మెదడు శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో ఒకటి. నిద్ర, తిండి దగ్గర నుంచి ఎప్పుడు ఏం చేయాలనేది నిర్ణయించేది మెదడు. అన్ని వ్యవస్థలు బాగా పని చేయడంలో సహాయపడటమే కాకుండా గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు వంటి ఇతర అవయవాలు తమ విధులను చక్కగా నిర్వహించడంలో సహాయపడుతుంది. అందుకే మెదడు ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. అందుకోసం పోషకాహారం తీసుకోవాలి. మనం తీసుకునే ఆరోగ్యకరమైన ఆహారాలు మెదడు ఆరోగ్యంపై అద్భుతమైన ప్రభావాన్ని చూపిస్తాయి. తాజా పండ్లు, కూరగాయలు, కొవ్వులు, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు మెదడు కణజాలాన్ని నిర్మించడంలో, వాపును తగ్గించడంలో సహాయపడతాయి.


పోషకాహారం తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. మెదడు చురుకుగా ఉంచే ఆహారం తీసుకోకపోతే డీమెన్షియా, అల్జీమర్స్, పార్కిన్సన్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. 2030 నాటిఈ ప్రపంచవ్యాప్తంగా 65 మిలియన్ల మందిపై చిత్త వైకల్యం ప్రభావం చూపే ప్రమాదముందని ఒక నివేదికలు వెల్లడించాయి. ఈ ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే మీ మెదడుని మీరే ప్రమాదంలోకి నెట్టుకున్న వాళ్ళవుతారు. అలాగే తరచూ ఈ పదార్థాలు తీసుకుంటే మెదడుని ఆరోగ్యంగా ఉంచుతుంది.


మెదడుకి ఉత్తమమైన ఆహారాలు


బెర్రీలు


బెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి మెదడు శక్తిని పెంచుతాయి. స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, బ్లాక్ బెర్రీస్ వంటి బెర్రీ పండ్లు సలాడ్, లేదా అల్పాహారం కోసం స్మూతీస్ లో తీసుకోవచ్చు. ముదురు రంగు పండ్లలో ఫ్లేవనాయిడ్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మంటని తగ్గించడంలో సహాయపడతాయి. మెదడు పనితీరుని వేగవంతం చేస్తాయి.


గుడ్లు


ప్రోటీన్స్ కి గుడ్లు పవర్ హౌస్ లాంటివి. రుచికరంగా ఉండటంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. కొలిన్, లూటిన్ వంటి పోషకాలతో నిండిన గుడ్లు మెదడు పనితీరుకి మద్దతునిస్తాయి. ఏకాగ్రత పెంచుకునేందుకు రోజుకొక గుడ్డు తింటే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.


కొవ్వు చేపలు


సాల్మన్, ట్యూనా వంటి కొవ్వు చేపల్లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి మెదడు ఆలోచనా శక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అభిజ్ఞా క్షీణతని నెమ్మదించేలా చేస్తుంది. మెదడు వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. కొవ్వు ఆమ్లాలు పొందటం కోసం ఆహారంలో చేపలు చేర్చుకోవాలని సిఫార్సు చేస్తున్నారు.


నట్స్


ఆరోగ్య ప్రయోజనాలు అందించడంలో ముందుండేవి నట్స్. రోజువారీ ఆహారంలో నట్స్ చేర్చుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. వాల్ నట్స్ మెదడుకి సూపర్ ఫుడ్. ఇతర గింజలలో లేని వివిధ రకాల పాలీఫెనొలిక్ సమ్మేళనాలు ఇందులో లభిస్తాయి. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఇవి రెండు బలమైన యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలని కలిగి ఉంటాయి. వాల్ నట్స్ తినడం వల్ల మతిమరుపు, అభిజ్ఞా క్షీణత వంటి సమస్యల నుంచి బయటపడొచ్చు.


మెదడుకి హాని చేసే ఆహారాలు


చక్కెర


చక్కెర, సోడా, ఎనర్జీ డ్రింక్స్, పండ్ల రసాలు మెదడుకి మాత్రమే కాదు సాధారణ ఆరోగ్యానికి కూడా హాని చేస్తాయి. చక్కెర పానీయాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల మధుమేహం, గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. బరువు పేరుగుతారు. చక్కెర పానీయాలు అధికంగా తీసుకోవడం వల్ల అల్జీమర్స్, చిత్త వైకల్యం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.


ప్రాసెస్ చేసిన ఆహారాలు


చిప్స్, స్వీట్లు, ఇన్స్టంట్ నూడుల్స్, సాస్, రెడీ మేడ్ మీల్స్ వంటి ప్రాసెస్ చేసిన ఆహారాలు మొత్తం ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయి. వీటిలో కెలరీలు ఎక్కువగా ఉంటాయి. పోషకాలు తక్కువ. మెదడు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.


మద్యం


ఆల్కహాల్ వంటి చెడు అలవాట్లు మెదడు పనితీరుకి ఆటంకం కలిగిస్తాయి. దీర్ఘకాలికంగా మద్యపానం చేయడం వల్ల జీవక్రియలో మార్పులు సంభవిస్తాయి. మెదడుని దెబ్బతీస్తుంది.



Also Read: PCOS అంటే ఏమిటీ? హార్మోన్లు సమతుల్యత కోసం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి?


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.