Unclaimed Deposits : ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని (Unclaimed) నిధులు (Deposits)42వేల కోట్లకుపైగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం ( Central Government) వెల్లడించింది. 2021-2022 ఆర్థిక సంవత్సరంలో ఎవరూ క్లెయిమ్ చేయని మొత్తాలు రూ.32,934 కోట్లు ఉంటే, 2023 మార్చి నాటికి అది రూ. 42,272 కోట్లకు చేరింది. భుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల్లో ఎవరూ క్లెయిమ్‌ చేయని నిధుల వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్‌ కరాడ్‌ రాజ్యసభలో వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే...2022-2023 ఆర్థిక సంవత్సరంలో అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్ల విలువ 28 శాతం మేర పెరిగినట్లు తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రూ.36,185 కోట్లు, ప్రైవేటు బ్యాంకుల్లో రూ.6,087 కోట్లు ఉన్నట్లు స్పష్టం చేశారు. 


సెటిల్ మెంట్ల కోసం వంద రోజుల ప్రత్యేక కార్యక్రమం


100 రోజులు 100 చెల్లింపులు పేరుతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. 2023 జూన్‌ 1 నుంచి 2023 సెప్టెంబరు 8 వరకు దేశంలోని అన్ని బ్యాంకుల్లో 100 అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్లను గుర్తించి వాటిని క్లియర్ చేసింది. దేశంలోని 31 ప్రధాన బ్యాంకులు రూ.1,432.68 కోట్లు ఖాతాదారులకు తిరిగి చెల్లించాయి. రిజర్వు బ్యాంకు నిబంధనల ప్రకారం పదేళ్లు, అంతకు మించి నిర్వహణలో లేని డిపాజిట్లను డీఈఏ (DEA)కు బదిలీ చేస్తాయి. అంటే ఆర్‌బీఐ డిపాజిటర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ అవేర్‌నెస్ నిధులకు బ్యాంకులు బదిలీ చేస్తాయి. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో ఉన్న ఇలాంటి డిపాజిట్లను ఖాతాదారులకు అందించేందుకు ఆర్‌బీఐ ప్రత్యేక వెబ్‌పోర్టల్‌ను ప్రారంభించింది. అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్స్ గేట్‌వే టు యాక్సెస్‌ ఇన్ఫర్మేషన్‌ వెబ్‌పోర్టల్‌లో దేశంలోని వివిధ బ్యాంకుల్లో ఉన్న అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్ల సమాచారం తెలుసుకోవచ్చు. 


ఉడ్గమ్ పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చు


ఎవరూ క్లెయిమ్ చేయని డిపాజిట్ల పేరిట ఆ డబ్బులు బ్యాంకుల్లోనే పేరుకుపోతుంటాయి. అలాంటి అకౌంట్ల వివరాలను అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్స్ గేట్‌వే టు యాక్సెస్‌ ఇన్ఫర్మేషన్‌’ (UDGAM) పోర్టల్ ద్వారా చూసుకోవచ్చు. ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, PNB- పంజాబ్ నేషనల్ బ్యాంక్, ధనలక్ష్మి బ్యాంక్ లిమిటెడ్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సౌత్ ఇండియన్ బ్యాంక్ లిమిటెడ్, సిటీ బ్యాంక్, డీబీఎస్ బ్యాంక్ ఇండియా లిమిటెడ్‌ వంటి బ్యాంకులకు సంబంధించిన అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్ల వివరాలు ఈ పోర్టల్‌లో లభ్యం అవుతాయి.  తొలుత ఆర్‌బీఐ UDGAM పోర్టల్ https://udgam.rbi.org.in/unclaimed-deposits/#/login లోకి వెళ్లాలి. లాగిన్ లేదా రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఖాతాదారు పేరు వెల్లడించాలి. ఫలానా బ్యాంకు లేదా అన్ని బ్యాంకులు ఆప్షన్ పెట్టుకోవచ్చు. వివరాలు మరింత మెరుగ్గా రావాలంటే పాన్ , ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, పుట్టిన తేదీ వివరాలు, పాస్ పోర్ట్ వివరాలు వంటివి ఎంటర్ చేయాలి. అలా సెర్చ్ చేస్తే ఆ వ్యక్తుల పేరుతో ఉన్న వ్యక్తులకు సంబంధించిన బ్యాంక్ ఖాతాల వివరాలు కనిపిస్తాయి. ఏదైనా బ్యాంకులో అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు కనిపిస్తే బ్యాంకుకు వెళ్లి అకౌంట్ పునరుద్ధరించుకోవచ్చు.