Revanth Reddy: మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై ఇప్పటికే తెలంగాణలోని అన్ని పార్టీల నేతలతో పాటు జాతీయ నేతలు కూడా స్పందించారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా చెప్పుకునే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీలు వి.హనుమంతరావు, రేణుకా చౌదరి, మధుయాష్కీ గౌడ్‌తో పాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా బాబు అరెస్ట్‌ను ఖండించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అక్రమంగా అరెస్ట్ చేశారంటూ వ్యాఖ్యానించారు. కానీ గతంలో టీడీపీలో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పనిచేసి బాబుకు నమ్మకస్తుడిగా గుర్తింపు పొందిన రేవంత్ నోరు మెదకపోవడం తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.
ఈ క్రమంలో ఎట్టకేలకు చంద్రబాబు అరెస్ట్‌పై తొలిసారి రేవంత్ రెడ్డి స్పందించారు. గాంధీభవన్‌లో ఇవాళ ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఒక రిపోర్టర్ చంద్రబాబు అరెస్ట్ గురించి రేవంత్ రెడ్డి దగ్గర ప్రస్తావించాడు. బాబు అరెస్ట్‌ను ఎలా చూస్తారని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. రేవంత్ స్పందించేందుకు ఆసక్తి చూపలేదు. ఎట్ల చూస్తలేమని, ఎట్ల జరుగుతుందో అట్లనే చూస్తున్నామంటూ తెలిపారు. అరెస్ట్ చేసినట్లే చూస్తున్నామని సమాధానమిచ్చారు. బాబు అరెస్ట్ గురించి స్పందించేందుకు రేవంత్ ఆసక్తి చూపలేదు. దీంతో ఈ విషయం హాట్‌టాపిక్‌గా మారింది.
బాబు అరెస్ట్‌పై టీడీపీ నుంచి ఇతర పార్టీల్లోకి వెళ్లిన నేతలతో పాటు మిగతావారు కూడా స్పందించారు. మంత్రులు మల్లారెడ్డి, పువ్వాడ అజయ్, హరీష్ రావుతో పాటు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, సుధీర్ రెడ్డి, అరికెపూడి గాంధీ స్పందించారు. ఇక కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ బండి సంజయ్, కె.లక్ష్మణ్ కూడా బాబు అరెస్ట్ అక్రమమని ఆరోపించారు. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల్లో స్వయంగా పాల్గొనగా.. తాను కూడా నిరసనల్లో పాల్గొంటానని మంత్రి మల్లారెడ్డి తెలిపారు.
మధుయాష్కీ గౌడ్ సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించిన కాంగ్రెస్ సీనియర్ నేత మధుమాష్కీ గౌడ్.. జగన్, మోదీ, కేసీఆర్‌లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ వెనుక మోదీ, జగన్, కేసీఆర్ కుట్ర ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఎన్డీయే కూటమికి మద్దతు తెలపకుండా ఇండియా కూటమి వైపు వస్తారనే భయంతో ఆయనపై మోదీ కక్ష పెంచుకున్నారని విమర్శించారు. గుజరాత్ అల్లర్ల సమయంలో మోదీపై చంద్రబాబు విమర్శలు చేశారని, ఆ విషయాలన్నీ మోదీ గుర్తు పెట్టుకున్నారని అన్నారు. ఆ కోపంతో జగన్, కేసీఆర్‌లతో కలిసి మోదీ కుట్ర చేశారని ఆరోపణలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీష్ సిసోడియాను అరెస్ట్ చేశారని, కానీ కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. మోదీకి సపోర్ట్ చేస్తే ఎలాంటి కేసులు ఉండవన్నారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమమని, అరెస్ట్ విషయంలో చట్టాలన్ని తుంగలో తొక్కారని మధుయాష్కీ గౌడ్ ఆరోపించారు. చంద్రబాబు వల్లే కేసీఆర్ ఎదిగారని, ఆయనపై కసితోనే పార్టీ పెట్టారని అన్నారు.