మనలో చాలా మంది చేసే పని కూరగాయలు కోసుకుని వాటి తొక్కలు తీసి చెత్త బుట్టలో వేసేస్తాం. కానీ నిజానికి కూరగాయల తొక్కలు ఉపయోగించి రుచికరమైన వంటకాలు చేసుకోవచ్చు. కొన్ని కూరగాయల గోకకలు అయితే కూరగాయల కంటే ఎక్కువ పోషకాలు అందిస్తాయి. వాటిని పడేయకుండా ఇలా ఉపయోగించి రకరకాల వంటలు చేసేసుకోండి.
చట్నీ
కూరగాయల తొక్కలు ఉపయోగించి ఇంట్లో రుచికరమైన చట్నీ తయారు చేసుకోవచ్చు. భారతీయ వంటకాల్లో కూరగాయల తొక్కలని తిరిగి ఉపయోగించే సంప్రదాయ మార్గాలలో ఇదీ ఒకటి. బీరకాయ తొక్కతో చేసే పచ్చడి అందుకు ఉదాహరణ. బీరకాయ కంటే దాని తొక్కతో చేసే పచ్చడి టేస్ట్ సూపర్ గా ఉంటుంది.
సూప్
క్యారెట్,బంగాళాదుంప, ఉల్లిపాయలు, వెల్లులి వంటి కూరగాయల తొక్కలు పడేయకుండా జాగ్రత్తగా ఉంచుకోవచ్చు. వీటిని ఉడకబెట్టుకుని రుచికరమైన సూప్, పులుసు తయారు చేసుకోవచ్చు. ఈ తొక్కలు అన్నింటినీ సుగంధ ద్రవ్యాలు వేసి బాగా ఉడికించుకోవాలి. ఆ నీటిని వడకట్టుకుని సూప్, వంటలు, రిసోట్టోలకు బేస్ గా ఉపయోగించుకోవచ్చు.
చిప్స్
బంగాళాదుంప, చిలగడదుంపతో పాటు ఇతర కూరగాయల తొక్కలతో క్రీస్పీగా స్నాక్స్ చేసుకోవచ్చు. తొక్కలు శుభ్రంగా నీటిలో వేసి బాగా కడిగి పెట్టుకోవాలి. వాటిలో కొద్దిగా నూనె, ఉప్పు వేసుకుని బాగా వేయించుకోవాలి. అందులో మీకు ఇష్టమైన మసాలా దినుసుల పొడి వేసుకుని గోధుమ రంగు వచ్చేవరకు ఓవెన్ లో కాల్చుకోవాలి. అంతే టేస్టీగా ఉండే క్రీస్పీ స్నాక్స్ రెడీ అయిపోతాయి.
సాట్
గుమ్మడికాయ, దోసకాయ, వంకాయ వంటి అనేక రకాల కూరగాయల తొక్కలు వేయించుకుని తినొచ్చు. వాటిని సన్నగా కట్ చేసి మాంసం, సుగంధ ద్రవ్యాలు, సాస్ లేదా మసాలాతో ఉడికించుకుని తినవచ్చు.
ప్యూరీ
వంటలకు మంచి రుచి జోడించుకునేందుకు కూరగాయలు తొక్కలని ప్యూరీలు, సూప్ లో కలుపుకోవచ్చు. ఉదాహరణకి బ్రకోలి స్టెమ్స్, క్యారెట్ పీల్స్ క్రీమ్ వెజిటబుల్ సూప్ లో కలుపుకోవచ్చు. సూప్ మంచిగా రావాలంటే పీల్స్ ముందుగా ఉడికించుకుని మెత్తగా చేసుకోవడం ముఖ్యం.
క్యారెట్ తొక్కలతో ప్రయోజనాలు
క్యారెట్ తొక్కలను ఎండబెట్టి వాటిని పొడి చేసుకోవాలి. ఈ పొడిని కూర లేదా సూప్ లో ఉపయోగించవచ్చు. పోషక విలువలు పెంచుకోవడానికి సలాడ్స్ లో కూడా వీటిని జోడించుకోవచ్చు. శాండ్ విచ్, ర్యాప్ ఇలా ఏ రుచికరమైన వంటకం మీద చక్కగా అలంకరించడానికి ఉపయోగించుకోవచ్చు.
ఉల్లిపాయ తొక్కలతో లాభాలు
ఉల్లిపాయ పొడిని నీటిలో కలుపుకుని కాసేపు నానబెట్టాక తాగేయాలి. ఇలా చేయడం వల్ల కండరాల తిమ్మిరి వంటివి తగ్గుతాయి. కండరాలు ఫ్లెక్సిబుల్‌గా మారతాయి. ఉల్లిపాయ తొక్కలతో టీ కూడా చేసుకోవచ్చు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ టీ తాగడం వల్ల మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: కొరియన్ అమ్మాయిల అందం వెనుక సీక్రెట్ తెలిసిపోయిందోచ్!