మనం వేసుకునే దుస్తులు బిర్రుగా అయ్యే దాకా అర్థం కాదు శరీరంలో కొవ్వు పేరుకుపోయిందని. అది మనల్ని అందంగా కనిపించకుండా చేయడమే కాదు అనారోగ్య సమస్యల్ని తీసుకొస్తుంది. శరీరానికి ఆరోగ్యకరమైన కణాలను నిర్మించడానికి కొలెస్ట్రాల్ అవసరం. కానీ అది పరిమితి దాటితే మాత్రం ఇబ్బందులు తప్పవు. లిపోప్రోటీన్ కొలెస్ట్రాల్.. అదేనండీ చెడు కొలెస్ట్రాల్ అధిక స్థాయిలో ఉంటే గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. కొవ్వు నిల్వలు ధమనుల్లో పేరుకుపోతాయి. ఇది ధమనులను బ్లాక్ చేస్తుంది. ఫలితంగా రక్త ప్రసరణ కష్టతరం చేస్తుంది. కొన్ని సార్లు రక్తం గడ్డకట్టి గుండె పోటు లేదా స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది అనేందుకు కొన్ని సంకేతాలు చూపిస్తుంది. వాటిని పసిగట్టగలిగతే సమస్య నుంచి త్వరగా బయటపడొచ్చు. 


చెడు కొలెస్ట్రాల్ వల్ల వచ్చే సమస్యలు


పెరిఫెరల్ ఆర్టరీ వ్యాధి అనేది ధమనులతో సంబంధం కలిగి ఉంటుంది. ఇది కాళ్ళు సహా శరీరంలోని దిగువ భాగానికి రక్తప్రసరణ తగ్గిస్తుంది. దాని వల్ల కాళ్ళు, చేతులకు రక్తం అందదు. నడిచేటప్పుడు  కాళ్ళు నొప్పులు వస్తాయి. దీన్నే క్లాడికేషన్ అని కూడా పిలుస్తారు. సమయానికి చికిత్స చేయకపోతే క్రిటికల్ లింబ్ ఇస్కీమియా, అక్యూట్ లింబ్ ఇస్కీమియా వంటి తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది.


చేతులు, కాళ్ళలో తిమ్మిరి


పెరిఫెరల్ ఆర్టరీ వ్యాధి వల్ల కాళ్ళకు రక్త ప్రవాహం పరిమితం అవుతుంది. అటువంటి సమయంలో కాళ్ళు, పాదాల రంగులో మార్పులు చోటుచేసుకుంటాయి. చికిత్స చేయకుండా వదిలేస్తే కాళ్ళు లేత నీలం రంగులోకి మారిపోతాయి. మయో క్లినిక్ ప్రకారం కాళ్ళు లేదా పాదాలు చల్లబడటం, తిమ్మిరిగా అనిపిస్తే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోయిందని సంకేతం.


చర్మ సమస్యలు


రక్తప్రవాహంలో ఎక్కువ కొలెస్ట్రాల్ ఉంటే చర్మంలో కొవ్వు నిల్వలను కూడా పెంచుతుంది. దాని వల్ల చర్మం మీద నారింజ లేదా పసుపు రంగులో గడ్డలు  లేదా దద్దుర్లు వంటి గాయాలు కనిపిస్తాయి. అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ అసోసియేషన్ ప్రకారం అరచేతులు, కాళ్ళ వెనుక భాగంలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి.


గోళ్లను ప్రభావితం చేస్తుంది


ధమనుల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల గోళ్లతో సహా శరీరంలోని వివిధ భాగాలకు రక్తప్రవాహాన్ని పరిమితం చేస్తుంది. ఫలితంగా గోర్లు ముదురు రంగులో కనిపిస్తాయి. వీటిని స్ప్లింటర్ హెమరేజ్‌ అంటారు. గోళ్ళ కింద సన్నగా ఎరుపు లేదా గోధుమ రంగులో గీతలు కనిపిస్తాయి.


కళ్ళ చుట్టూ పసుపు గడ్డలు


క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ ప్రకారం కొలెస్ట్రాల్ చర్మం కింద పేరుకుపోయి శాంథెలాస్మాను ఏర్పరుస్తాయి. దీని వల్ల కళ్ళ చుట్టూ కూడా పసుపు రంగులో చిన్న చిన్న గడ్డలు కనిపిస్తాయి. అధిక కొలెస్ట్రాల్ వల్ల మాత్రమే కాదు మధుమేహం, థైరాయిడ్ సమస్యల వల్ల కూడా శాంథెలాస్మా ఏర్పడతాయి.


శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. వారి సూచనల మేరకు శరీరంలోని అధిక కొలెస్ట్రాల్ తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి. లేదంటే తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: మెదడుకు హాని చేసే ఆహారాలు ఇవే - వీటికి దూరంగా ఉండండి