Rose Green tea Benefits : ఉదయాన్నే టీ లేదా కాఫీ తాగకపోతే నాకు రోజు ప్రారంభమే కాదు అనేవాళ్లు చాలామందే ఉన్నారు. అయితే ఆరోగ్యంపై అవగాహన ఉన్నవారు మాత్రం తమ డేని గ్రీన్ టీతో స్టార్ట్ చేస్తారు. ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలు అందించినా.. చేదుగా ఉంటుందనే భావనతో కొందరు గ్రీన్ టీకి దూరంగా ఉంటారు. అలాంటివారికి రోజ్ గ్రీన్ టీ ప్రత్యామ్నాయం అని చెప్పవచ్చు. ఇది మంచి రుచిని అందించడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. మరి ఈ రోజ్ గ్రీన్ టీని ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటో? ఎలాంటి ఆరోగ్యప్రయోజనాలు పొందవచ్చో చూసేయండి.

  


కావాల్సిన పదార్థాలు


గ్రీన్ టీ బ్యాగ్ - 1


రోజ్ వాటర్ - 1 టీస్పూన్


నీళ్లు - 1 1/2 కప్పు


ఎండిన గులాబీ రేకులు - 1 టేబుల్ స్పూన్


తేనె - 1 టీస్పూన్


తయారీ విధానం


ముందుగా స్టవ్ వెలిగించి దానిలో నీటిని పోయండి. అది మరిగిన తర్వాత ఎండిన గులాబీ రేకులు వేయండి. అవి బాగా మరిగిన తర్వాత దానిలో తేనె కలపండి. ఇప్పుడు కప్పులోకి దానిని వడకట్టి రోజ్ వాటర్ వేసి కలిపి, గ్రీన్ టీ బ్యాగ్ వేయండి. కాసేపు అలాగే ఉంచి టీ బ్యాగ్ తీసేయండి. అంతే రోజ్ గ్రీన్ టీ సిద్ధం. 



మీ ఇంట్లో గులాబీ మొక్కలు ఉంటే మీరే మీరు ఎండిన గులాబీ రేకులు తయారు చేసుకోవచ్చు. లేదంటే మార్కెట్లలో కూడా ఇవి లభ్యమవుతాయి. లేదంటే రోజ్ గ్రీన్ టీ బ్యాగ్స్ కూడా అందుబాటులోనే ఉంటాయి. వాటితో కూడా మీరు దీనిని తయారు చేసుకోవచ్చు. పూర్తిగా యాంటీ ఆక్సిడెంట్లతో నిండిన రోజ్ గ్రీన్ టీ మీ ఆరోగ్యాన్ని సంరక్షించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇది ఫ్రీ రాడికల్స్​కు కారణమయ్యే క్యాన్సర్​తో పోరాడటానికి సహాయం చేస్తుంది. 



రోగనిరోధక శక్తిని పెంచుతుంది


మీరు అనారోగ్యంగా ఉన్నప్పుడు రోగనిరోధక శక్తిని పెంచుకోవాలనుకుంటే గులాబీ గ్రీన్ టీని తాగండి. దీనిలోని విటమిన్ సి.. శరీరంలోని టాక్సిన్స్​ను బయటకు పంపి.. ప్రమాదకరమైన ఫ్రీ రాడికల్స్​ను నుంచి కాపాడుతుంది. ఇది శరీరానికి ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యాన్ని అందిస్తుంది. రెగ్యూలర్​గా దీనిని తీసుకోవడం వల్ల దగ్గు, ఫ్లూ లక్షణాలు కూడా తగ్గుతాయి. అంతేకాకుండా జుట్టు రాలడాన్ని కంట్రోల్ చేస్తుంది. మెరిసే చర్మాన్ని కూడా అందిస్తుంది.


 
నిద్రలేమిని దూరం చేస్తుంది..


నిద్రపట్టడంలో సమస్య ఉంటే మీరు ఒక కప్పు వేడి రోజ్ గ్రీన్ టీ తాగవచ్చు. ఇది ఒత్తిడిని తగ్గించి.. శరీరానికి విశ్రాంతిని అందిస్తుంది. నిద్రలేమి సమస్యలతో మీరు ఇబ్బంది పడుతుంటే కచ్చితంగా దీనిని ట్రై చేయవచ్చు. అంతేకాకుండా పనిలో ఒత్తిడితో సతమవుతున్నప్పుడు కూడా మీరు దీనిని తీసుకోవచ్చు. 



రెగ్యూలర్ పీరియడ్స్ కోసం..


సమయానికి పీరియడ్స్ రాకపోవడం వల్ల మహిళలు ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. అలాంటి వారికి ఇది ఉత్తమమైన నివారణిగా చెప్పవచ్చు. అంతేకాకుండా ఋతుక్రమం సమయంలో నొప్పి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే ఇది మీకు మంచి ఉపశమనం అందిస్తుంది. రోజ్ గ్రీన్ టీని దాదాపు ఆరు నెలలు రెగ్యూలర్​గా తీసుకున్న మహిళలకు.. పీరియడ్స్ సమయంలో తిమ్మిరి, నొప్పి తగ్గి.. సమయానికి పీరియడ్స్ వచ్చాయని ఓ అధ్యయనం తెలిపింది. 


Also Read : బరువు తగ్గడానికి కేలరీలు లెక్కేసి తింటున్నారా? అయితే ఇది మీకోసమే