకా మంచిది. రోజంతా నీరు తాగడం వల్ల ఫుడ్ క్రేవింగ్స్ కంట్రోల్ అవుతాయి.
బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రోటీన్
ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారం తింటే ఎక్కువసేపు ఆకలి వేయదు. గుడ్లు, పనీర్, మొలకలు, పప్పులతో చేసిన ఫుడ్స్, గ్రీక్ యోగర్ట్ వంటివి తీసుకోవచ్చు. ఇవి బ్లడ్ షుగర్‌ను కంట్రోల్‌లో ఉంచి ఫ్యాట్ బర్నింగ్‌కు సహాయపడతాయి.
నెమ్మదిగా తినండి
భోజనం చేసేప్పుడు తొందరపడకండి. టీవీ లేదా మొబైల్ చూడకుండా తినడం అలవాటు చేసుకోండి. నెమ్మదిగా నమిలి తింటే త్వరగా తృప్తి కలుగుతుంది. ఎక్కువ తినడం తగ్గిస్తారు.
80-20 ప్లేట్ రూల్..
మీ ప్లేట్లో 50 శాతం కూరగాయలు, 25 శాతం ప్రోటీన్, 25 శాతం కార్బ్స్ ఉండేలా చూసుకోవాలి. ఇలా తింటే శరీరానికి సరైన పోషకాలు లభిస్తాయి. కేలరీలు కూడా కంట్రోల్‌లో ఉంటాయి.
స్వీట్స్ తగ్గించండి..
సోడాలు, ప్యాకేజ్డ్ జ్యూసులతో పాటు.. షుగర్ ఎక్కువగా ఉండే ఫుడ్స్‌కి దూరంగా ఉండండి. అలాగే టీ, కాఫీలు బరువును పెంచుతాయి కాబట్టి తగ్గించుకోవాలి. వీటి బదులు హెర్బల్ టీ, బ్లాక్ కాఫీ, కొబ్బరి నీరు తాగడం మంచిది. బెల్లం, ఖర్జూరం కూడా పరిమితంగా తీసుకోవాలి.
ప్రతి రోజూ నడక
ఎక్కువసేపు కూర్చుంటే మెటాబాలిజం తగ్గుతుంది. కాబట్టి మధ్యలో లేచి నడవడం, స్ట్రెచింగ్ చేయడం అలవాటు చేసుకోండి. రోజుకు కనీసం 7,000 నుంచి 10,000 అడుగులు నడవడం లక్ష్యంగా పెట్టుకోండి.
స్ట్రెంగ్త్ ట్రైనింగ్
బరువులతో లేదా బాడీవెయిట్ ఎక్సర్‌సైజ్‌లు చేయడం వల్ల కండరాలు పెరుగుతాయి. ఇవి విశ్రాంతిలో ఉన్నప్పటికీ కేలరీలు బర్న్ చేయడంలో సహాయపడతాయి. వారానికి 3లేదా4 సార్లు 20 నిమిషాలు చేస్తే సరిపోతుంది.
7–8 గంటల నిద్ర
నిద్ర సరిపోకపోతే హార్మోన్లు డిస్టర్బ్ అవుతాయి. దీంతో ఆకలి పెరిగి.. ఫ్యాట్ నిల్వ అవుతుంది. కాబట్టి ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం మంచిది.
స్ట్రెస్ కంట్రోల్..
ఒత్తిడి ఎక్కువైతే ఎక్కువగా తినే అలవాటు వస్తుంది. యోగా, ధ్యానం, శ్వాస వ్యాయామాలు, లేదా సాయంత్రం నడక చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది.
హెల్తీ స్నాక్స్
జంక్ ఫుడ్ బదులు ఆరోగ్యకరమైన స్నాక్స్ తీసుకోండి. వేయించిన శనగలు, డ్రై ఫ్రూట్స్, గింజలు, పండ్లు, పీనట్ బట్టర్, మఖానా వంటివి తీసుకోవచ్చు. ఇవి బ్లడ్ షుగర్‌ను స్థిరంగా ఉంచి ఎక్కువగా తినకుండా సహాయపడతాయి.
బరువు తగ్గడం అనేది ఒక్కరోజులో జరిగేది కాదు. కానీ రోజువారీ చిన్న మార్పులు పెద్ద ఫలితాలు ఇస్తాయి. క్రమంగా అలవాట్లు మార్చుకుంటే శరీరం కూడా మారుతుంది. త్వరగా ఫలితాలు ఆశించకుండా, స్థిరంగా ముందుకు వెళ్తే ఆరోగ్యకరమైన బరువు ఈజీగా తగ్గవచ్చు.
గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.
