పానీపూరీ (Panipuri) కి మామూలు అభిమeనులు ఉండరు, అందరూ వీరాభిమానులే. లాక్‌డౌన్ సమయంలో మహమ్మారి గురించి మర్చిపోయి పానీపూరీ తినలేకపోయామని బాధపడే వాళ్ల సంఖ్య కూడా తక్కువేమీ లేదు. బండి కనిపిస్తే చాలు చుట్టూ కనీసం పదిమంది మూగిపోయి, చేతిలో కప్పులతో కనిపిస్తారు. అంతగా పానీపూరీ ప్రజలకు నచ్చేసింది. అయితే ఇది అనారోగ్యకరమైనదని, తినవద్దని ఆరోగ్యనిపుణులు చాలాసార్లు హెచ్చరించారు. అయినా ఎవరూ పట్టించుకోలేదు. డీప్ ఫ్రై చేసిన పూరీలు అధికంగి తినడం వల్ల ఆరోగ్యానికి నష్టం జరుగుతుంది. 


ఆరోగ్యకరమే కానీ...
పానీపూరీలో వాడే నీరు నిజానికి ఆరోగ్యకరమైనదే. దాన్ని మంచినీళ్లు, జీలకర్ర, పుదీనా, చింతపండులతో తయారుచేస్తారు. ఉప్పు మరీ ఎక్కువగా కాకుండా రుచికి సరిపడా వేస్తే మంచిదే. ఇవన్నీ ఇంట్లోనే తయారుచేసి అమ్మితే ఆరోగ్యానికి ఆ నీరు మేలు చేస్తుంది. కానీ ఇప్పుడు రెడీ టు మిక్స్ పానీ పూరీ మసాలాలు ఇప్పుడు అందబాటులో ఉంటున్నాయి. చాలా మంది వాటిని నీళ్లలో కలిపి అమ్మేస్తున్నారు. ఆ రెడీ టు మేడ్ మసాలాలో రాళ్లు ఉప్పు, ఎండు మామిడి, జీలకర్ర, కారం, బ్లాక్ సాల్ట్, పుదీనా రసం, నల్ల మిరియాలు, ఎండు అల్లం, చింతపండు, సిట్రిక్ యాసిడ్ వంటివి వాడతారు. రుచి కోసం ఉప్పు శాతాన్ని అధికంగా ఉపయోగిస్తారు.  


వారికి ప్రమాదం...
బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నవారికి మాత్రం ఈ పానీపూరీ నష్టాన్ని కలిగిస్తుంది. వారు బరువు తగ్గకుండా అడ్డుకుంటుంది. నూనెలో వేయించిన పూరీలు, ఉప్పు నిండిన నీళ్ల వల్ల బరువు ఇంకా పెరుగుతారు. ఉప్పు అధికంగా ఒంట్లో చేరితే అది శరీరంలో నీటి నిల్వను పెంచేస్తుంది. దీని ద్వారా ఇంకా లావు అవుతారు. కాబట్టి అధిక బరువుతో బాధపడేవారు పానీ పూరీ జోలికి పోకూడదు. 


ఒక సర్వింగ్ పానీపూరీలో 329 కేలరీలు ఉంటాయని చెబుతున్నారు ప్రముఖ ఆహార రచయిత తర్లా దలాల్. ఇందులో కార్బోహైడ్రేట్లు 207 కేలరీలు, ప్రోటీన్లు 38 కేలరీలు, కొవ్వు నుంచి 82 కేలరీలు శరీరానికి చేరుతాయి. 


పూరీ హానికరం...
పూరీని దేనితో తయారుచేస్తారో తెలుసా? మైదా, రవ్వ. మైదా వాడకం చాలా ప్రమాదకరమని అందరికీ తెలిసిందే. మైదాతో చేసిన పూరీలను డీప్ ఫ్రై చేసుకుని తినడం వల్ల ఆరోగ్యానికి మరింత ముప్పు కలుగుతుంది. నూనెలో అత్యధిక ఉష్ణోగ్రత వేయించిన పూరీల వల్ల హానికర టాక్సిన్లు కూడా శరీరంలో చేరతాయి. కాబట్టి పానీపూరీని దూరం పెట్టడం మంచిది. 


అందులోనూ చాలా మంది రోడ్డుసైడున అమ్మే పానీపూరీ వ్యాపారులు దాన్ని మరింత అపరిశుభ్రంగా తయారుచేస్తున్నారు. స్వచ్చమైన నీళ్లను వాడే వారు కూడా చాలా తక్కువగా ఉన్నారు. 


గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.


Also read: మరణం తరువాత జీవితం ఉంటుందా? శాస్త్రవేత్తలు ఏమంటున్నారు?


Also read: