ఎలుక ఏజ్ తిరిగొచ్చిందట 


ముసలితనం రాకుండా, ఎప్పటికీ యవ్వనంగా ఉండిపోయే మంత్రమేదైనా ఉంటే బాగుండు అని కొందరు కోరుకుంటారు. కలలు కంటారు. ఈ కల నిజమయ్యే రోజులు దగ్గర్లోనే ఉన్నాయా..? తిరిగి యంగ్‌గా మారిపోవటం సాధ్యమేనా..? అన్న ప్రశ్నలకు కచ్చితంగా సాధ్యమే అని సమాధానమిస్తున్నారు మాలెక్యులర్ బయాలజిస్ట్ డేవిడ్ సిన్‌క్లెయిర్. "వయసైపోతోంది అని ఇకపై బాధ పడాల్సిన పని లేదు. ఏజ్ రివర్సింగ్‌తో వయసుని తిరిగి పొందొచ్చు" అని అంటున్నారు . హార్వర్డ్ మెడికల్ స్కూల్‌లోని ల్యాబ్‌లో ఓ ఎలుకపై ప్రయోగం చేసి ఈ విషయం తేల్చి చెప్పారు. వయసైపోయిన ఓ ఎలుకను తీసుకొచ్చి అది మళ్లీ యంగ్‌గా మారేలా చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. 


రివర్స్ ఏజింగ్‌ ఇలా చేస్తారు


అడల్ట్ సెల్స్‌ని స్టెమ్ సెల్స్‌గా మార్చే సాంకేతికతతో, ప్రోటీన్ల సాయంతో ఎలుకలోని ఏజింగ్ సెల్స్‌ని రీసెట్ చేసింది సిన్‌క్లెయిర్ బృందం. ఈ ప్రయోగంపై 2020లోనే రిపోర్ట్ విడుదల చేశారు. కంటి చూపు మందగించి, రెటీనా దెబ్బ తిన్న ఎలుక ఇప్పుడు మళ్లీ స్పష్టంగా చూడగలుగుతోందని వెల్లడించారు. ఈ ఎలుక శాశ్వతంగా యవ్వన దశలోనే ఉంటుందని చెబుతున్నారు సిన్‌క్లెయిర్. దాదాపు రెండు దశాబ్దాలుగా రివర్స్ ఏజింగ్‌ సాంకేతికతపై డేవిడ్ సిన్‌క్లెయిర్ పరిశోధనలు చేస్తున్నారు. రివర్స్ ఏజింగ్‌ విజయవంతమైతే మనకొచ్చిన జబ్బులన్నీ నయమైపోయి ఆరోగ్యంగా జీవించేందుకు అవకాశముంటుందట. వందేళ్ల లోపు వచ్చే రోగాలన్నింటినీ అధిగమించవచ్చట. ఈ రివర్స్ ఏజింగ్ టెక్నాలజీ లక్ష్యం కూడా జబ్బులను నయం చేయటమే అన్నది సిన్‌క్లెయిర్ అభిప్రాయం.  ఏజింగ్ సెల్స్‌ని రీసెట్ చేసిన వెంటనే ఎలుక జ్ఞాపకశక్తి పెరిగిందని, మెదడులోనూ మార్పులు వచ్చాయని చెప్పింది శాస్త్రవేత్తల బృందం. ఎలాంటి హాని కలిగించని వైరస్‌ని జన్యువుల్లోకి ఇంజెక్ట్ చేయటం ద్వారా ఎలుకకు కంటి చూపు తిరిగొచ్చిందని చెప్పారు సిన్‌క్లెయిర్. మనుషుల్లోనూ ఇదే తరహా టెక్నాలజీ వినియోగించి తిరిగి యవ్వనంగా మార్చవచ్చని చాలా ధీమాగా చెబుతున్నారు శాస్త్రవేత్తలు. 


మన శరీరంలో బ్యాకప్ కాపీ, అంటే ఏంటి..?


మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే సాధారణంగా మనం ఏదైనా ముఖ్యమైన ఫైల్స్‌ ఉంటే వాటిని బ్యాకప్ చేసుకుంటాం. తరవాత అవసరమైనప్పుడు తీసుకుని వినియోగిస్తాం. మన శరీరంలోనూ యవ్వనానికి సంబంధించిన సమాచారమంతా సెల్స్ రూపంలో నిక్షిప్తమై ఉంటుందట. దీన్నే సైంటిఫిక్ భాషలో "బ్యాకప్ కాపీ" అని పిలుస్తారు. రివర్స్ ఏజింగ్‌ సాంకేతికతతో ఈ బ్యాకప్ కాపీని తిరిగి వినియోగించుకునేందుకు వీలవుతుంది. తద్వారా మళ్లీ యవ్వనంగా మారిపోవచ్చన్నమాట. ప్రపంచమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ అద్భుతం జరగటానికి ఇంకెంతో సమయం పట్టదని అంటున్నారు. ఈ టెక్నాలజీ ఏదో కాస్త త్వరగా రావాలని కోరుకుందాం మరి.