ఒకప్పుడు పిల్లలని చంకన వేసుకుని చందమామ కథలు చెప్తూ, ఆటలు ఆడిస్తూ తల్లి అన్నం తినిపించేది. కానీ ఇప్పుడు ఏ ఇంట్లో చూసిన పిల్లలు తినాలంటే వారి చేతిలో ఖచ్చితంగా ఫోన్ ఉండాల్సిందే. ఏదో ఒక బొమ్మలు లేదా కార్టూన్ పెట్టి అన్నం తినిపించడం చేస్తారు. అలా చేస్తే వాళ్ళు కదలకుండా కూర్చుని తింటారని తల్లిదండ్రుల నమ్మకం. టీవీ, ఫోన్ కి అలవాటు పడిపోయిన పిల్లలు అవి లేకపోతే తిండి తినడం కూడా మానేస్తున్నారు. కానీ ఇది వారి ఎదుగుదల మీద తీవ్ర ప్రభావం చూపిస్తుందని అనేక అధ్యయనాలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. తాజాగా మరొక అధ్యయనం షాకింగ్ విషయం వెల్లడించింది. రెండు గంటల కన్నా ఎక్కువ సేపు స్క్రీన్ టైమ్ గడిపే పిల్లలు మాట్లాడటంలో, నడవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారని వెల్లడించింది.


అధ్యయనం ఏం చెబుతోంది?


జపనీస్ పరిశోధకులు దాదాపు 57,980 మంది పిల్లలని పరిశీలించారు. స్క్రీన్ టైమ్ వారి సామాజిన్ నైపుణ్యాలని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకునేందుకు ప్రయత్నించారు. ఒక వయసులో స్క్రీన్ చూడటం ఎక్కువగా ఉంటే అది పిల్లల అభివృద్ధిని దెబ్బతీస్తుంది. మితిమీరిన స్క్రీన్ వాడకం వారి మీద ప్రతికూల ప్రభావాలు చూపిస్తుంది. రెండు, మూడు సంవత్సరాల వయసులో వాళ్ళు మాట్లాడటానికి, నడవడానికి తీవ్రంగా ఇబ్బంది పదే అవకాశం ఉందని పరిశోధకులు కనుగొన్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ కేర్ ఎక్సలెన్స్ ప్రకారం పిల్లలు టీవీ, ఫోన్స్ అలవాటు చేయకుండా ఉండటమే మంచిదని అంటున్నారు. స్క్రీన్ ముందు గడిపే సమయం రెండు గంటల పరిమితి ఉండాలని సూచిస్తోంది. విద్యాపరమైన అవసరాల కోసం ఫోన్ ఇచ్చినప్పటికీ అది పరిమితంగానే ఉండాలని సూచిస్తున్నారు.


రోజుకి నాలుగు లేదా అంతకంటే ఎక్కువ సమయం స్క్రీన్ కి కేటాయించడం వల్ల వారి మెదడు అభివృద్ధి ఆలస్యంగా ఉంటుందని మునుపటి అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. జేఎఏంఏ పిడియాట్రిక్స్ లో ప్రచురించిన తాజా పరిశోధన ఒక వయసులో స్క్రీన్ సమయం ఎక్కువగా ఉంటే అది తర్వాత సంవత్సరాల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుందో వివరించింది. నాలుగు లేదా అంతకంటే ఎక్కువ గంతలు టీవీ చూస్తున్న పిల్లల తల్లిదండ్రులని కొన్ని ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. పిల్లలు నడక, పరుగు ఎలా ఉంటుంది, వాళ్ళు తినడం, వ్రాయడం వంటివి చేస్తున్నారా? లేదా అనేది అడిగి తెలుసుకున్నారు. అలాగే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవుతున్నారు? ఎలా పరిష్కరించుకుంటున్నారో అని ప్రశ్నలు వేశారు.


స్క్రీన్ ముందు ఎక్కువ సమయం గడిపే పిల్లలో కమ్యూనికేషన్ నైపుణ్యాలు 3 సంవత్సరాల వయసులో చాలా తక్కువగా ఉంటున్నాయని తల్లిదండ్రులు వెల్లడించారు. యాక్టివిటీస్ లో వాళ్ళు తక్కువగా పాల్గొనడం వల్ల వారి మెదడు ఆలోచనా శక్తి అభివృద్ది చెందడం లేదు. స్క్రీన్ ముందు ఎక్కువ సేపు కదలకుండా కూర్చుని ఉండటం వల్ల ఇతర విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి సన్నగిల్లుతుంది. అందుకే వారికి అవుట్ డోర్ గేమ్స్ అలవాటు చేయాలి. ఇతరులతో కలిసి ఆడుకోవడం నేర్పించాలి. బయట వాతావరణాన్ని అలవాటు చేయాలి. పజిల్స్ వంటి మెదడుకి పదును పెట్టె ఆటలు ఆడించాలని నిపుణులు సూచిస్తున్నారు.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 


Also Read: కూరగాయల తొక్కలు పడేస్తున్నారా? వాటితో చేసే ఈ రుచికరమైన వంటలు మిస్ చేసుకున్నట్టే!