Hidden Danger of Scrub Typhus : చలికాలంలో జ్వరాలు రావడం సహజమే. అయితే ఈ మధ్యకాలంలో వస్తోన్న జ్వరం కాస్త డేంజర్​గా మారింది. నార్మల్ ఫీవర్ అని నిర్లక్ష్యం చేస్తే.. ప్రాణాలపైనే ప్రభావం చూపిస్తుంది. దానినే స్క్రబ్ టైఫస్ (Scrub Typhus) అంటున్నారు వైద్యులు. ఈ మధ్యకాలంలో ఈ తరహా కేసులు పెరుగడంతో ప్రజల్లో ఆందోళన పెరిగింది.  గతంలో అన్యప్రాంతాలకే పరిమితమైన ఈ వ్యాధి.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బాగా వ్యాప్తి చెందుతోంది. ముఖ్యంగా ఏపీలో స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతున్నాయి. అసలు ఇది ఎందుకు వస్తుంది? లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూసేద్దాం.

Continues below advertisement

Scrub Typhus అంటే ఏంటి?

స్క్రబ్ టైఫస్ అనేది Orientia tsutsugamushi అనే బ్యాక్టీరియా వల్ల కలిగే రాకెట్టియల్ ఇన్ఫెక్షన్. అయితే ఈ బ్యాక్టీరియా మనిషికి నేరుగా సోకదు. చిగ్గర్ (chigger mites లేదా లార్వల్ మైట్) అనే సూక్ష్మ పురుగు కుట్టడం వల్ల వస్తుంది. వీటి పరిమాణం చాలా చిన్నగా ఉంటుంది. కళ్లకు కూడా కనిపించవు. అందుకే వీటి వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. 

పొలాలు, గడ్డి పొదలు, అడవులు, తడి నేల, పశువుల మేత ప్రాంతాల్లో ఈ చిగ్గర్లు ఎక్కువగా ఉంటాయి. చాలామంది ఈ ప్రదేశాలకు వివిధ అవసరాల కోసం వెళ్తుంటారు. చిగ్గర్లు ఉన్న ప్రదేశాల్లో నడిచినా.. కూర్చొన్నా.. పని చేసినా.. అవి చర్మంపై అంటుకుని కాటు వేస్తాయి. దీనివల్ల బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించి స్క్రబ్ టైఫస్​కి కారణమవుతుంది. 

Continues below advertisement

ఆంధ్రప్రదేశ్‌లో పెరగడానికి కారణాలివే.. 

ఇటీవలి కాలంలో ఏపీలో ఈ కేసులు పెరుగుతున్నాయి. పంట కోత–పొలం పనుల సమయంలో చిగ్గర్లు సోకే ప్రమాదం ఉంది. అలాగే తడి నేల కూడా వీటి వ్యాప్తిని ప్రోత్సాహిస్తుంది. జ్వరం వస్తే వైరల్ ఫీవర్‌గా భావించి మందులు వేసుకుని వైద్య సహాయం తీసుకోకపోవడం వల్ల కూడా కేసులు పెరుగుతున్నాయి. 

స్క్రబ్ టైఫస్​ లక్షణాలు..

స్క్రబ్ టైఫస్‌లో లక్షణాలు సాధారణ జ్వరం లాగా ఉంటాయి. అందుకే చాలా మంది గుర్తించలేరు. మొదటివారంలో అధిక జ్వరం, చలి, తీవ్రమైన తలనొప్పి, బాడీ పెయిన్స్, అలసట, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు ఉంటాయి. చిగ్గర్లు కాటు వేసిన చోట నల్లటి మచ్చ ఏర్పడుతుంది. ఇది స్క్రబ్ టైఫస్​కు క్లాసిక్​ సైన్​గా చెప్తారు. 

స్క్రబ్ టైఫస్ చికిత్స..

సాధరణ జ్వరమేనని చికిత్స తీసుకోకపోతే.. ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్​కు గురి అవుతాయి. మైకం రావడం, లో బీపీ, అవయవాల పనితీరు దెబ్బతినడం, అత్యవసర ఆరోగ్య ప్రమాదం ఏర్పడటం జరుగుతుంది. అందుకే దీనికి ముందుగానే చికిత్స తీసుకోవాలి. వైద్యులు IgM ELISA, PCR వంటి టెస్ట్​లు చేసి నిర్థారిస్తారు. ఒకవేళ సమస్య ఉందని తెలిపిస్తే.. యాంటీబయాటిక్స్‌తోనే ఇస్తారు. సరైన సమయంలో చికిత్స తీసుకుంటే 24–48 గంటల్లో జ్వరం తగ్గుతుంది. విస్మరిస్తే ప్రాణాంతకం అవుతుంది. 

స్క్రబ్ టైఫస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఈ వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కల్పించాలి. జ్వరం వచ్చిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా వైద్య సహాయం తీసుకోవాలి.  పొలాల్లో పనిచేసేప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. సాక్స్​లు వేసుకోవడం, ఫుల్ హ్యాండ్స్ ఉన్న దుస్తులు వేసుకోవడం చేస్తే మంచిది. ఇన్సెక్ట్ రిపెలెంట్ వాడితే మంచిది. ఇంటి దగ్గర్లో గడ్డి పొదలు లేకుండా చూసుకోవాలి. ప్రభుత్వం–స్వచ్ఛంద సంస్థలు గ్రామాల్లో ఫీవర్ క్యాంపులు నిర్వహించాలి.Scrub Typhus అనేది నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం. కానీ సులభంగా చికిత్స చేయగల వ్యాధి. కాబట్టి దీనిపై అవగాహన కల్పించడం చాలా ముఖ్యం. లేదంటే అది చివరికి ప్రాణాంతకమవుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.