Pancackes With Rice : చలికాలంలో జీర్ణక్రియ మందగించడం వల్ల ఆకలి తక్కువగా ఉంటుంది. అప్పుడప్పుడు ఈ కారణంతోనే రాత్రి సమయంలో లేదా మధ్యాహ్న సమయంలో భోజనం చేయడం మానేస్తూ ఉంటారు. దీనివల్ల అన్నం మిగిలిపోతూ ఉంటుంది. మధ్యాహ్న భోజనాన్ని సాయంత్రం తినమన్నా.. రాత్రి భోజనాన్ని ఉదయం తినమన్నా.. అబ్బా చల్లగా ఉంటుంది అంటారు. అయితే మీ ఇంట్లో ఇలాంటి వారు ఉంటే.. వారు మధ్యాహ్నం లేక రాత్రి తినకుండా అన్నాన్ని మిగిలిస్తే మీరు వారికి కొంచెం కూడా అనుమానం రాకుండానే ఈ రైస్​ని హాయిగా తినిపించేయవచ్చు. 


అదెలా అనుకుంటున్నారా? మీరు మిగిలిపోయిన రైస్​తో వేడి వేడి పాన్​కేక్స్ చేసి ఇస్తే వారికి కనీసం ఇది అన్నమే అన్న ఆలోచన కూడా రాదు. రాత్రి అన్నం మిగిలితే ఉదయాన్నే బ్రేక్​ఫాస్ట్​గా, మధ్యాహ్నం అన్నం మిగిలితే సాయంత్రం స్నాక్​గా మార్చేయవచ్చు. అసలు ఈ రైస్​ పాన్​కేక్స్​ని ఏ విధంగా తయారు చేస్తారో.. దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 


కావాల్సిన పదార్థాలు


అన్నం - 1 కప్పు


మైదా పిండి - 1 కప్పు


చక్కెర - 1 టేబుల్ స్పూన్


బేకింగ్ పౌడర్ - 1 టీస్పూన్


బేకింగ్ సోడా - అర టీస్పూన్


ఉప్పు - పావు టీస్పూన్


పాలు - 1 కప్పు


గుడ్డు - 1 


బటర్ - 2 టేబుల్ స్పూన్లు


వెనిలా ఎసెన్స్ - 1 టేబుల్ స్పూన్


తయారీ విధానం


ఒక పెద్ద మిక్సింగ్ గిన్నెలో పిండి, చక్కెర, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఉప్పు వేసి బాగా కలపండి. ఇప్పుడు మరో గిన్నె తీసుకుని దానిలో పాలు, గుడ్డు, బటర్, వెనిలా ఎసెన్స్ వేసి బాగా కలపండి. ఇప్పుడు పెద్ద మిక్సింగ్​ గిన్నెలోకి పాలు, గుడ్లతో కూడిన మిశ్రమాన్ని మెల్లిగా వేస్తూ.. బాగా కలపండి. ఉండలు లేకుండా కలిపితే పాన్​ కేక్ బాగా వస్తుంది. మొత్తం మిశ్రమాన్ని పిండి మిశ్రమంలో వేసి.. అన్ని బాగా కలిసేలా.. గాలి లేకుండా కలపండి. 


తయారు చేసుకున్న మిశ్రమంలో రైస్ వేసి బాగా కలపండి. రైస్​ను నేరుగా వేసుకోవచ్చు లేదంటే.. మిక్సీ చేసుకుని పిండిలాగా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిపై నాన్​ స్టిక్ పాన్ పెట్టండి. మీడియం మంట మీద ఉంచి.. పాన్​పై కాస్త వెన్నను పూయండి. ఇప్పుడు మిశ్రమాన్ని దానిపై దిబ్బరొట్టిలాగా వేయండి. దానిని రెండు నుంచి మూడు నిమిషాలు ఉడకనివ్వండి. లేదంటే రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దానిని ఫ్రై చేయండి. పాన్​ కేక్​ కాస్త ఉబ్బుతుంది. 


అంతే వేడి వేడి రైస్ పాన్​కేక్స్ రెడీ. దీనిని మీరు వేడిగా సర్వ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన ఫ్రూట్స్​ను టాపింగ్​గా వాడుకోవచ్చు. లేదంటే సిరప్స్​తో లాగించేయవచ్చు. తేనె కూడా వీటికి మంచి టేస్ట్ ఇస్తుంది. పైగా పిల్లలు కూడా వీటిని చాలా ఇష్టంగా తింటారు. కాబట్టి మీకు అన్నం మిగిలిపోతుందన్న, పడేయాలన్నా బాధ ఉండదు. పైగా పిల్లలు కూడా వీటిని ఇష్టంగా, కడుపు నిండా తింటారు. 


Also Read : క్రిస్మస్ స్పెషల్ టూటీ ఫ్రూటీ కేక్.. చాలా ఈజీగా ఇంట్లో చేసేయండిలా


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.