ప్రాచీనకాలం నుంచి వాడుకలో ఉన్న నానుడి ‘ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు’అని. అది వందశాతం సరైనదే. కానీ మోతాదుకు మించి తింటే మాత్రం ఉల్లి కూడా కీడు చేస్తుంది అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఏదైనా హద్దులు దాటకుండా ఉండేంతవరకే ఆరోగ్యం. ఉల్లి అధికంగా శరీరంలో చేరితే ఆరోగ్య సమస్యలు తప్పవు. అందులోనూ వండిన ఉల్లిపాయతో పెద్దగా సమస్య ఉండదు కానీ... పచ్చిఉల్లిపాయ మాత్రం మోతాదుకు మించి తినవద్దని చెబుతున్నారు వైద్యులు. రోజుకు సాధారణ పరిమాణంలో ఉన్న ఉల్లిపాయను పచ్చిగా తినవచ్చు. అలా తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా. కానీ అలా పచ్చి ఉల్లిపాయలు రోజుకు మూడు నాలుగు తింటే మాత్రం సైడ్ ఎఫెక్టులు తప్పవు.
వచ్చే సమస్యలు ఇవే...
1. పచ్చి ఉల్లిపాయ తినేముందు తొక్క తీశాక, శుభ్రంగా నీటిలో కడగాలి. అలాగే తినేయడం వల్ల సాల్మొనెల్లా అనే ఇన్ ఫెక్షన్ శరీరంలో చేరుతుంది. దీనివల్ల టైఫాయిడ్ వంటి వ్యాధులు దాడి చేస్తాయి. శుభ్రంలేని ఉల్లిపాయలు రెండు మూడు తినడం వల్ల అధిక స్థాయిలో ఇన్ ఫెక్షన్ పొట్టలో చేరుతుంది.
2. ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్న వారు పచ్చి ఉల్లిపాయకు దూరంగా ఉండడం మంచిది. ఎందుకంటే పచ్చి ఉల్లిపాయను అధికంగా తింటే ఆరోగ్యవంతుల్లో కూడా గ్యాస్ అధికంగా ఉత్పత్తి అవ్వడం, గుండెల్లో మంటా అనిపించడం, తేనుపులు రావడం వంటి సమస్యలు కలుగుతాయి. ఇక ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్లు తింటే వారికి సమస్య మరింత పెరుగుతుంది.
3. పచ్చి ఉల్లిపాయలు రెండు కన్నా ఎక్కువ తింటే వికారంగా అనిపిస్తుంది. కడుపులో నొప్పిగా అనిపించడం, వాంతులు వచ్చీ రానట్టు ఫీలింగ్ కలుగుతుంది.
4. కొందరికి పచ్చి ఉల్లిపాయలు పడవు. తమకు పడతాయో లేవో తెలుసుకుని వాటిని తినడం మంచిది. తిన్నాక వికారంగా అనిపించినా, పొట్టనొప్పి వచ్చినా వారికి పచ్చి ఉల్లిపాయ పడదని అర్థం చేసుకోవాలి.
5. పచ్చి ఉల్లిపాయలు అధికంగా తినడం వల్ల కొన్ని రకాల అలెర్జీలు కూడా దాడి చేస్తాయి. అవి చర్మం, జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపిస్తాయి.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Also read: చలికాలంలో వేడి పుట్టించే నువ్వులు తినడం అవసరమే
Also read: ఈ అలవాట్లు ఉంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువ
Also read: జుట్టురాలిపోకుండా ఒత్తుగా పెరగాలా... చక్కటి పరిష్కారం విటమిన్ ఇ
Also read: బిగ్‌బాస్‌లో జెస్సీ వ్యాధి ఇదే, వర్టిగో లక్షణాలు... వామ్మో చుక్కలు చూపిస్తాయి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి