Piles in IT Employees : గంటల తరబడి కూర్చుని పని చేయడం.. జంక్ ఫుడ్, పని ఒత్తిడి, టార్గెట్లు ఇవి అన్నీ ఐటీ ఉద్యోగుల జీవితంలో భాగమైపోయాయి. ఈ కారణాలే పైల్స్ సమస్యకు దారితీస్తున్నాయని సెలబ్రెటీ ఫిట్నెస్ కోచ్ విశ్వభారత్ తెలిపారు. ఈ మధ్యకాలంలో ఐటీ ఉద్యోగుల్లో బరువు పెరగడం, మధుమేహం కన్నా.. పైల్స్ సమస్యలే ఎక్కువగా వస్తున్నాయని తెలిపారు.
ఈ మధ్యకాలంలో 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు వారిలో పైల్స్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. అయితే ఈ సమస్య గురించి బయటకు చెప్పుకోలేక.. సిగ్గుతో దాచుకుంటూ మరిన్ని ఇబ్బందులు పడుతున్నారట. కానీ ఈ సమస్యను గుర్తించి చికిత్స తీసుకోకపోతే పరిస్థితి మరింత దిగజారుతుందని అంటున్నారు విశ్వ. మరి పైల్స్ అంటే ఏంటి? రావడానికి కారణాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూసేద్దాం.
పైల్స్
పైల్స్ అంటే మూత్రనాళం లోపల లేదా బయట ఉండే సిరలు వాచిపోవడం. దీని వల్ల నొప్పి, దురద, రక్తస్రావం వంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్య వస్తే కూర్చోవడం, పడుకోవడం, ఆఖరికి మూత్రానికి వెళ్లాల్సి వచ్చినా ఇబ్బంది పడాల్సి ఉంటుంది.
ఐటీ ఉద్యోగుల్లో ఎందుకు ఎక్కువ?
ఐటీ ఉద్యోగుల్లో, డెస్క్ జాబ్ చేసేవారిలో ఈ సమస్య రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. గంటల తరబడి కూర్చోవడం పెల్విక్ ఏరియాలో రక్తప్రసరణ తగ్గిస్తుంది. ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్ వల్ల ఫైబర్ తక్కువగా అందుతుంది. దీంతో మలబద్ధకం వస్తుంది. పని ఒత్తిడి, డెడ్‌లైన్లు జీర్ణక్రియను దెబ్బతీస్తాయి. అంతేకాదు టాయిలెట్‌లో ఫోన్ వాడటం వల్ల 10 నిమిషాలకంటే ఎక్కువ కూర్చోవడం పైల్స్ రిస్క్‌ను పెంచుతుందని నిపుణులు చెప్తున్నారు.
పైల్స్ లక్షణాలు ఏంటి?
మూత్రం నుంచి బ్లీడింగ్, దురద, నొప్పి, వాపు పైల్స్ ప్రధాన లక్షణాలు. చాలాసార్లు ఇవి తమంతట తాముగా తగ్గుతాయి. కానీ లక్షణాలు తీవ్రమైతే వైద్య సహాయం తప్పనిసరి. చికిత్స తీసుకున్నా 4, 5 వారాలు బాగా ఇబ్బంది పెడతాయి. పూర్తిగా విస్మరిస్తే సర్జరీ వరకు వెళ్లాల్సి వస్తుంది.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..
ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు పైల్స్‌ను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, పప్పు ధాన్యాలు రెగ్యులర్‌గా తినాలి. నీళ్లు పుష్కలంగా తాగాలి. అలాగే ప్రతి గంటకు లేచి కాసేపు నడవండి. సాఫ్ట్ కుషన్ వాడితే మంచిది. టాయిలెట్‌లో ఫోన్ వాడడం మానుకోండి. అలాగే రెగ్యులర్ వ్యాయామం, ఫైబర్ ఫుడ్, మలబద్ధకాన్ని తగ్గించడంలో, పైల్స్‌ను నివారించడంలో హెల్ప్ చేస్తాయి.
ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
ఓవర్ ది కౌంటర్ క్రీమ్స్, ఆయింట్‌మెంట్స్ బాహ్య లక్షణాలకు తాత్కాలిక ఉపశమనం ఇస్తాయి. కానీ లక్షణాలు తగ్గకపోతే తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి. ఆలస్యం చేస్తే పరిస్థితి మరింత విషమించవచ్చు. కాబట్టి ఈ సమస్య, లేదా దాని లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. సిగ్గుపడుతూ చెప్పకపోతే పరిస్థితి చేజారిపోవచ్చు.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం దీనిని క్లిక్ చేయండి.
గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.
