I.N.D.I.A Alliance Meeting : 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా  కూటమి (I.N.D.I.A Alliance)  పావులు కదుపుతోంది. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ (Bjp) భావిస్తుంటే...ఎలాగైనా చెక్ పెట్టాలని I.N.D.I.A కూటమిలోని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. కమలం పార్టీకి ధీటుగా ఎత్తులు వేయడంలో నిమగ్నమయ్యాయి. ఢిల్లీ(Delhi)లోని అశోకా హోటల్‌ (Ashoka Hotel)లో జరిగిన ఇండియా కూటమి నాలుగో సమావేశంలో కీలక అంశాలపై చర్చించింది. 28 విపక్ష పార్టీల నేతల హాజరయ్యారు.  సమావేశంలో పాల్గొన్న ముఖ్య నేతల్లో మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge), సోనియా గాంధీ (Sonia gandhi), రాహుల్‌ గాంధీ (Rahul gandhi), మమతా బెనర్జీ (Mamatha Benarjee), స్టాలిన్‌ ( Stalin), శరద్‌ పవార్‌, సీతారాం ఏచూరి, డి.రాజా, నీతీశ్ కుమార్‌, కేజ్రీవాల్‌, లాలూ ప్రసాద్‌ యాదవ్‌ తదితరులు ఉన్నారు. మూడుగంటలకు పైగా జరిగిన సమావేశంలో ప్రధాని అభ్యర్థిత్వంతో పాటు పార్లమెంటులో విపక్ష ఎంపీలపై వేటు, రాజకీయ పరిణామాలు, భవిష్యత్‌ కార్యాచరణపై నేతలు చర్చించారు. దేశ వ్యాప్తంగా కనీసం 8 నుంచి 10 సమావేశాలు నిర్వహించాలని అంగీకారానికి వచ్చారు. 


మమతా బెనర్జీ ప్రతిపాదన, వద్దని వారించిన ఖర్గే


ఇటు వైపు నరేంద్ర మోడీ...అటు ఎవరు అన్న దానికి సమాధానం ఇచ్చేందుకు ఖర్గే పేరును తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge)ను ఇండియా కూటమి ప్రధాన మంత్రి (Prime Minister) అభ్యర్థిగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి  మమతా బెనర్జీతో పాటు పలు పార్టీలకు చెందిన సీనియర్‌ నేతలు ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే ప్రధాని అభ్యర్థిత్వంపై ఇప్పుడే ప్రకటన చేయొద్దని ఖర్గే వారించినట్లు తెలుస్తోంది. సమష్టిగా పోరాటం చేసి, విజయం సాధించిన తర్వాత ప్రధాన మంత్రి అభ్యర్థిని నిర్ణయిద్దామని ఖర్గే స్పష్టం చేసినట్లు సమాచారం. పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమి ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై 28 పార్టీల నేతలు ఒక అంగీకారానికి వచ్చారు. పార్లమెంటు ఉభయ సభల నుంచి విపక్ష ఎంపీలను సస్పెండ్‌ చేయడాన్ని ఖండిస్తూ తీర్మానం చేశారు. 


జనవరి మొదటి వారంలో సీట్ల పంపకాలు
2024 జనవరి మొదటి వారంలో కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకాలను ఖరారు చేయనున్నట్లు ఏఐసీసీ  మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎంపీలు ప్రజాస్వామ్యబద్దంగా నిర్ణయం తీసుకుంటారని ఆయన వెల్లడించారు.  తొలుత తాము గెలిచి మెజార్టీ సాధించాలని.. ఆ తర్వాతే ఎంపీలు ప్రజాస్వామ్య బద్ధంగా నిర్ణయం తీసుకుంటారని తేల్చిచెప్పారు. ఈ సమావేశంలో 28 పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు.  ఎంపీల సస్పెన్షన్‌పై డిసెంబర్‌ 22న దేశ వ్యాప్త నిరసనకు దిగాలని ఇండియా కూటమి నిర్ణయించింది. సీట్ల పంపకాలు రాష్ట్ర స్థాయిల్లోనే జరుగుతాయని, అక్కడ ఏదైనా సమస్యలు వస్తే కేంద్ర స్థాయిలో చర్చలు జరిపి అంగీకారానికి వస్తామన్నారు. తమిళనాడు, కేరళ, తెలంగాణ, బిహార్, యూపీ, ఢిల్లీ లేదా పంజాబ్‌ ఎక్కడైనా సరే సీట్ల పంపకంలో సమస్యలు రాకుండా సామరస్యంగా పరిష్కరించుకుంటామని స్పష్టం చేశారు.