రోజురోజుకు పేరెంటింగ్ అనేది ఒక గొప్ప స్కిల్ గా మారుతోంది. పిల్లలు రోజురోజుకు మరింత స్మార్ట్ గా మరింత తెలివిగా పుడుతున్నారు. అందుకు తగినట్టుగానే ప్రపంచంలో వారికి ఎక్స్ పోజర్ కూడా బాగా పెరిగిపోయింది. అందువల్ల నారు పోసిన వాడు నీరు పోయక మానడు వంటి సామెతలు అవుట్ డేటెడ్ అయిపోయాయి.


ప్రస్తుతం ఉన్న పోటి ప్రపంచంలో పిల్లలు పుట్టి పుట్టగానే పోటిని ఎదుర్కొంటూ విజయవంతంగా జీవితాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంటోంది. అందుకు తగినట్టుగా పిల్లలను పెంచుకోవడం కూడా అవసరం అవుతోంది. వారి వ్యక్తిత్వ నిర్మాణంలో పెంపక ప్రభావం చాలా ముఖ్యమైనది. ఇంట్లో పెద్ద వారి ప్రవర్తన ద్వారానే పిల్లలు చాలా విషయాలు నేర్చుకుంటారు. అనుబంధాలు, భావోద్వేగాలు ఎలా అదుపులో ఉంచుకోవాలి? ఆత్మ విశ్వాసంతో జీవితం నడపడం ఎలా? వంటి ఎన్నోవిషయాలు వారికి తెలియకుండానే పెద్దల సమక్షంలోనే నేర్చుకుంటూ ఉంటారు. ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే తమని చూసి పిల్లలు నేర్చుకుంటున్నారన్న స్పృహ తల్లిదండ్రులకు కూడా ఉండదు. పిల్లల ముందు తల్లిదండ్రుల ప్రవర్తన ఎలా ఉండాలో చైల్డ్ సైకాలజిస్ట్ లు తెలియజేసిన కొన్ని చిన్నచిన్న విషయాల గురించి తెలుసుకుందాం.


హద్దుల్లో ఉండాలి


అన్ని పనులు అందరూ చెయ్యలేరు. ప్రతి మనిషికి కొన్ని పరిమితులు ఉంటాయి. తల్లి దండ్రులు అన్ని పనులు చక్కబెట్టేస్తారనే బ్రమలో ఉంటారు పిల్లలు ఒక వయసు వచ్చేవరకు. నెమ్మదిగా వయసు పెరిగే కొద్ది కొన్ని పనులు చెయ్యడం తమకు కూడా సాధ్యం కాదని తల్లిదండ్రులు చెప్పాలి. ఎందుకు చెయ్యలేకపోతున్నామో వివరించాలి. ఇలా చెయ్యడం ఎదుటి మనిషి నుంచి ఎంత ఆశించవచ్చనేది పిల్లలు నిర్ణయించుకోగలుగుతారు. అంతేకాదు ఎవరికైనా సాధ్యం కాని పనులు ఉంటాయన్న స్పృహ కూడా వారికి కలుగుతుంది.


మన్నించమని కోరాలి


పొరపాటున పిల్లల విషయంలో తప్పు చేస్తే లేదా మీ పని వల్ల వాళ్లు బాధపడితే తప్పకుండా క్షమించమని అడగాలి. మనం సారీ చెప్పడం వల్ల సారీ చెప్పడం వల్ల కలిగే నష్టమేమి లేదని తెలియజేసినట్టు అవుతుంది. వాళ్లకు కూడా సారీ చెప్పడం అలవాటవుతుంది.


ఆవేశం వద్దు


ఏమాటైనా పిల్లలు మీతో పంచుకునే స్వతంత్రం ఉండాలి. వాళ్లు సాధించిన విజయాలు మాత్రమే కాదు, కొల్పోయి ఓటమి పాలవడం కూడా జీవితంలో సర్వసాధారణమని మన ప్రవర్తన ద్వారా వారికి అర్థం కావాలి. అందువల్ల బ్యాలెన్స్ డ్ పర్సనాలిటీగా పిల్లలు ఎదుగుతారు.


రెస్పాండింగ్


తెలిసో, తెలియకో, అల్లరి వలనో పిల్లలు చాలా విసిగిస్తుంటారు. ఒక్కోసారి కోపం కట్టలు తెంచుకోవచ్చు కూడా. కానీ అంత త్వరగా సహనం కోల్పోకూడదు. ఇప్పుడు మీరు చూపించే ఈ సహనం మీ పిల్లలను రేపు ప్రశాంత చిత్తం కలవారిగా తీర్చిదిద్దుతుంది. అతిగా స్పందించ కుండా నిండు కుండలా ఎదుగుతారు.


సపోర్ట్


వారి ప్రతి కదలిక వెనుక మీరున్నారన్న నమ్మకం వారికి కలిగిస్తే ఆత్మ విశ్వాసంతో అడుగు ముందుకేస్తారు. ఆపదలో అదుకునే ఆపన్నహస్తం తమకుందని నిశ్చింతగా ఉంటారు. అది మాటల్లో కాకుండా చేతల్లో చూపడం అవసరం.


ఇవి చిన్నచిన్న జాగ్రత్తలే కానీ పిల్లల మూర్తిమత్వాన్ని తీర్చిదిద్దే పెద్ద విషయాలు. పిల్లలే కదా అని చాలా మంది తేలికగా తీసుకుంటారు. కానీ వాళ్లు మీ ప్రతిబింబాలు. మీరెలా ప్రవర్తిస్తే మీ బింబాలుగా వారు అలాగే ప్రవర్తిస్తారు. కనుక తప్పనిసరిగా పిల్లల ముందు చాలా కాన్షియస్ గా ప్రవర్తించడం అవసరం.


Also Read: వెల్లుల్లికి బదులు ఈ పదార్థాలు వాడినా చాలు వంట రుచి అదిరిపోతుంది